ఇప్పటివరకు అక్కడ కరోనా సోకలేదంట.!

కోవిడ్‌‌–19 మహమ్మారి ప్రపంచం మొత్తాన్ని లాక్‌‌డౌన్‌‌తో కట్టడి చేసింది.  ప్రజల్ని నెలల తరబడి ఇంటికి పరిమితం చేసింది. బయటకు వస్తే ఎక్కడ అంటుకుంటుందో అనే భయంతో బతికేలా చేస్తోంది.  నిన్నమొన్నటి దాకా కేసులు రాని ప్లేసుల్లో కూడా పాజిటివ్‌‌ కేసులు వస్తున్నాయి. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎవరికి, ఎలా అంటుకుంటుందో అర్థంకాని పరిస్థితి. కానీ, ఇలాంటి పరిస్థితుల మధ్య ఈ భూమ్మీద ఇప్పటివరకు కరోనా సోకని ప్లేస్‌‌గా అంటార్కిటికా ఖండం మిగిలింది. ఇంతకీ వైరస్‌‌ కట్టడికి అక్కడ ఎలాంటి చర్యలు చేపడుతున్నారు?

భూమ్మీద అతి చల్లని ప్లేస్‌‌ అంటార్కిటికా ఖండం.  దాదాపుగా 97 శాతం మంచుతో కప్పి ఉంటుంది. ఈ ప్రాంతంలో జనాభా ఐదు వేలకు పైనే ఉంటుంది. వీళ్లలో మెజార్టీ జనాభా సైంటిస్టులు, రీసెర్చర్లు ఉన్నారు.  వివిధ దేశాలకు చెందిన 70కి పైగా బేస్‌‌ క్యాంపులు తమ రీసెర్చ్‌‌ను కొనసాగిస్తున్నాయి. వేసవి కాలంలో నాలుగు వేల మంది, వింటర్‌‌లో వెయ్యి మంది రీసెర్చర్లు ఇక్కడికి వస్తుంటారు. వీళ్లు కాకుండా అక్కడక్కడ విసిరేసినట్లు సాధారణ ప్రజానీకం జీవిస్తుంది. పెంగ్విన్‌‌లు, తిమింగలాలు, సీల్స్‌‌, ఆల్బాట్రోసెస్‌‌, అరుదైన మొక్కల జాతులు కూడా ఈ ఖండంలో ఉన్నాయి. అయితే ఇక్కడ రెగ్యులర్‌‌గా టూరిస్టుల తాకిడి కూడా ఉంటుంది. అందుకే ఎక్కడికక్కడ కట్టడి చేసి..  కరోనా వైరస్‌‌ వ్యాప్తి చెందకుండా అడ్డుకుంటున్నారు. డబ్ల్యూహెచ్‌‌వో కోవిడ్‌‌–19పై ప్రకటన చేసిన తర్వాత ఇప్పటి వరకు ఇక్కడ ఒక్క కరోనా పాజిటివ్‌‌ కేసు నమోదు కాలేదని ప్రకటించారు సైంటిస్టులు.

టెస్టులు చేశాకే..

అంటార్కిటికాలో మామూలు రోజుల్లోనే చాలా జాగ్రత్తగా ఉంటారు. ఇక్కడికి వచ్చే ప్రతీ టూరిస్ట్, రీసెర్చర్‌‌, సైంటిస్టులకు చెక్‌‌ పాయింట్‌‌ల వద్ద హెల్త్ టెస్టులు చేశాకే లోపలికి అనుమతిస్తారు. ముఖ్యంగా ‘ఫ్లూ’ లక్షణాలు ఉన్నవాళ్లకు మరిన్ని టెస్టులు చేస్తారు. ఎందుకంటే అక్కడ ఆక్సిజన్‌‌ లెవల్‌‌ తక్కువగా ఉంటుంది. శ్వాస సమస్యలు ఉన్నవాళ్లకు ముందస్తుగా తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. పూర్తిగా  స్క్రీనింగ్‌‌ జరిగాకే ఎవరినైనా లోపలికి అనుమతిస్తారు. టూరిస్టులను, సెమినార్లకు వచ్చేవాళ్లను మినహాయించి మిగతావాళ్లనంతా ఐసోలేషన్‌‌, కంటైన్‌‌మెంట్‌‌లో ఉంటారు. అక్కడే వాళ్ల రీసెర్చ్‌‌, స్టడీలు కొనసాగుతాయి.  అలాంటిది కోవిడ్‌‌–19 వల్ల ఆ టెస్టులు మరింత పకడ్బందీగా మారాయి. ఈ లెక్కన ‘కరోనా’ అంటార్కిటికాలో అడుగుపెట్టే అవకాశమే లేదని సైంటిస్టులు ధీమాగా చెప్తున్నారు.

