శంషాబాద్ కిడ్నాప్ కేసులో ట్విస్ట్ : చెన్నైలో ఉండి లండన్ వెళ్లినట్టుగా డ్రామా

లండన్ నుంచి తిరిగొచ్చిన ప్రవీణ్ అనే వ్యక్తిని శంషాబాద్ ఎయిర్ పోర్టులో క్యాబ్ డ్రైవర్ కిడ్నాప్ చేసి.. డబ్బులు లాక్కున్నారన్న కేసు అనేక మలుపులు తిరుగుతూ రాష్ట్రంలో ఆసక్తిరేపింది. ఈ కిడ్నాప్ మిస్టరీని హైదరాబాద్ పోలీసులు ఛేదించారు. పలు ఇంట్రస్టింగ్ నిజాలను బయటపెట్టారు.

పోలీసుల కథనం ప్రకారం.. కిడ్నాప్ డ్రామా.. ఎలా జరిగిందో సీన్ బై సీన్ ఓసారి చూద్దాం. లండన్ నుంచి వచ్చిన ప్రవీణ్… దోమల్ గూడ వెళ్లేందుకు శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ఓ క్యాబ్ బుక్ చేసుకున్నాడు. ఆ తర్వాత.. అతడు తన తండ్రికి ఫోన్ చేసి.. తనను క్యాబ్ డ్రైవర్ కిడ్నాప్ చేశాడనీ.. తనను కొట్టి.. బంగారం, భారీగా యూకే కరెన్సీని దోచుకున్నాడని చెప్పాడు. తాను జనంలేని ఏరియాలో ఉన్నాననీ… అక్కడో కొండ.. దానిపై ఓ గుడి ఉందని ఆనవాళ్లను తండ్రి శేషగిరిరావుకు చెప్పాడు. తీవ్రమైన ఆందోళనతో తండ్రి శేషగిరిరావు శంషాబాద్ పోలీసులకు కంప్లయింట్ చేశాడు.

కేసు నమోదు చేసిన పోలీసులు…  దర్యాప్తు లో అసలు వివరాలు రాబట్టారు.  ప్రవీణ్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తే వాస్తవాన్ని బయటపెట్టాడు. అసలు ప్రవీణ్ కిడ్నాప్ కాలేదనీ… అసలు అతడు లండన్ కే పోలేదని పోలీసులు తేల్చారు. మరో రెండు వారాల్లో పెళ్లి ఉండటంతో… ఆ పెళ్లి ఇష్టంలేక కిడ్నాప్ డ్రామా ఆడాడని తేల్చారు. లండన్ కు వెళ్లకుండా… చెన్నైలోనే ఉండి.. లండన్ కు వెళ్లినట్టు క్రియేట్ చేసి.. తల్లిదండ్రులను నమ్మించి మోసం చేశాడని పోలీసులు చెప్పారు.

Latest Updates