కిడ్నాప్ కేసులో కొనసాగుతున్న అరెస్టుల పర్వం.. మాజీ మంత్రి అఖిలప్రియ చెప్పిన వివరాలే కీలకం?

  • తాజాగా 15 మంది అరెస్ట్ చేసిన టాస్క్ ఫోర్స్.. నార్త్ జోన్ పోలీసులు
  • 19కు చేరిన అరెస్టుల సంఖ్య.. పరారీలో ఉన్న మరో 9 మంది కొనసాగుతున్న వేట
  • అఖిలప్రియ ఇచ్చిన సమాచారంతో దూకుడు పెంచిన పోలీసులు

హైదరాబాద్: సీఎం కేసీఆర్ సమీప బంధువులను బోయిన్ పల్లిలో కిడ్నాప్ చేసిన కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. తాజాగా 15 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు మరో 9  మంది కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. పోలీసు కస్టడీలో మాజీ మంత్రి అఖిలప్రియ ఇచ్చిన సమాచారంతో పోలీసులు దూకుడు పెంచారు. కిడ్నాప్ లో పాల్గొన్న వారందర్నీ దొరికిన వారిని దొరికినట్లే పట్టుకుంటున్నారు. కిడ్నాప్ కు ముందు రెక్కీ చేసిన వారిని.. కిడ్నాప్ లో కానిస్టేబుల్ లాగా నటించిన వారిని.. కిడ్నాపర్లు వాడిన స్విఫ్ట్ జైనర్ కారు, ఇన్నోవా కార్లతోపాటు.. నిందితులు టెంపరరీగా ఉపయోగించిన సెల్ ఫోన్లను కూడా సీజ్ చేశామని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ మీడియా సమావేశంలో వెల్లడించారు. టెక్నికల్ ఆధారాలతో నిందితులపై నిఘా పెట్టి.. పక్కా సమాచారం ధృవీకరించుకున్న తర్వాత నిందితులను వలపన్ని పట్టుకున్నామని ఆయన వివరించారు. విచారణ లో మరి కొంత మంది పేర్లు బయటకి వచ్చాయని, ఈ కేసులో భూమా అఖిల ప్రియ ప్రధాన నిందితురాలుగా ఉన్నట్లు గుర్తించామన్నారు. అఖిల ప్రియ కస్టడీలో మరికొన్ని విషయాలు బయట పడ్డాయి, ఈ కిడ్నాప్ కేసులో ఎవరి ప్రమేయం ఏంటి అనేది తేలిందని  ఆయన వివరించారు. కిడ్నాప్ కు ముందు రెక్కీ ఎలా చేసింది.. ఆ తర్వాత కిడ్నాప్ ను ఎలా నిర్వహించింది పట్టుబడిన నిందితులు ఒప్పుకున్నారని ఆయన చెప్పారు.

మొత్తం రెక్కీ నిర్వహించింది బోయ సంపత్, బాల చెన్నయ్య

కిడ్నాప్ కు ప్లాన్ చేసిన తర్వాత ఎలా అమలు చేయాలన్న దానిపై మొత్త రెక్కీ నిర్వహించారు. ప్రధాన నిందితుల సూచనల మేరకు బోయ సంపత్, బాల చెన్నయ్య ఇద్దరూ కలసి రెక్కీ నిర్వహించారు. ఇదే విషయాలను వారు పోలీసుల ముందు ఒప్పుకున్నారు. వారు రెక్కీ చేసేటప్పుడు.. కిడ్నాప్ సమయంలో వాడిన సెల్ ఫోన్లను సీజ్ చేశారు. అందులోని ముఖ్య సమాచారం డిలిట్ చేసినా.. సాంకేతిక ఆధారాలతో రికవరీ చేసి.. కేసుకు కీలక ఆధారంగా ఉపయోగించుకుంటామని సీపీ వివరించారు. రెక్కీ చేయడానికి ముందు.. ఆ తర్వాత వారు ఎవరెవరిని సంప్రదించింది అన్న వివరాల ఆధారాలు సేకరిస్తున్నామని చెప్పారు.

