ఒక ట్రంప్.. రెండు అమెరికాలు 

2020 అమెరికా ప్రెసిడెన్షియల్​ ఎలక్షన్లు, ఆ తర్వాతి పరిణామాలు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాయి. అమెరికా రాజకీయాల గురించి కొంచెమే తెలిసిన వారు లేదా ఏ మాత్రం అవగాహన లేని ఇతర దేశస్తులు నవంబర్ 3 నుంచి ఆ దేశంలో ఏం జరగనుందోనని ఆసక్తిగా చూశారు. డెమొక్రటిక్​ పార్టీ అభ్యర్థి జో బైడెన్​ ప్రెసిడెంట్​గా ఎన్నికైనట్టు తుది ఫలితం ప్రకటించడానికి ఐదు రోజులు సమయం పట్టింది. అమెరికా ప్రజాస్వామ్యం ప్రపంచంలోని అనేక దేశాలకు ఆదర్శం. అది పటిష్టమైనది, క్రియాశీలమైనది, పారదర్శకమైనది. కానీ, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు అమెరికా రక్షణ కవచంలోని పగుళ్లను స్పష్టంగా చూపుతున్నాయి. సైద్ధాంతికపరంగా అమెరికా ఓటర్లు నిట్టనిలువుగా చీలిపోవడాన్ని ప్రపంచమంతా గమనిస్తోంది. బలమైన ప్రజాస్వామ్యానికి అది సూచిక కావచ్చు కానీ, ఎన్నికైన అధ్యక్షుడికి సెనెట్ లోనూ, సభలోనూ పెద్ద సమస్యే.

ఇది చారిత్రాత్మకమైనదే కాదు అత్యంత సన్నిహితమైన ఎలక్షన్. మొత్తం ఎన్నికల ప్రక్రియను కరోనా మహమ్మారి ప్రభావితం చేయడంతో మెయిల్ ఇన్ బ్యాలెట్లు, ముందస్తు ఓటింగ్ ఎక్కువగా జరిగింది. కింది స్థాయిలో గందరగోళం చోటుచేసుకుంది. లెక్కింపు సరళి దాన్ని ప్రతిబింబించింది. లెక్కింపులో మోసం జరిగిందని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం డెమొక్రాట్ల ఏలుబడిలో ఉన్న రాష్ట్రాల ఓటర్లను, ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసింది. తమ అభ్యర్థే ఈ ఎన్నికల్లో విజయం సాధించాలని కోరుకునే ఓటర్లు రెండు వైపులా సమానంగా ఉన్నారు. తనను ఓడించేందుకు కుట్ర జరిగిందన్న ట్రంప్ మాటలకు లక్షలాది మంది అమెరికన్లు మద్దతు తెలుపుతున్నారు. అదే సమయంలో ఓటమిపాలవడంతో చవకబారు రాజకీయాలకు ట్రంప్ దిగారని మరికొందరు ఆరోపిస్తున్నారు. ఈ ఎన్నికల్లో చీలికకు దారితీసిన కారణాలకు సంబంధించి కొన్ని ప్రాథమిక ప్రశ్నలు, పరిశీలనలు ఉన్నాయి.

టూ పార్టీ సిస్టం × మల్టీ పార్టీ సిస్టం గేమ్​ ప్లాన్?

మల్టీ పార్టీ వ్యవస్థ ఉన్న ఏ క్రియాశీల ప్రజాస్వామ్యంలోనైనా తమ రాజకీయ ఎజెండాతో ఓటర్లను ఆకట్టుకునేందుకు పార్టీలు సిద్ధాంతాలను రూపొందించుకుంటాయి. ఏ దేశంలోనైతే రెండు లేదా మూడు బలమైన పార్టీలు ఉంటాయో అక్కడి ఓటర్ల సైద్ధాంతిక మద్దతు విస్తృతమవుతుంది. బహుళ పార్టీల ఎన్నికలకు సంబంధించి ఇండియా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్ ఉదాహరణలు. అమెరికాలో మూడో రాజకీ య పార్టీ ఎదుగుదలకు ఏ అడ్డంకీ లేదు. ఎన్నో ఏండ్లుగా ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ ఈ విషయం రెండు ప్రధాన పార్టీలైన డెమోక్రాట్లు, రిపబ్లికన్లను ఒకే తాటిపైకి తీసుకురాలేకపోయింది. ఈ తీవ్రస్థాయి యుద్ధానికి ఇదొక ప్రాథమిక కారణం.