ఒకవేళ ఎవరైనా కరోనా బారిన పడితే మాత్రం చాలా కష్టమంటున్నారు కూడా.  వేగంగా వ్యాపించే వైరస్‌‌.. తక్కువ జనాభా ఉన్న అంటార్కిటికాలో త్వరగా..  ఎక్కువగా డ్యామేజ్‌‌ చేసే అవకాశం ఉంది. పైగా ఇక్కడ ఆస్ట్రేలియా, జర్మనీ స్టేషన్‌‌లలో మాత్రమే ఆక్సిజన్‌‌ లెవల్‌‌ సెటప్స్‌‌ ఉన్నాయి. పైగా ఈ ఖండానికి దగ్గర్లో ఎక్కడా హాస్పిటల్‌‌ లేదు. వేల కిలోమీటర్ల దూరంలో సౌత్ అమెరికా దేశం చిలీకి వెళ్లాల్సిందే. ఆ లోపు ఏదైనా జరిగే అవకాశం ఉంది. అందుకే ఆరోగ్య సమస్యలు ఉన్నవారిపై ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. పర్సనల్ హైజీన్‌‌పై అవగాహన పెంచుతున్నారు. విశేషం ఏంటంటే.. కరోనా పరిస్థితుల తర్వాత ఇక్కడ శానిటైజర్ల వాడకం పెరిగిందని చెప్తున్నారు బ్రిటన్‌‌ ‘రోథెరా’ స్టేషన్‌‌ను లీడ్ చేస్తున్న ప్రొఫెసర్‌‌ మైక్‌‌ బ్రియాన్.

తృటిలో తప్పింది 

ఈ ఏడాది మొదట్లో కరోనా హెచ్చరికలను చాలాదేశాలు పట్టించుకోలేదు. కానీ, అంటార్కిటికా మాత్రం ఎలర్ట్‌ అయ్యింది. ఆ ప్రాంతానికి వెళ్లే ప్రతీ ఒక్కరినీ థర్మల్‌‌ స్క్రీనింగ్‌‌ తర్వాతే లోపలికి అనుమతిస్తోంది. అయితే ఏప్రిల్‌‌లో టూరిస్టులతో కూడిన ఒక క్రూయిజ్‌‌ అంటార్కిటికాకు చేరుకోవాల్సి ఉంది. అందులో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌‌కు చెందిన రెండు వందల మంది టూరిస్టులు ఉన్నారు. వాళ్లందరికీ కరోనా టెస్టులు చేయించాలని అంటార్కిటికా రీసెర్చ్‌‌ స్టేషన్‌‌ అసోషియేషన్‌‌ కోరింది.  వాళ్లలో 70 శాతం మందికి పాజిటివ్‌‌ ఉన్నట్లు తేలింది టెస్టుల్లో. దీంతో ఉరుగ్వే, రియో డి ల ప్లాటా దగ్గర ఆ క్రూయిజ్‌‌ను ఆపేశారు. స్పెషల్ ఫ్లైట్లలో వాళ్లందరినీ ఆస్ట్రేలియాకు తరలించి, ట్రీట్‌‌మెంట్ అందించారు. ఒకవేళ ఆ క్రూయిజ్‌‌ను గనుక అనుమతించి ఉంటే అంటార్కిటికాకు భారీ డ్యామేజ్‌‌ జరిగి ఉండేదని సైంటిస్టులు చెప్తున్నారు. ప్రస్తుతం సైంటిఫిక్‌‌ రీసెర్చ్‌‌ కోసం వచ్చేవాళ్లను అదీ తక్కువ సంఖ్యలో లోపలికి అనుమతిస్తున్నారు. అతికొద్ది మంది ఎమర్జెన్సీ స్టాఫ్‌‌తో మాత్రమే రీసెర్చ్‌‌ స్టేషన్స్‌‌ నడిపిస్తున్నారు. అంటార్కిటికాలో పర్యావరణ సదస్సులు ఎక్కువగా జరుగుతుంటాయి. కరోనా ఎఫెక్ట్‌‌ వల్ల ఈ ఏడాది జరగాల్సిన కాన్ఫరెన్స్‌‌లన్నీ క్యాన్సిల్‌‌ చేశారు.

మన విషయానికొస్తే..