కిడ్నాప్ అమలులో కీలకపాత్ర పోషించిన మాదాల సిద్ధార్థ్, గుంటూరు శ్రీను

సంచలనం సృష్టించిన ఈ కిడ్నాప్ అమలులో కీలక పాత్ర పోషించింది ఈవెంట్ మేనేజర్ అయిన మాదాల సిద్ధార్థ్ (29), అతని సన్నిహితుడైన మాదాల శ్రీను అలియాస్ గుంటూరు శ్రీను అని పోలీసులు గుర్తించారు. కిడ్నాప్ వ్యూహం అమలు కోసం  సిద్ధార్థ్ 20 మంది యువకులను రెడీ చేశాడు. అతను వాడిన స్విఫ్ట్ డిజైర్ వాహనం ఏపీ 07ఈడీ, 0875,  శాంసంగ్ మొబైల్ ఫోన్ సీజ్ చేశామని సీపీ అంజనీకుమార్ వివరించారు.

  • అరెస్టు చేసిన నిందితుల్లో బొజ్జగల్లి దేవప్రసాద్ (24) స్విఫ్ట్ డిజైర్ వాహనాన్ని నడిపినట్లు తేలింది. వీరు వాడిన మరో ఇన్నోవా కారు నెంబర్:  2804 ను కూడా రికవరీ చేశారు. వీరు వాడిన టెంపరరీ ఫోన్ కూడా సీజ్.
  • మరో నిందితుడు మొగలి భాను (25) , అతను వాడిన స్కార్పియో  వాహనం నెం.1088 ను సీజ్ చేశారు.
  • మిగిలిన నిందితులు రాగులు అండ్ జయ, రవిచంద్ర, రాజా అలియాస్ చంద్ర, బనోద్ సాయిలు ఎస్కార్ట్ లా వ్యవహరించారు.
  • కానిస్టేబుల్ లా నటించింది దేవరకొండ కృష్ణ వంశీ, కందుల శివప్రసాద్
  • వీరిద్దరూ కానిస్టేబుల్ డ్రెస్ ధరించి కిడ్నాప్ లో పాలుపంచుకున్నారు. దేవరకొండ నాగరాజు, దేవరకొండ సాయి, ప్రకాష్ వీరింతా కిడ్నాప్ లో పాల్గొన్నవారు.

ఈ కేసులో మరో 15 మంది ప్రమేయం ఉన్నట్లు తేల్చామంటున్నారు సీపీ అంజనీ కుమార్. బోయ సంపత్, బాల చెన్నయ్య అనే ఇద్దరు రెక్కీ నిర్వయించగా గుంటూరు శ్రీను స్నేహితుడు సిద్ధార్థ కార్లు రెడీ చేశారు. కిడ్నాప్ చేసిన సమయంలో కానిస్టేబుల్ డ్రెస్ లో వచ్చిన కిడ్నాప్ చేసిన దేవర కొండ కృష్ణ ను అరెస్ట్ చేశామన్నారు సీపీ.

