అనుమతిస్తే చివరిసారిగా నా కొడుక్కి తినిపిస్తా: నిర్భయ దోషి తల్లి

శుక్రవారం ఉరి శిక్ష నిర్భయ దోషులకు ఉరి శిక్ష ఖాయమైంది. ఈ నేపథ్యంలో నలుగురు దోషుల్లో ఒకడైన వినయ్ శర్మ తల్లితో కొన్ని జాతీయ మీడియా సంస్థల ప్రతినిధులు మాట్లాడే ప్రయత్నం చేశారు. అయితే వారితో మాట్లాడేందుకు మొదట్టో ఆమె ఒప్పుకోలేదు. ఆ తర్వాత నెమ్మదిగా ఆమె తనలో బాధను చెప్పుకుంది.

మన చేతుల్లో ఏం లేదు.. అంతా దేవుడి ఇష్టం..

‘‘ఇప్పుడు మీరేం రాస్తారు. మీ రాతల వల్ల ఇప్పటి వరకు ఏమైనా జరిగిందా? దేవుడు కోరుకుంటే మా వాడు బతుకుతాడు. లేదంటే లేదు.
అంతా దేవుడి నిర్ణయం. ఏ జరగాలన్నది దేవుడి ఇష్టం. ఇప్పుడు కరోనా వైరస్ వల్ల ఏం జరుగుతోందో చూడండి. ఎవరు బతకాలి. ఎవరు చావలన్నది దేవుడే నిర్ణయిస్తాడు. మనుషులు చేతిలో ఏం లేదు’’ అని చెప్పింది నిర్భయ దోషి వినయ్ శర్మ తల్లి.

ఎప్పుడూ ఆహారం తీసుకెళ్లనివ్వలేదు

గతంలో తన కొడుకు చూసేందుకు తీహార్ జైలు దగ్గరకు వెళ్లినప్పుడు తనతో ఏ ఆహారాన్నీ లోపలికి తీసుకెళ్లనివ్వలేదని తెలిపింది వినయ్ శర్మ తల్లి. అయితే ఇప్పుడైనా అనుమతిస్తే చివరిసారిగా తన కొడుక్కి పూరీ, సబ్జీ, కచోరీ తినిపించాలని ఉందని చెప్పిందామె. అయితే ఆమె కొడుకుపై మమకారం చంపుకోలేక బాధపడుతుంటే.. నిర్భయ దోషుల్లో మాత్రం చావు భయం తప్ప మరే ఫీలింగ్ లేనట్లు తెలుస్తోంది. గతంలో ఫిబ్రవరి 1న ఉరి వేయాలని కోర్టు డెత్ వారెంట్ ఇచ్చినప్పుడు తీహార్ జైలు అధికారులు జనవరి 23న దోషులందరినీ చివరి కోరిక ఏంటని ప్రశ్నించగా వాళ్లు ఏం సమాధానం చెప్పలేదని వార్తలు వచ్చాయి. నలుగురు దోషులూ మౌనంగా ఉన్నారని జైలు అధికారుల ద్వారా తెలిసింది.

నిర్భయ దోషులకు దారులన్నీ మూసుకుపోయాయి. మార్చి 20న (శుక్రవారం) ఉదయం 5.30 గంటలకు ఉరి తీయడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు చట్టంలోని లూప్ హోల్స్ అడ్డం పెట్టుకుని మూడుసార్లు ఉరి అమలును వాయిదా వేయించుకోగలిగారు దోషులు. అయితే చివరి ప్రయత్నంగా గురువారం కూడా నిర్భయ దోషుల్లో ఒకడైన వినయ్ శర్మ సుప్రీం కోర్టులో క్యూరేటివ్ పిటిషన్ వేశాడు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తన క్షమాభిక్ష పిటిషన్ ను తిరస్కరించడంలో ప్రొసీజర్ ఫాలో కాలేదని, తన ఉరిని నిలిపేయాలని కోరాడు. అయితే ఆ పిటిషన్ ను సుప్రీం కోర్టు కొట్టేసింది. దీంతో శుక్రవారం ఉదయాన్నే నిర్భయ దోషులు అక్షయ్, పవన్ గుప్తా, ముకేశ్, వినయ్ శర్మలకు ఉరి శిక్ష అమలు ఖాయమని తెలుస్తోంది.

Latest Updates