సిటీలో ఆన్​లైన్​ పనిమంతులు

ఆన్​లైన్​ యాప్స్​లో బుక్​ చేసుకుంటున్న సిటీ జనాలు

గ్రేటర్ లో ​15 వేలకు చేరిన యూజర్ల సంఖ్య

ఎక్కువగా ఉపయోగించుకుంటోంది మహిళలే

హైదరాబాద్, వెలుగు: సిటీలో నయా ట్రెండ్ నడుస్తోంది. ఇంటి వద్దకే వచ్చి, పనులు చక్కబెట్టే యాప్స్, వెబ్ సైట్లు ఎక్కువైపోయాయి. ఒకప్పుడు బాత్రూం క్లీనింగ్ నుంచి ఎలక్ట్రీషియన్ వర్క్స్​వరకు అన్నింటికి పని మనుషులపైనే ఆధారపడేవారు. అవే పనులను అంతా ఇప్పుడు డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లతో చేయించుకుంటున్నారు. నైపుణ్యం ఉన్నవారి కోసం ఎక్కడికీ తిరగాల్సిన పనిలేకుండానే కూర్చున్న చోటనే అందుబాటు ధరల్లో సర్వీస్ పొందే వీలు కలుగుతోంది.

డిజిటల్ యుగంలో పనులన్నీ మొబైల్, ఇంటర్నెట్ ఆధారంగా జరిగిపోతున్నాయి. ఇప్పటికే షాపింగ్, లాడ్జింగ్, టికెట్ బుకింగ్, హోటల్ భోజనం వరకు అన్నీ ఆన్ లైన్ లేదా మొబైల్ యాప్ లతో జరిగిపోతుండగా, ఆ వరుసలోకి సర్వీస్ ప్రొవైడర్లు వచ్చేశారు. ఇంట్లో అప్పటివరకు పనిచేస్తున్న వస్తువులకు రిపేర్లు, ఇంటి పనులను క్షణాల్లో చక్కబెట్టేందుకు అలా పిలిస్తే ఇలా వచ్చేస్తున్నారు. మొబైల్ లో బుక్ చేసుకున్న అరగంటలోనే సర్వీస్ అందిస్తున్నారు.

పెండింగ్​ ఉండకుండా.. 

వీటిని వాడేవారిలో ఎక్కువగా మహిళలే  ఉంటున్నారు. ఉద్యోగం, వ్యాపారం చేసే మగవాళ్లు బయటకెళ్లిపోతే, ఇంటి పనులు పెండింగ్ లో పడిపోతుంటాయి. అందుబాటు ధరల్లో ఆన్​లైన్​లో లభిస్తుండటంతో మహిళలే మొబైల్ లో అపాయిమెంట్ చేస్తున్నారని హౌజ్ జాయ్ ప్రతినిధులు వెల్లడించారు. కస్టమర్ ఫ్రెండ్లీ, సెక్యూర్ అట్మాస్పియర్ లో ఎలక్ట్రీషియన్, ప్లంబర్, క్లీనింగ్ పనులు చక్కబెట్టేలా చర్యలు తీసుకుంటామని మరో కంపెనీ ప్రతినిధి వెల్లడించారు.

ఏరియా, పేమెంట్ వారీగా..

మొబైల్ లో ఇన్ స్టాల్ చేసుకున్న సర్వీస్ ప్రొవైడర్ యాప్ ఆధారంగా జీపీఎస్ లోకేషన్ తో ఇంటి నుంచి 3 నుంచి 10 కి.మీ పరిధిలో కావాల్సిన నిపుణులు, వర్కర్ల వివరాలు డిస్ ప్లే అవుతాయి. వీటి ఆధారంగా సమయం, ప్రాంతం, బడ్జెట్ వంటి వివరాలను పరిగణనలోకి తీసుకుని అపాయింట్ మెంట్ ఫిక్స్ చేసుకుంటే సరిపోతుంది. బుక్ చేసుకున్న 30 నిమిషాల్లోనే మినిమం రూ.150 నుంచి రూ.10వేలు ఖర్చయ్యే పనులను సులభంగా చేయించుకునే వీలు కలుగుతుంది.

అందుబాటులో 80 రకాలు

పలు రంగాల్లో నైపుణ్యం, అనుభవం ఉండి డిజిటల్ పరిజ్ఞానం ఉన్నవారు మాత్రమే ఈ సేవలు అందించేందుకు ఆసక్తి చూపుతున్నారు. డిజిటల్ సర్వీస్ ప్రొవైడ్ వెబ్ సైట్లు, మొబైల్ యాప్ లలో ఎన్ రోల్ చేసుకున్న జాబితా 15 వేల మందికిపైగా ఉన్నారు.  సిటీలో ప్రస్తుతం 80 రకాల పనులలో సేవలు పొందే వీలుందని అర్బన్ క్లాప్ కంపెనీ వెల్లడించింది. మెయిన్​గా గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మియాపూర్, కూకట్ పల్లి, అయ్యప్ప సొసైటీ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, హిమాయత్ నగర్, బేగంపేట, అమీర్ పేట, మెహిదీపట్నం, అమీర్ పేట, విద్యానగర్ లలో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. సేవలు పొందుతున్నవారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. రోజులో కనీసం 5 వేల నుంచి 8 వేల మంది సేవలు పొందుతున్నారు.

ఉన్నవాటిలో కొన్ని..

ప్రధానంగా కార్పెంటర్,  సెలూన్ ఎట్ హోమ్, హోమ్ డీప్ క్లీనింగ్, ఫిట్‌‌నెస్ ట్రైనింగ్ ఎట్ హోం, ఇంటీరియర్ డిజైనర్, హోమ్ ట్యూషన్, డయాగ్నోస్టిక్, హెల్త్ చెకప్,  ఎలక్ట్రీయన్, ప్లంబర్, బైక్ సర్వీస్, వాషింగ్ మిషన్, ఏసీ సర్వీస్, టీవీ ఇన్ స్టాలేషన్, వెడ్డింగ్ ఫొటోగ్రాఫర్, మెహందీ ఆర్టిస్ట్, డ్రైవర్ వంటి సేవలు పొందే అవకాశం ఉంది. త్వరలో మరిన్ని సేవలు రానున్నాయి.

Latest Updates