ఇంటర్ ఫెయిలయ్యానని మనస్తాపం : అమ్మాయి ఆత్మహత్య

హైదరాబాద్ : పరీక్షలో పాస్ కాకుంటే జీవితమే లేదనే గుడ్డి నమ్మకం.. సున్నిత మనస్కులైన విద్యార్థుల ప్రాణాలు తీస్తోంది. ఇంటర్మీడియట్ ఫలితాల ప్రకటన తర్వాత హైదరాబాద్ లో ఇద్దరు విద్యార్థులు బలవంతంగా ఉసురు తీసుకున్నారు. ఏఎస్ రావ్ నగర్ లో ఉండే నాగరాజు నిన్న సాయంత్రం ఇంట్లోనే ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు.

నిన్న సాయంత్రం గాంధీనగర్ లోనూ ఓ విషాద సంఘటన జరిగింది. గాంధీనగర్ పీఎస్ పరిధిలో ఉండే ఇంటర్ స్టూడెంట్ అనామిక(16).. కోటి ప్రగతి మహావిద్యాలయలో ఇంటర్మీడియట్ చదువుతుండేది. ఇంటర్ ఫలితాల్లో అనామిక ఓ సబ్జెక్ట్ తప్పింది. అందరూ ఏమంటారోనని మనస్తాపంతో ఆమె ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటనతో వారి ఇంట్లో తీవ్ర విషాదం ఏర్పడింది. పరీక్ష తప్పితే ఎవరూ ప్రాణాలు తీసుకోవద్దంటూ వారి కుటుంబీకులు కన్నీరు పెట్టుకున్నారు.

మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్ మార్చురీకి తరలించారు పోలీసులు.

Latest Updates