ఉల్లి పంటపై దొంగల కన్ను: రాత్రికి రాత్రే పీకేశారు

మధ్యప్రదేశ్: దొంగల ఆలోచనలు డిమాండ్ కు తగ్గట్టుగా ఉంటాయని నిరూపించారు. ఇంట్లో, బ్యాంకుల్లో గుడిలో దొంగతనాలు చేసే దొంగలను చూశాం. కానీ..ఈ దొంగలు చేసిన పని తెలిస్తే షాక్ కావాల్సిందే. ఉల్లిగడ్డ ధరలు రోజు రోజుకి పెరుగుతుండటంతో.. చివరకు దొంగల కన్ను ఉల్లి తోటలపై పడింది. కష్టపడి రైతు వేసిన ఉల్లి పంటను రాత్రికి రాత్రే దోచేశారు దొంగలు. ఉల్లికి మంచి ధర ఉంది. తన అప్పులన్నీ తీరుతాయనుకున్న అన్నదాత ఆశలు అడిఆశలయ్యాయి. ఈ సంఘటన మధ్యప్రదేశ్ లోని మందసౌర్ లో జరుగగా ఈ విషయం స్థానికంగా కలకలం రేపింది.

వివరాల్లోకెళ్తే.. రిచా గ్రామంలోని జితేంద్ర కుమార్ అనే రైతు ఉల్లిపంట సాగు చేశాడు. తీరా పంట చేతికి వచ్చేసరికి దొంగలు దోచేశారు. రాత్రిపూట చేనులోకి చొరబడ్డ దొంగలు ఉల్లిని తవ్వి గడ్డలను ఎత్తుకెళ్లారు.  చోరీలో సుమారు రూ. 30 వేలకు పైగా విలువ చేసే ఆరు క్వింటాళ్ల ఉల్లి పంటను దొంగలు ఎత్తుకెళ్లారని తెలిపాడు రైతే. దీంతో ఆ  రైతు నారాయణగఢ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పంట పూర్తిగా చేతికి రాకముందే ఉల్లిని ఎత్తుకెళ్లడం స్థానికంగా సంచలనం రేపింది.

దొంగలను వెంటనే పట్టుకోవాలని బాధితుడు వేడుకుంటున్నాడు. కాగా ఉల్లి దొరకడమే బంగారం అన్నట్టుగా తయారైంది ప్రస్తుత పరిస్థితి. దీంతో మార్కెట్లో ఉన్నవాటికే కాదు.. పంట చేలలో ఉన్న వాటిని కూడా వదలడం లేదు. కిలో ఉల్లిపాయలు రూ.100కు చేరుతున్న తరుణంలోనే ఈ దొంగతనం జరిగిందని.. అయితే ఉల్లి పంటను దోచుకుపోయారని రైతు చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు పోలీసులు.

Latest Updates