35 వేల జాబులకు కోటి మంది అప్లై

ఆర్​ఆర్​బీ ఎన్​టీపీసీ సీబీటీ—-–1 ఎగ్జామ్​ డిసెంబర్​ 28  నుంచి మార్చి నెలాఖరు వరకు నిర్వహించనున్నట్లు రైల్వే బోర్డు ప్రకటించింది. 35,208 పోస్టులకు 1.26 కోట్ల మంది పోటీపడుతున్నారు. ఈ కీలక టైంలో ప్రిపరేషన్​ ఎలా ఉండాలి? ఏయే అంశాలపై ఎక్కువ ఫోకస్​ చేయాలి? స్కోరింగ్​ పెంచే టాపిక్స్​ ఏవి?  మారిన పరిస్థితుల దృష్ట్యా ప్రీవియస్ పేపర్స్​  విశ్లేషణ ఎంత వరకు ఉపయోగపడుతుంది? లాంటి అంశాలను చర్చిద్దాం.

సీబీటీ-1 ఎగ్జామ్​లో జనరల్​ అవేర్​నెస్​, మ్యాథమెటిక్స్, జనరల్​ ఇంటెలిజెన్స్​ అండ్​ రీజనింగ్​ విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి.

1) జనరల్​ అవేర్​నెస్​ ( 40 మార్కులు); 2) మ్యాథమెటిక్స్​ ( 30 మార్కులు); 3) జనరల్​ ఇంటెలిజెన్స్​ & రీజనింగ్​ ( 30 మార్కులు). మొత్తం 100 ప్రశ్నలను 90 నిమిషాల్లో  సాధించాలి. సరైన సమాధానానికి ఒక మార్కు, తప్పు సమాధానానికి వన్​ థర్డ్​ కోత విధిస్తారు. ప్రతి ప్రశ్నకు సుమారు 54 సెకండ్ల సమయం ఉంటుంది. ప్రశ్నల సరళి కొంతవరకు సులభంగా ఉన్నా సమయం తక్కువ ఉంటుంది కాబట్టి ప్రాక్టీస్​ చేస్తే అక్యూరసీ, స్పీడ్​ పెంచుకోవచ్చు.

జనరల్​ అవేర్​నెస్​పై పట్టు..

జనరల్​ అవేర్​నెస్​లో భాగంగా అభ్యర్థి ముఖ్యంగా స్టాటిక్​ జీకే, కరెంట్​ ఎఫైర్స్​, ఇండియన్​ హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, జనరల్​ సైన్స్​, సైన్స్​ అండ్​ టెక్నాలజీ , కంప్యూటర్​ గురించి బేసిక్​ నాలెడ్జ్​ పెంపొందించుకోవాలి.

కరెంట్​ ఎఫైర్స్ లో భాగంగా ప్రతి రోజు కనీసం రెండు న్యూస్​ పేపర్స్​ చదవాలి. గడిచిన సంవత్సర కాలంలో జరిగిన వివిధ రకాల సదస్సులు, సమావేశాలు వాటి థీమ్స్​, రాజకీయ మార్పులు, ఆర్థిక సామాజిక మార్పులు, ముఖ్యంగా  కరోనా వైరస్​ ప్రభావం, మొదలగు సమకాలీన అంశాలపై విశ్లేషణాత్మక అవగాహన పెంపొందించుకోవాలి.

స్టాటిక్​ జీకేలో ముఖ్యాంశాలు

దేశాలు – రాజధానులు – కరెన్సీలు; దేశాలు – అధ్యక్షులు; దేశాలు – జాతీయగీతాలు; దేశాలు – జాతీయ పుష్పాలు; అంతర్జాతీయ సంస్థలు ‌‌‌‌– భూసరిహద్దులు

ప్రసిద్ధ కట్టడాలు; జలసంధులు; నదితీర నగరాలు

పార్కులు, బయోస్పియర్​ రిజర్వాయర్లు; ప్రముఖ సరస్సులు – జలపాతాలు; గిరిజన తెగలు – నృత్యాలు

గ్రంథాలు – రచయితలు కమిటీలు – కమిషన్లు – ఆపరేషన్లు; ప్రథమ వ్యక్తులు; ముఖ్యమైన దినోత్సవాలు; జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలు; సైన్స్​ అండ్​ టెక్నాలజీ అంశాలపై  ఫోకస్​ చేయాలి.

చరిత్ర: హిస్టరీ సబ్జెక్ట్​ నుంచి ప్రధానంగా వివిధ యుద్ధాలు, ఒడంబడికలు జరిగిన సంవత్సరాలు, జైన, బౌద్ధ మతాలు, రాజవంశాల కాలక్రమం, ముఖ్యమైన శాసనాలు, రాజులు – బిరుదులు, ప్రముఖ కవులు, గ్రంథాలు – రచయితలు, భక్తి ఉద్యమకారులు, భారతదేశాన్ని సందర్శించిన విదేశీ యాత్రికులు, దండయాత్రలు, బ్రిటీష్​ కాలంలోని కమిషన్లు, స్వాతంత్ర్య సమరయోధులు మొదలగు అంశాలు చదవాలి.

