రాష్ట్రంలో ఆన్‌‌ గోయింగ్‌‌ ప్రాజెక్టులు ఆగిపోయినట్టే!

    కల్వకుర్తి, ఎస్‌‌ఎల్బీసీ టన్నెల్‌‌, ప్రాణహితకు మంగళం

    అవసరమైన ఖర్చులో వందో వంతు కూడా కేటాయింపుల్లేవు

    ఇప్పటికే ఉన్న బకాయిలకూ కేటాయింపులు చాలవు

    ఇట్లయితే ఆ ప్రాజెక్టులకు ఫుల్‌స్టాప్‌‌ పడ్డట్టే అంటున్న ఇంజనీర్లు

రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న (ఆన్‌‌ గోయింగ్‌‌) ప్రాజెక్టులకు పుల్‌‌ స్టాప్‌‌ పడినట్టు కనిపిస్తోంది. ఆ ప్రాజెక్టుల కోసం ప్రతిపాదించిన ఖర్చులో వందో వంతు మాత్రమే బడ్జెట్​లో కేటాయించడంతో.. వాటిపై ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఇంజనీర్లు అంటున్నారు. ఇప్పటికే వందల కోట్ల బిల్లులు పెండింగ్‌‌ లో ఉన్నాయని, కొత్తగా కేటాయింపులేమీ లేకపోవడంతో కల్వకుర్తి, ఎస్‌‌ఎల్బీసీ టన్నెల్‌‌, ప్రాణహిత ప్రాజెక్టులు ఆగిపోయినట్టేనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

500 కోట్లు అడిగితే.. 2.29 కోట్లు ఇచ్చారు

కల్వకుర్తి లిఫ్ట్‌‌ ఇరిగేషన్‌‌ స్కీంకు 2020–21 బడ్జెట్‌‌లో రూ.500 కోట్లు ఇవ్వాలని మహబూబ్‌‌నగర్‌‌ ప్రాజెక్టుల సీఈ ప్రతిపాదనలు పంపారు. కానీ సర్కారు బడ్జెట్‌‌లో రూ.2.29 కోట్లు మాత్రమే కేటాయించింది. గత ఏడాది కూడా ఈ ప్రాజెక్టుకు రూ.4 కోట్లే ఇచ్చారు. గత ఏడాది ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన ఓటాన్‌‌ ఎకౌంట్‌‌ బడ్జెట్‌‌లో కల్వకుర్తికి రూ.550 కోట్ల కేటాయింపులు చూపారు. సెప్టెంబర్​ లో పెట్టిన ఫుల్‌‌ బడ్జెట్‌‌కు వచ్చేసరికి రూ.4 కోట్లతో సరిపెట్టారు. ఈసారైనా ఎక్కువ నిధులు వస్తాయని ఇంజనీర్లు ఆశించారు. ప్రభుత్వం చాలా తక్కువగా కేటాయింపులు చేసింది. కల్వకుర్తి ప్రాజెక్టుకు సంబంధించి మొత్తం రూ.1,613.81 కోట్ల బిల్లులు పెండింగ్‌‌ ఉండగా ఇందులో ఇప్పటికే చేసిన వర్క్‌‌లకు రూ.79.32 కోట్లు, ల్యాండ్‌‌ అక్విజిషన్‌‌ బిల్లులు రూ.24.18 కోట్లు, ఆర్‌‌ అండ్‌‌ ఆర్‌‌ కు రూ.60 లక్షలు చెల్లించాల్సి ఉంది. ఈ ప్రాజెక్టు నుంచి నీటి ఎత్తిపోతల కోసం వాడిన కరెంట్‌‌ బిల్లులకే రూ.1,509.71 కోట్లు చెల్లించాల్సి ఉంది. కరెంట్‌‌ బిల్లులు, ఓ అండ్‌‌ ఎంకు తొలిసారిగా బడ్జెట్‌‌లో కేటాయింపులు చేసిన ప్రభుత్వం.. కల్వకుర్తి ప్రాజెక్టులో రూ.15 వందల కోట్లకుపైగా బిల్లు పెండింగ్‌‌ ఉన్నా ఒక్క రూపాయి ఇవ్వలేదు.

అవసరం కొండంత.. ఇచ్చింది గోరంత..

