39 సెకన్లకో చిన్నారి బలి

బోసినవ్వుల చిన్నారులు ఐదేండ్లు కూడా నిండకుండనే ఈ లోకం విడిచి పోతున్నరు. ఒక్క న్యుమోనియా వల్లే ప్రపంచవ్యాప్తంగా ప్రతి 39 సెకన్లకు ఒక చిన్నారి ఊపిరి గాలిలో కలిసిపోతోంది. గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఐదేండ్లలోపు పిల్లలలో 8 లక్షల మంది చిన్నారులు న్యూమోనియా వల్లే చనిపోయారని యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్ (యునిసెఫ్) ‘న్యుమోనియా అండ్ డయేరియా రిపోర్ట్’లో వెల్లడించింది.
వీరిలో ఎక్కువ మంది చిన్నారులు పుట్టిన రెండు రోజులకే చనిపోతుండగా, 1.53 లక్షల మంది పిల్లలు నెల రోజుల్లోనే కన్నుమూస్తున్నారని యునిసెఫ్​పేర్కొంది.  ప్రపంచవ్యాప్తంగా రోజూ 2200 మంది ఐదేండ్లలోపు పిల్లలు న్యుమోనియాకు బలవుతున్నారని యునిసెఫ్​ తెలిపింది. గత ఏడాది మొత్తం ఐదేండ్లలోపు పిల్లల మరణాల్లో 15 శాతం మరణాలు న్యుమోనియా వల్లే సంభవించాయి. దీని తర్వాత అత్యధికంగా 4.37 లక్షల పిల్లలు డయేరియా వల్ల, 2.72 లక్షల పిల్లలు మలేరియా వల్ల చనిపోయారు. ప్రపంచవ్యాప్తంగా ఇన్​ఫెక్షన్ల ద్వారా వచ్చే వ్యాధులకు కేటాయిస్తున్న నిధుల్లో న్యుమోనియా నివారణకు కేవలం 3% మాత్రమే ఖర్చు చేస్తున్నారని, అన్ని దేశాలు ఈ నిధులను భారీగా పెంచాల్సిన అవసరముందని నివేదిక సూచించింది.

 రెండో స్థానంలో ఇండియా

గత ఏడాది న్యుమోనియా వల్ల ఐదేండ్లలోపు పిల్లల మరణాలు ఎక్కువగా ఉన్న దేశాల్లో నైజీరియా మొదటి స్థానంలో నిలిచింది. నైజీరియాలో 1.62 లక్షల మంది చిన్నారులు చనిపోగా,  ఆ తర్వాత ఇండియాలో 1.27 లక్షల మందితో ఇండియా రెండో స్థానంలో ఉంది.  పాకిస్తాన్ మూడో స్థానం (58 వేలు), కాంగో నాలుగో స్థానం (40 వేలు), ఇథియోపియా ఐదో స్థానం(32 వేలు) నిలిచాయి. ఊపిరితిత్తుల వాపు (న్యూమోనియా)తో పిల్లలు చనిపోతుండటానికి, పేదరికానికి మధ్య బలమైన సంబంధం ఉందని అనలిస్టులు చెబుతున్నారు. పేదలకు స్వచ్ఛమైన తాగునీరు దొరకకపోవడం, సరైన వైద్య సౌకర్యాలు లేకపోవడం, పోషకాహార లోపం, ఎయిర్ పొల్యూషన్ వంటివి చిన్నారులను న్యుమోనియా రూపంలో బలితీసుకుంటున్న ప్రధాన కారణాలని వారు  పేర్కొంటున్నారు. 50శాతం కారణం గాలి కాలుష్యమేనంటున్నారు.  వచ్చే జనవరిలో స్పెయిన్​లో ‘గ్లోబల్ ఫోరం ఆన్ చైల్డ్ హుడ్ న్యుమోనియా’ పేరుతో ప్రపంచస్థాయి కాన్ఫరెన్స్ నిర్వహించాలని యునిసెఫ్​ నిర్ణయించింది

Latest Updates