ఉత్త‌రప్ర‌దేశ్ నుంచి మ‌ధ్య‌ప్ర‌దేశ్ కు.. బైక్ పై వెళ్లి పెళ్లి

కరోనాను అరిక‌ట్టేందుకు కేంద్ర ప్ర‌భుత్వం లాక్ డౌన్ విధించ‌డంతో చాలా పెళ్లిళ్లకు ఆటంకం ఏర్ప‌డింది. లాక్ డౌన్ కంటే ముందే పెళ్లి ముహుర్తాలు నిశ్చయించుకున్న వారు కొంద‌రు త‌మ వివాహాల‌ను వాయిదా వేసుకోగా.. మ‌రికొంద‌రు మాత్రం అనుకున్న ముహుర్తానికే పెళ్లి చేసుకుంటున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ పెళ్లికొడుకు మధ్యప్రదేశ్ లోని పెళ్ళికూతురు ఇంటికి బైక్ పై వెళ్లి సరిగ్గా అనుకున్న సమయానికి ఆమ్మాయి మెడలో మూడు ముళ్ళూ వేసేశాడు.

ఉత్తరప్రదేశ్ కు చెందిన ఇందాల్ రైఖ్వార్ కు లాక్ డౌన్ కు ముందు మధ్యప్రదేశ్ లోని తికమ్ ఘర్ జిల్లాలోని డియోరహ గ్రామానికి చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. అయితే లాక్ డౌన్ కారణంగా పెళ్లి వాయిదా వేసుకోవాలని మొదట భావించినా…లాక్ డౌన్ మరింతకాలం కొనసాగుతుందేమోన‌ని భావించి రైఖ్వార్ అనుకున్న సమయానికే పెళ్లి చేసుకోవాల‌నుకున్నాడు. ఇందుకు వధువు కుటుంబసభ్యులు కూడా అంగీకరించారు.

దీంతో యూపీ లోని తన స్వగ్రామం అశోక్ నగర్ నుంచి మ‌ధ్య‌ప్ర‌దేశ్ లోని వధువు గ్రామానికి బైక్ పై రైఖ్వార్ బయలుదేరాడు. తనతో పాటు తన తండ్రి,ఇద్దరు సోదరులను కూడా వెంట‌ తీసుకెళ్లాడు రైఖ్వార్. మధ్యప్రదేశ్ చేరుకుని అనుకున్న సమయానికి వధువు మెడలో మూడు ముళ్లు వేశాడు.

ఈ సందర్భంగా రైఖ్వార్ మాట్లాడుతూ…దేశంలో కరోనా పరిస్థితి రానురాను దారుణంగా మారుతుంది. ఎటువంటి మెరుగైన పరిస్థితులు కనిపించడంలేదు. దీంతో అత్తగారి ఇంటి దగ్గరే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని బైక్ పై వెళ్లి పెళ్లి చేసుకున్నాను అని తెలిపాడు.

Latest Updates