చీర కొంటే ఉల్లిగడ్డలు ఫ్రీ..

ఇప్పటివరకు బట్టల షాపుల్లో ఎక్కడైనా ఒకటి కొంటే ఒకటి ఉచితం లేదా బట్టలు కొంటే అవి ఇస్తాం ఇవి ఇస్తాం అనే ఆఫర్లను చూశాం. కానీ, ఇక్కడ మాత్రం చీర కొంటే కేజీ ఉల్లిగడ్డలు ఫ్రీ అంట. అవును మహారాష్ట్రలోని థానే ఉల్లాస్ నగర్‌లోని షీతల్ హ్యాండ్‌లూమ్స్ అనే ఒక బట్టల షాపు యజమాని ఈ ఆఫర్ ప్రకటించాడు. ‘చీర కొంటే ఉల్లిగడ్డలు ఫ్రీ’ అని షాపు యజమాని అనౌన్స్ చేశాడు. గత కొన్ని వారాలుగా ఉల్లి ధరలు దేశంలోని అన్ని మార్కెట్లలో కేజీకి రూ. 100 దాటింది. దేశంలో ఉల్లి ధర ఆకాశన్నంటడంతో.. దాన్ని ఎలాగైనా బిజినెస్ చేసుకోవాలని అనుకున్నాడు ఈ యజమాని. అందుకే తమ బట్టల షాపులో రూ. 1000 విలువ చేసే బట్టలు కొంటే కేజీ ఉల్లి గడ్డలు ఉచితంగా ఇస్తామంటూ ఆఫర్ ప్రకటించాడు. అంతే.. చీర కొంటే ఉల్లిగడ్డలు ఫ్రీగా వస్తున్నాయి కదా అని జనం ఒక్కసారిగా ఎగబడ్డారు.

“ఉల్లిపాయలు థానేలో కిలో 130 రూపాయలకు అమ్ముడవుతున్నాయి. కాబట్టి 1,000 రూపాయల బట్లలు కొనుగోలు చేస్తే.. ఒక కిలో ఉల్లిపాయలను ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించాము. దాంతో మా వినియోగదారుల సంఖ్య కూడా భారీగా పెరిగింది” అని షాపు యజమాని చెప్పారు.

కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రావ్ సాహెబ్ డాన్వే శుక్రవారం రాజ్యసభలో ఇచ్చిన సమాధానం ప్రకారం.. ప్రధాన నగరాల్లో ఉల్లిగడ్డ సగటు ధర గత ఏడాదితో పోల్చితే ఐదు రెట్లు పెరిగి కిలోకు 101.35 రూపాయలకు చేరుకుంది. అంతే కాకుండా ఖరీఫ్ సీజన్‌లో 22 శాతం ఉత్పత్తి తగ్గడంతో ఉల్లి కొరత ఏర్పడినట్లు ఆయన చెప్పారు. గత నెలలో ఉల్లిపాయ ధరలు 81 శాతం పెరిగాయి. నెల క్రితం కిలో ఉల్లి గడ్డ రిటైల్ ధర 55.95 రూపాయలు ఉండగా డిసెంబర్ 10న కిలోకు 101.35 రూపాయలకు చేరుకుందని డాన్వే రాజ్యసభలో చెప్పారు.

Latest Updates