ఫెడరలిజం లోపభూయిష్టమా?

ప్రపంచంలో ఎక్కడా లోపాలు లేని పరిపాలనా వ్యవస్థ లేదు. ఫ్రెంచ్ విప్లవం తర్వాతే ప్రజాస్వామ్యం మొదలైంది. కానీ సమకాలీన ప్రపంచంలో కొన్ని స్వీయప్రకటిత ప్రజాస్వామ్యాలు వాస్తవాలు కాదు. అవి సంకరాలు. ఏది ఏమైనా ప్రస్తుతం అందుబాటులో ఉన్న విధానాలన్నింటిలోకి ప్రజాస్వామ్యం అత్యంత సమర్థవంతమైన వ్యవస్థ. అది దేశ పౌరులకు ప్రాతినిధ్యం వహిస్తుంది. ఒక దేశంలోని రాష్ట్రాల స్వతంత్ర పరిధి అన్నది ప్రజాస్వామ్య చట్రంలో ఒక వివాదాస్పద అంశం. ముఖ్యంగా చారిత్రక విలీన నేపథ్యం, ప్రాంతాల అనుసంధానం కలిగిన పెద్ద దేశాల్లో ఇది ఎక్కువగా ఉంటుంది. ఈ విషయంలో ఇండియా, అమెరికాను పోల్చవచ్చు. సమాఖ్య కేంద్రంగా రాష్ట్రాలకు అపూర్వమైన స్వేచ్ఛ కల్పించిన అమెరికా నిజంగా ఆదర్శప్రాయమైనదిగా చెప్పవచ్చు. అధికారంలో ఉన్న పార్టీ ఈ స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తే అది దేశవ్యాప్తంగా భారీ ఘర్షణలకు దారితీయవచ్చు. కొన్ని సందర్భాల్లో రాష్ట్రాల్లో జరిగే అధికార దుర్వినియోగం జాతీయ అంశంగా కూడా మారుతుంది. 243 ఏండ్లుగా పూర్తిస్థాయి, క్రియాశీలక సమాఖ్య కేంద్రంగా విరాజిల్లుతున్నందుకు అమెరికాను నిజంగా అభినందించాల్సిందే. ఇండియాను రాజ్యాంగ నిర్మాతలు క్వాసీ-ఫెడరల్ యూనియన్ గా అభివర్ణించారు.

మనలాంటి దేశంలో రాష్ట్రాలకు సంబంధించి పాక్షిక స్వాతంత్ర్యాన్ని నిర్వహించడం, ముఖ్యంగా ప్రాంతీయ ఎజెండాలతో బహుళ రాజకీయపార్టీలు ఉన్నప్పుడు పెద్ద సవాల్. ఇండియా లాంటి దేశంలో కేంద్ర ఎన్నికల సంఘం అనేది లేకుండా, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం పూర్తిస్థాయిలో కేంద్ర, రాష్ట్రస్థాయిలో ఎన్నికలు నిర్వహించినప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. సమాఖ్య వ్యవస్థలో వికేంద్రీకరణ చట్రం చుట్టూ ఆవరించిన సమస్యలకు సంబంధించి వ్యవస్థలోని ఘర్షణలు ప్రతిరూపం నేటి అమెరికా ఎన్నికలు. ముఖ్యంగా అధ్యక్ష ఎన్నికలు. ప్రపంచంలో అగ్రదేశంగా, మిగిలిన దేశాలతో గౌరవాన్ని పదిలపరుచుకునేందుకు అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ సజావుగా, లోపరహితంగా, పారదర్శకంగా జరిగిందని ప్రపంచానికి చూపాల్సిన అవసరం అమెరికాకు ఉంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు ఓటమిపాలైనా ఈ గొప్ప ప్రజాస్వామ్యం, దాని స్ఫూర్తి విజయం సాధిస్తుందని నేను భావిస్తున్నాను. కె.కృష్ణసాగర్ రావు, బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి.

Latest Updates