మన దేశం 1981 నుంచి అంటార్కిటికాలో బేస్‌‌ క్యాంపులు రన్‌‌ చేస్తోంది. ‘మైత్రి, భారతి’.. ఈ రెండూ బేస్‌‌ క్యాంపుల్ని సెటప్‌‌ చేశారు. ప్రతీ సమ్మర్‌‌, వింటర్‌‌లో రీసెర్చర్స్‌‌ ఇక్కడికి చేరుకుని పరిశోధనలు చేస్తారు. నవంబర్‌‌లో మన దేశం తరపున 39వ ఫేజ్‌‌ ప్రారంభమైంది. ఈ ఫేజ్‌‌లో ఇరవై మూడు మంది రీసెర్చర్లు ‘భారతి’ బేస్‌‌ క్యాంపులో పరిశోధనలు మొదలుపెట్టారు. వీళ్లందరి హెల్త్‌‌ను డాక్టర్‌‌ ప్రదీప్‌‌ తోమర్‌‌ ఎప్పటికప్పుడు అబ్జర్వ్‌‌ చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడి పరిస్థితులను వివరిస్తూ  సోషల్ మీడియాలో ఆయన ఒక పోస్ట్‌‌ పెట్టారు. ‘‘కరోనా కారణంగా ఐసోలేషన్, క్వారంటైన్‌‌, లాక్‌‌డౌన్‌‌ లాంటి  పదాలు జనాలకు తెలిశాయి. కానీ, అంటార్కిటికాకు రీసెర్చ్‌‌ కోసం వచ్చేవాళ్లకు  ఆ పదాలేం కొత్త కాదు.  మైనస్‌‌ 40 డిగ్రీల సెల్సియస్‌‌ టెంపరేచర్‌‌, 200 కిలోమీటర్ల వేగంతో వీచే చల్లని గాలుల మధ్య క్యాంపులలో ఉండాల్సి ఉంటుంది. సూర్యుడు రెండు నెలలపాటు కనిపించడు. పూర్తిగా చీకటి అలుముకుంటుంది.  ప్రపంచం మొత్తం ఇప్పుడు మా పరిస్థితిని ఎదుర్కొంటుందని ఊహించలేకపోయాం. ప్రస్తుతం కరోనా గురించి హైలెవల్‌‌ సిబ్బందికి మాత్రమే అప్‌‌డేట్స్‌‌ ఇస్తున్నారు.   కమ్యూనికేషన్‌‌కి పదే పదే అనుమతించరు. దీంతో టీమ్‌లో చాలామంది తమ కుటుంబ సభ్యుల గురించి ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి వాతావరణంలో డిప్రెషన్‌‌లోకి వెళ్లే ఛాన్స్‌‌ ఉంటుంది. అందుకే లైబ్రరీలు, ఇండోర్‌‌ గేమ్స్‌‌, థియేటర్‌‌లతో రిలాక్స్ అవుతారు. సరిపడా తిండి ఉంది కాబట్టి సమస్య లేదనే భావిస్తున్నాం’’ అని ఆయన పేర్కొన్నారు.

అక్కడి మాటేంటి?

బయటి ప్రపంచానికి దూరంగా.. మోడర్న్‌ మనుషులకు నిషేధిత ప్రాంతాలుగా మిగిలిన దీవుల సంగతేంటి?. వాటిల్లో కరోనా జాడ లేదా? అంటే.. ‘లేదనే’ అంటున్నారు సైంటిస్టులు. నార్త్‌‌ సెంటినెల్ ఐల్యాండ్‌‌(అండమాన్‌‌ దీవుల్లో ఒకటి) తరహా దీవులు ఈ భూమ్మీద డజనుకి పైనే ఉన్నాయి. అక్కడ ఉండే తెగలు, బయటి వాళ్లను దీవుల్లోకి అడుగుపెట్టనివ్వరు. కాబట్టి, కరోనాకు అక్కడిదాకా చేరుకోకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాడు కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన సీనియర్‌‌ సైంటిస్ట్‌‌ జేమ్స్‌‌ రిగోటిన్‌‌. ‘‘వాళ్లవి ఐసోలేషన్‌‌ జీవితాలు. పైగా తెగ ప్రజల రోగ నిరోధక శక్తి.. మనతో పోలిస్తే  డిఫరెంట్‌‌గా ఉంటుంది. కాబట్టి కావాలని ఎవరైనా కరోనాని మోసుకెళ్తే తప్ప.. వాళ్లకు సోకే అవకాశమే లేదు’’ అని రిగోటిన్‌‌ అంటున్నారు.

Latest Updates