భీమా, నెట్టెంపాడు, కోయిల్‌‌ సాగర్‌‌ ప్రాజెక్టుల పనుల కోసం అధికారులు రూ.700 కోట్లతో ప్రతిపాదనలు పంపారు. భీమాకు రూ.3.69 కోట్లు, నెట్టెంపాడుకు రూ.16.70 కోట్లు, కోయిల్‌‌ సాగర్‌‌కు రూ.17.40 కోట్లు కేటాయించారు. విడిగా పాలమూరు ప్రాజెక్టుల నిర్వహణ కోసమని రూ.63 కోట్లు కేటాయించారు.

భీమా ప్రాజెక్టు వర్క్‌‌లకు రూ.7.79 కోట్లు, భూసేకరణకు రూ.22.78 కోట్లు, ఆర్‌‌ అండ్‌‌ ఆర్‌‌కు రూ.7.30 కోట్లు, కరెంట్‌‌ బిల్లులకు రూ.29.76 కోట్లు చెల్లించాల్సి ఉంది.

నెట్టెంపాడు ప్రాజెక్టు వర్క్‌‌లకు రూ.11.47 కోట్లు, భూసేకరణకు రూ.8.98 కోట్లు, ఆర్‌‌ అండ్‌‌ ఆర్‌‌కు రూ.1.83 కోట్లు, కరెంట్‌‌ బిల్లులకు రూ.78.14 కోట్లు పెండింగ్‌‌ ఉన్నాయి.

కోయిల్‌‌ సాగర్‌‌ వర్క్‌‌ ఏజెన్సీలకు రూ.15.69 కోట్లు, ల్యాండ్‌‌ అక్విజిషన్‌‌కు రూ.9 లక్షలు చెల్లించాల్సి ఉంది.

కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌‌సాగర్‌‌ ప్రాజెక్టులకు అన్ని బిల్లులు కలిపి రూ.1,797.65 కోట్లు చెల్లించాల్సి ఉంది. కానీ ప్రాజెక్టుల మెయింటెనెన్స్‌‌, నిర్మాణాలకు కలిపి రూ.103.08 కోట్లు మాత్రమే కేటాయించారు. ఈ అరకొర కేటాయింపులతో ప్రాజెక్టుల పనులు పూర్తిగా నిలిచిపోనున్నాయి.

శ్రీశైలం లెఫ్ట్‌‌ బ్యాంక్‌‌ కెనాల్‌‌ (టన్నెల్‌‌) పనుల్లో ప్రభుత్వం నిర్లక్ష్యం  చూపుతోంది. రూ.3,152.72 కోట్లతో పనులు చేస్తుండగా ఇంకో వెయ్యి కోట్ల వరకు పనులు పెండింగ్‌‌ ఉన్నాయి. దీంతో బడ్జెట్‌‌లో రూ.500 కోట్లు కేటాయించాలని అధికారులు కోరారు. కానీ ప్రభుత్వం 3.16 కోట్లు మాత్రమే ఇచ్చింది. గత ఏడాది కూడా రూ.500 కోట్లతో ప్రతిపాదనలు పంపితే.. రూ.3 కోట్లు మాత్రమే ఇచ్చారు.

ప్రాణహిత ముచ్చట్నే లేదు

మంచిర్యాల, ఆసిఫాబాద్‌‌ జిల్లాల్లోని రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ప్రాణహిత లిఫ్ట్‌‌ స్కీంను పూర్తి చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ప్రాణహిత– చేవెళ్లకు ప్రత్యామ్నాయంగా మొదలు పెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో లింక్‌‌ 1, 2, 4 పనులు పూర్తవుతున్నా.. ప్రాణహిత మాత్రం అడుగు కూడా ముందుకు పడలేదు. బడ్జెట్‌‌లో ప్రాణహిత కోసం  రూ.200 కోట్లు కేటాయించాలని అధికారులు ప్రపోజల్స్‌‌ పంపగా రూ.12 కోట్లే కేటాయించారు. గత బడ్జెట్​లో ఇచ్చింది కూడా రూ.17.31 కోట్లే. ఇప్పటికే ప్రాణహిత వర్క్‌‌ ఏజెన్సీలకు 14 కోట్లు, ల్యాండ్‌‌ అక్విజిషన్‌‌కు రూ.269.12 కోట్లు, ఇతర పనులకు రూ.30 లక్షల బిల్లులు చెల్లించాల్సి ఉంది. వర్క్​ ఏజెన్సీలు ఇప్పటికే ఈ ప్రాజెక్టుల పనులను నిలిపివేశాయి.

Latest Updates