లక్షల్లో అప్లికేషన్లు వందల్లో నిర్మాణాలు

రంగారెడ్డి జిల్లా, వెలుగు :పేదలను ఊరిస్తున్న డబుల్​ బెడ్​ రూం ఇండ్లు ఆచరణ సాధ్యం అయ్యేట్లుగా లేవు. జిల్లాలో వచ్చిన దరఖాస్తులు, ప్రభుత్వం మంజూరుచేసిన ఇండ్లు, వాటిలో జరుగుతున్న నిర్మాణాల గణాంకాలే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఇళ్లులేని నిరుపేదలందరికీ ఒక్క పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వమే  డబుల్​ బెడ్​ రూం ఇండ్లను నిర్మించి ఇస్తుందని సీఎం కేసీఆర్​ చాలా సందర్భాల్లో ప్రకటించారు.    జిల్లాల వారీగా ఇండ్ల కేటాయింపులపై ప్రభుత్వం ఉత్తర్వులు(జీవో) జారీ చేసింది. అందులో భాగంగా రంగారెడ్డి జిల్లాకు 6,777 ఇండ్లను కేటాయించింది. వాస్తవానికి  జిల్లాలో 1,89,433 మంది ఇండ్ల కోసం దరఖాస్తులు చేసుకున్నారు.  వాటిలో  గ్రామీణ ప్రాంతాల నుంచి  1,02,285 దరఖాస్తులు ఉండడం గమనార్హం.  ప్రభుత్వం అధికారికంగా 6,777 డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లను కేటాయించినప్పటికీ ఆచరణలో మాత్రం 6,645 ఇండ్లనే మంజూరు చేసింది. వాటిలోనూ 6,149 ఇండ్ల నిర్మాణాలకు టెండర్లను ఆహ్వానించారు.  కానీ టెండర్లలో కేవలం 2,567 ఇండ్ల నిర్మాణాలే  ఫైనల్​ అయినట్లు జిల్లా అధికారులు పేర్కొనడం గమనార్హం.  టెండర్లలో  ఖరారైన వాటిలో కేవలం  1,077 డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణాలకు మాత్రమే క్షేత్రస్థాయిలో పనులు జరుగుతున్నాయి.

బయపడుతున్న కాంట్రాక్టర్లు…

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టత్మకంగా తీసుకున్న డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మించేందుకు కాంట్రాక్టర్లు వెనుకముందు ఆడుతున్నారు. ప్రభుత్వం నిర్థేశించిన రేటు కాంట్రాక్టర్లకు గిట్టుబాటు కాకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తున్నది.   ఒక్క డబుల్‌ బెడ్ రూం ఇంటిని  500 ఎస్‌ఎఫ్‌టీ విస్తీర్ణంలో నిర్మించేందుకు గ్రామీణ ప్రాంతంలో రూ.5,00,300ల ఖర్చు,  అదే  పట్టణ ప్రాంతాల్లో రూ.5.30లక్షల వరకు ఖర్చుగా ప్రభుత్వం ధరలను నిర్ణయించింది.

గృహ నిర్మాణానికి సంబంధించి సిమెంట్‌, స్టీల్‌, కంకర, ఇసుక ధరలు గణనీయంగా పెరగడం, భవన నిర్మాణ కార్మికులకు చెల్లించే కూలీ రేట్లు కూడా పెరగడంతో తమకు గిట్టుబాటు కావడం లేదని కాంట్రాక్టర్లు ససేమిరా అంటూ ముందుకు రావడం లేదు. ఇండ్ల  నిర్మాణానికి సంబంధించి పలు దఫాలు పంచాయతీ రాజ్‌, ఆర్‌అండ్‌బీ   అధికారులు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ఎవ్వరూ పాల్గొనకపోవడం ఇందుకు నిదర్శనం. ప్రభుత్వం డబుల్​ బెడ్​రూం ఇండ్ల నిర్మాణానికి కనీసం రూ.7 లక్షలు ఇస్తే తమకు గిట్టుబాటు అవుతుందన్న అభిప్రాయాన్ని కాంట్రాక్టర్లు వ్యక్తం చేస్తున్నారు.   మరో పక్క ఇళ్ల నిర్మాణ విషయంలో స్థల సేకరణ కూడా పెద్ద ఇబ్బందిగా మారింది. పట్టణ ప్రాంతాలలో ప్రభుత్వ భూములు వివిధ అవసరాలకు వినియోగించడం, ప్రైవేట్‌ భూములు కొనాలంటే ప్రభుత్వం చెల్లించే ధర బహిరంగ మార్కెట్‌లో ఉన్న డిమాండ్‌ అనుగుణంగా లేకపోవడంతో సొంత ఇంటి కల సాకారానికి అడుగడుగునా అవరోధాలు ఏర్పడుతున్నాయి.