నిద్రిస్తున్న కవలలపై దూసుకెళ్లిన ట్రాక్టర్

one-child-killed-in-tractor-accident-in-karimnagar-

ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు

కరీంనగర్ క్రైం, వెలుగు :  కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలో విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. ఎలగందల గ్రామంలో ఎండల తీవ్రతకు ఇంట్లో ఉండలేక… ఇంటి ముందు చెట్టుకింద అన్నా చెల్లెళ్లు హాయిగా ఆదమరిచి నిద్రపోయారు. ఇంతలో అటుగా ట్రాక్టర్ రూపంలో వచ్చిన మృత్యువు అందులో ఓ చిన్నారి ప్రాణాల్ని బలితీసుకుంది. చెట్టుకింద పడుకుంటున్న ఇద్దరి పై నుంచి ట్రాక్టర్ దూసుకెళ్లింది. ఈ ఘటనలో చెల్లి మృతిచెందగా..  అన్న తీవ్రగాయాల పాలయ్యాడు.

పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లా కరికెళి గ్రామానికి చెందిన వలిసే యల్లప్ప, కమలవ్వ దంపతులు ఉపాధి నిమిత్తం గత కొంతకాలం క్రితం ఎలగందల గ్రామానికి వలస వచ్చారు. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి లక్ష్మీబాయి, రాము(7)  ఇద్దరు కవలలు ఉన్నారు. ఈ పిల్లలిద్దరూ సోమవారం ఉదయం ఇంటి ముందున్న చెట్టు కింద నిద్రిస్తున్నారు. సమీపంలో ఉన్న ట్రాక్టర్‌ను డ్రైవర్ ఇసుక తీసుకురావడం కోసం వెనక్కి తీశాడు. ఈ క్రమంలో ట్రాక్టర్‌ చిన్నారులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బాలిక అక్కడికక్కడే మృతి చెందగా.. గాయాలైన బాలుడిని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని వివరాలు సేకరించారు. ఈ మేరకు లైసెన్స్ లేకుండా వాహనం నడిపిన  డ్రైవర్ గిన్నె సంతోష్ , ఓనర్ పై  304 పార్ట్ 2, 337 సెక్షన్ల కింద  కేసు నమోదు చేసినట్లు కొత్తపల్లి ఎస్ఐ స్వరూప్ రాజ్ తెలిపారు.

Latest Updates