పాలిటీ: పాలిటీలో రాజ్యాంగ పరిషత్​ ముఖ్యంశాలు, రాజ్యాంగంలోని భాగాలు, షెడ్యూల్స్​, ముఖ్యమైన ప్రకరణలు, రాజ్యాంగ సవరణలు, ప్రాథమిక హక్కులు, విధులు, ఆదేశిక సూత్రాలు, కేంద్ర ప్రభుత్వం, పార్లమెంట్​, సుప్రీంకోర్ట్​, రాష్ట్రప్రభుత్వం, హైకోర్టు లాంటి అంశాలపై ప్రాథమిక అవగాహన పెంపొందించుకోవాలి.

ఎకానమీ: అర్థశాస్త్రంలో నీతిఆయోగ్​, ద్రవ్యం, జాతీయాదాయం, పేదరికం, కేంద్ర, రాష్ట్ర బడ్జెట్​, వ్యవసాయరంగం, పారిశ్రామికరంగం, సేవారంగం, ఆర్థికసర్వే లాంటి అంశాలు ప్రిపేర్​ అవ్వాలి.

జాగ్రఫీ: జాగ్రఫీలో హిమాలయాలు, అడవులు, పీఠభూములు, ఖనిజాలు, నదీవ్యవస్థ, దేశనైసర్గిక స్వరూపం, రైల్వే వ్యవస్థ, విశ్వం, గ్రహాలు, నక్షత్రాలు, మహాసముద్రాలు, పంటలు, రుతువులు మొదలగు అంశాల గురించి అవగాహన పెంచుకోవాలి.

జనరల్​ సైన్స్​: జనరల్​ సైన్స్​లో భాగంగా వ్యాధులు, రక్తవర్గాలు, విటమిన్​లు, భౌతికశాస్త్ర కొలతలు, ప్రమాణాలు, ఆవర్తనపట్టిక, ఆమ్లాలు– క్షారాలు, రసాయనిక నామాలు చదవాలి.

ప్రాక్టీస్​తో మ్యాథ్స్​లో స్కోరింగ్

ఈ విభాగంలో ప్యూర్​ మ్యాథ్స్​, అర్థమెటిక్​ అంశాలు ఉంటాయి. ప్రీవియస్​ పేపర్స్​ ప్రాక్టీస్​ చేయడంతో ఏ టాపిక్స్​ నుంచి ఎక్కువ ప్రశ్నలు అడుగుతున్నారో తెలుస్తుంది. 

అర్థమెటిక్​: సంఖ్యావ్యవస్థ, నిష్పత్తి-అనుపాతాలు (వయస్సులు, భాగస్వామ్యం), శాతాలు (లాభనష్టాలు, బారువడ్డీ –చక్రవడ్డీ), సరాసరి, కాలం‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-–పని (పైపులు తొట్టెలు), కాలం-–దూరం ( రైళ్లు, పడవులు ప్రవాహాలు).

ప్యూర్​ మ్యాథ్స్​: ప్రాథమిక బీజగణితం, రేఖాగణితం, సాంఖ్యాకశాస్ర్తం, త్రికోణమితి, క్షేత్రమితి టాపిక్స్​పై ఎక్కువ ఫోకస్​ చేయాలి.

ప్రతి టాపిక్​కు నిర్దిష్టమైన సమయం కేటాయించుకొని ఎక్కువ ప్రశ్నలు ప్రాక్టీస్​ చేయాలి. దీంతో స్పీడ్, అక్యూరసీ పెరిగి ఎక్కువ స్కోర్​తో అనుకున్న జాబ్​ సాధించవచ్చు.

రీజనింగ్​పై స్పెషల్​ ఫోకస్​

ఈ విభాగంలో భాగంగా వెర్బల్​ అండ్​ నాన్​ వెర్బల్​ రీజనింగ్​ ప్రాక్టీస్​ చేయాలి. ఇందులో మంచి స్కోర్ సాధించే అవకాశం ఉంటుంది కావున ఎక్కువ ఫోకస్​ చేయాలి. ప్రీవియస్​ పేపర్స్​లో సీటింగ్​ అరేంజ్​మెంట్​, ఫజిల్​ టెస్ట్​, లాజికల్​ వెన్​ డయాగ్రమ్స్​ మరియు డాటా ఇంటర్​ప్రిటేషన్​కి సంబంధించిన ప్రశ్నలు ఎక్కువగా ప్రాక్టీస్​ చేయాలి. అనాలజీ, భిన్నపరీక్ష, శ్రేడులు, కోడింగ్​ – డీకోడింగ్​, గణిత పరిక్రియలు, రక్త సంబంధాలు, దిక్కులు, ర్యాంకింగ్​, తీర్మానాలు, వెన్​ డయాగ్రామ్స్​, మిస్సింగ్​ నంబర్స్​, సీటింగ్​ అరేంజ్​మెంట్స్, ఫజిల్స్​, డేటా ఇంటర్​ ప్రిటేషన్​ టాపిక్స్​పై ఫోకస్​ చేయాలి. 

Latest Updates