జనవరి 2వ తేదీనే కిడ్నాప్ కు ప్లాన్ – కలమేశ్వర్, డీసీపీ, నార్త్ జోన్

కిడ్నాప్ కు జనవరి 2వ తేదీన లోథా అపార్టుమెంట్ లో చర్చలు జరిగాయని తమ విచారణలో తేలిందని నార్త్ జోన్ డీసీపీ కలమేశ్వర్ తెలిపారు. ఆయన కథనం మేరకు..  4వ తేదీన భార్గవరామ్ కు చెందిన బంజారాహిల్స్ పక్కన యూసఫ్ గూడ లోని ఎంజీహెచ్ స్కూల్ లో సమావేశమై కిడ్నాప్ కి పథకం వేశారు. కిడ్నాప్ కోసం గుంటూరు శీను స్నేహితుడైన సిద్ధార్థ్ ను సంప్రదించి.. సిద్దార్థ్ కు 5 లక్షలు ఇచ్చి.. కనీసం 20 మంది యువకులను అరెంజ్ చేయమని చెప్పారు. కిడ్నాప్ లో పాల్గొనే వారందరికీ ఒక్కొక్కరీ 25 వేలు ఇస్తామని చెప్పి మాల సిద్ధార్థ్ కు మరో 74 వేలు అదనంగా ఇచ్చారు. సిద్ధార్థ్ కిడ్నాప్ కోసం వచ్చిన 20 మందిని తీసుకొచ్చి కూకట్ పల్లి ఉన్న అట్ హోం అనే లాడ్జ్ లో ఉంచారు. గుంటూరు శ్రీను అందరి కొలతలు తీసుకుని అందరికీ కొత్త డ్రెస్ లు అరెంజ్ చేశారు.

మొయినాబాద్ ఫామ్ హౌస్ లో 10 స్టాంప్ పేపర్లపై సంతకాలు

ప్రవీణ్ రావు సోదరులను కిడ్నాప్ చేసి మెయినాబాద్ వద్ద భార్గవ రామ్ కు చెందిన ఫామ్ హౌస్ కు తీసుకెళ్లిన తర్వాత మల్లికార్జునరెడ్డి, సంపత్ 10 స్టాంప్ పేపర్లు.. తీసుకెళ్లారు. 5 స్టాంప్ పేపర్లు భార్గవరామ్ పేరుతో, జగత్ విఖ్యాత్ రెడ్డిల పేర్లతోరెడీ చేయించుకుని సంతకాలు చేయించుకున్నారు. గుంటూరు శ్రీను, సంపత్, మల్లికార్జున రెడ్డి ముగ్గురు కలసి.. కిడ్నాప్ కోసం 6 మొబైల్ ఫోన్లు.. బొమ్మ తుపాకి, తాడు వేర్వేరు దుకాణాల్లో కొన్నారు.  కిడ్నాప్ కోసం ఉపయోగించిన 5 కార్ల నెంబర్ ప్లేట్లు మార్చేశారు. పాత నెంబర్ ప్లేట్లపై తెల్లకాగితం పై ప్రింట్ చేసిన డమ్మీ నెంబర్లను అతికించి కార్లలో బయటకి వచ్చారు.  సంపత్, బాల చెన్నయ్య ఇద్దరూ మధ్యాహ్నమే.. రెక్కీ చేస్తుండగా.. సాయంత్రం 4 గంటలకు వెహికల్ లో బయలుదేరారు. ప్రవీణ్ కుమార్, నవీన్ కుమార్, సునీల్ కుమార్ లను ముగ్గుర్నీ వేర్వేరు వాహనాల్లో తీసుకెళ్లారు. ఐదు వెహికల్స్ లో ఐటీ అధికారులు ముసుగులో వెళ్లారు. కిడ్నాప్ చేసిన ప్రవీణ్ రావు, నవీన్ రావు , సునీల్ రావు లను ముగ్గుర్నీ మూడు వాహనాల్లో కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. నకిలీ నెంబర్ ప్లేట్స్ తో ఉన్న మూడు వాహనాల్లో కిడ్నాప్ చేసిన తరువాత రెండు వాహనాలను భార్గవ్ రామ్, జగత్ విఖ్యాత్ రెడ్డి ఇద్దరు కూడా వాహనాలు నడిపారు. టెక్నీకల్ ఎవిడెన్స్ ఆధారంగా కేసును ఛేదించి 15 మందిని అరెస్టు చేయడం జరిగిందని డీసీపీ వివరించారు.

ఇవి కూడా చదవండి..

కాబూల్ లో దారుణం.. సుప్రీంకోర్టు మహిళా జడ్జీలపై కాల్పులు

బిడెన్ బృందంలో 20 మంది ఇండో-అమెరిక‌న్లు

సెక్రటేరియట్‌కు రాని సీఎం దేశంలో కేసీఆర్ ఒక్కడే

Latest Updates