డ్రైవర్ బాబు ఇంటి దగ్గర విషాద వాతావరణం.. కొనసాగుతున్న బంద్

హైదరాబాద్ సరూర్ నగర్ సకలజనుల సభకు వెళ్లి ఆర్టీసీ డ్రైవర్ బాబు చనిపోవటంతో.. జేఏసీ ఇచ్చిన పిలుపుతో కరీంనగర్ లో బంద్ కొనసాగుతోంది. జిల్లా వ్యాప్తంగా కార్మికులు నిరసనలు కొనసాగిస్తున్నారు. కరీంనగర్ కేంద్రంలో వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు.

అంతకుముందు డ్రైవర్ బాబు మృతదేహాన్ని కరీంనగర్ డిపో దగ్గరకు తీసుకొచ్చేందుకు జేఏసీ నేతలు ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. బైపాస్ దగ్గర భారీగా మోహరించిన పోలీసులు బాబు మృతదేహాన్ని కరీంనగర్ లోకి తీసుకురాకుండా అడ్డుకున్నారు. జేఏసీ నేతలను అరెస్ట్ చేసి.. మృతదేహాన్ని బైపాస్ గుండా ఇంటికి తరలించారు. అరెస్టు చేసిన జేఏసీ నేతలను కరీంనగర్ సిటీ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కు తరలించారు పోలీసులు.

మరోవైపు ఆర్టీసీ జేఏసీ ఇచ్చిన బంద్ పిలుపుతో బస్టాండ్ దగ్గరకు భారీగా చేరుకున్నారు సీపీఎం,  ఆర్టీసీ జేఏసీ నేతలు. బస్టాండ్ ప్రాంతంలో భారీగా మోహరించిన పోలీసులు.. నేతలను అరెస్టు చేశారు. వ్యాపార, వాణిజ్య వర్గాలు స్వచ్ఛందంగా మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశారు నేతలు. జగిత్యాల జిల్లా కోరుట్ల వెటర్నరీ కళాశాల ముందు గుర్తు తెలియని వ్యక్తులు ఆర్టీసీ బస్సు అద్దాలు ధ్వంసం చేశారు. బస్సులో ప్రయాణికులు లేకపోవటంతో ప్రమాదం తప్పింది.

కరీంనగర్ మండలం ఆరేపల్లిలోని డ్రైవర్ బాబు ఇంటి దగ్గర విషాద వాతావరణం నెలకొంది. బాబు మృతదేహాన్ని చూసేందుకు తోటి కార్మికులు, పార్టీల నేతలు పెద్దఎత్తున తరలివస్తేన్నారు. కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలతో విషాద నెలకొంది.

Latest Updates