రామ మందిరంపై వైఖరి కంటే కరోనాను ఎదుర్కోవడమే కీలకం

కేరళ సీఎం పినరయ్ విజయన్
తిరువనంతరపురం: రామ మందిర భూమి పూజ కార్యక్రమంపై పలు పార్టీలు, ప్రముఖ నేతలు తమ మద్దతు తెలుపుతున్నారు. రాముడు అంటే ప్రేమ అని రాహుల్ గాంధీ అన్నారు. మందిర నిర్మాణానికి మద్దతిస్తూ ప్రియాంక కూడా పలు వ్యాఖ్యలు చేశారు. ‘సరళత, నిబద్ధత, ధైర్యం, నిగ్రహం, త్యాగం అనేవి దీనబంధు అయిన రాముడి పేరుకు అర్థాలు. రాముడు అందరితో ఉన్నాడని’ ప్రియాంక ట్వీట్ చేశారు. మరో కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కూడా రాముడు ఏ వివాదంలోనూ చిక్కుకోకూడదనేదే తమ పార్టీ వైఖరి అని ప్రస్ఫుటం చేశారు. ఈ నేపథ్యంలో వామపక్ష పార్టీ అయిన సీపీఐ (ఎం) నేత, కేరళ సీఎం పినరయ్ విజయన్ రామ మందిరంపై స్పందించారు. తమ వైఖరి ఏంటనేది పార్టీ ఎప్పుడో వెల్లడించిందన్నారు. దేశంలో కరోనా విజృంభిస్తున్నందున ఫోకస్ అటు దిశగా చేయాలన్నారు.

‘మా పార్టీ ఇప్పటికే తన వైఖరిని స్పష్టం చేసింది. నేను దాన్ని తిరగదోడాల్సిన అవసరం లేదు. మన దేశంలో కరోనా కేసుల సంఖ్య 19 లక్షలు దాటింది. మనం దీన్ని ఎలా అధిగమించాలనే దానిపైనే ఫోకస్ చేయాలి. ఈ క్రైసిస్ కారణంగా కొందరు ప్రజలు దారిద్ర్య రేఖ దిగువకు నెట్టబడ్డడారు. మిగతా విషయాల గురించి తర్వాత మాట్లాడొచ్చు. ప్రియాంక గాంధీ స్టేట్‌మెంట్‌పై నేను పెద్దగా ఆశ్చర్యపోలేదు. అవి మిమ్మల్ని కూడా అంతగా సర్‌‌ప్రైజ్ చేయకపోవచ్చు. కాంగ్రెస్ వైఖరి ఏంటనేది మాకు ఎప్పుడూ తెలుసు. రాజీవ్ గాంధీ, నరసింహారావు స్టాండ్ ఏంటి.. ఈ ప్రతిస్పందనలు చరిత్రలో భాగాలు. కాంగ్రెస్‌కు సెక్యులరిజంపై స్పష్టమైన భావనలు ఉంటే ఇండియాలో పరిస్థితి మరోలా ఉండేది. మృదువైన హిందూత్వను కాంగ్రెస్ అవలంభిస్తూ వస్తోంది. సంఘ్ పరివార్ కార్యకర్తలు బాబ్రీ మసీదును కూల్చినప్పుడు వారిపై ఎవరు చూసీ చూడనట్టుగా భిన్నంగా వ్యవహరించారో ఇట్టే అర్థమైపోతుంది’ అని విజయన్ చెప్పారు.

Latest Updates