ట్రక్కులకు బ్రేకులు..20 శాతానికి మించి రోడ్డెక్కట్లే..

న్యూఢిల్లీకంపెనీలకు, వ్యాపారాలకు సప్లైను కొనసాగించడానికి ఈ నెల 20 నుంచి ట్రక్కులు హైవేలపై తిరగడానికి కేంద్ర ప్రభుత్వం పర్మిషన్లు ఇచ్చినా పరిస్థితిలో మార్పు కనిపించడం లేదు. మొత్తం ట్రక్కుల్లో 20 శాతానికి మించి రోడ్లపైకి రావడం లేదు.  ప్రస్తుతం ఇవి అత్యవసర వస్తువులను, పరికరాలను మాత్రమే సరఫరా చేస్తున్నాయి. కేంద్ర హోం మంత్రిత్వశాఖ నుంచి అన్ని పర్మిషన్లు ఉన్నా, ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్లేటప్పుడు సమస్యలు వస్తున్నాయని డ్రైవర్లు అంటున్నారు. లోకల్‌‌ ఆఫీసర్లు, పోలీసులు అడ్డుకుంటున్నారని చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్‌‌, బిహార్‌‌లోని చెక్‌‌ పోస్టుల వద్ద తమను అడ్డుకుంటున్నారని చెప్పారు. మహారాష్ట్ర సరిహద్దుల్లో కొన్ని లారీలను తెలంగాణ పోలీసులు కూడా నిలిపివేశారు. మరికొన్ని రాష్ట్రాల్లోనూ ఇలాంటి పరిస్థితులే ఉన్నాయని ట్రక్కుల యజమానులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం పర్మిషన్లు ఇచ్చినా రాష్ట్రాలు సహకరించడం లేదని అంటున్నారు.

పర్మిషన్లు ఇచ్చినా..

ట్రక్కులు, ఇతర వాహనాలు అత్యవసర వస్తువులను మాత్రమే తీసుకెళ్లాలని కేంద్రం ప్రభుత్వం గత నెల 29న ఆదేశించింది. అయితే ఈ నెల 20 నుంచి అన్ని రకాల వస్తువులను రవాణా చేయడానికి అవకాశం కల్పించింది. దేశవ్యాప్తంగా 76 లక్షల ట్రక్కులు ఉండగా, వీటిలో ప్రస్తుతం 20 శాతమే రోడ్ల మీదికి వచ్చాయి. గత నెల 24 అర్ధరాత్రి నుంచి లాక్‌‌డౌన్‌‌ పెట్టిన తరువాత వేలాది మంది ట్రక్‌‌ డ్రైవర్లు ఎక్కడికక్కడ చిక్కుకున్నారని ఆలిండియా మోటార్‌‌ ట్రాన్స్‌‌పోర్ట్‌‌ కాంగ్రెస్‌‌ జనరల్‌‌ సెక్రటరీ నవీన్‌‌ కుమార్‌‌ గుప్తా అన్నారు. ఇప్పటికీ వాళ్లు ఆయా రాష్ట్రాలను దాటలేకపోతున్నారని అన్నారు. ‘‘ఇంటికి వెళ్లడానికి డ్రైవర్లు తహతహలాడుతున్నారు. లోడ్లతో ఉన్న ట్రక్కులను గౌడౌన్లలో నిలిపేశారు. సరుకులను కిందికి దించడానికి కూలీలు దొరకడం లేదు. ట్రక్కులను నడుపుకోవచ్చని కేంద్ర హోంశాఖ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ లోకల్‌‌ ఆఫీసర్లు/పోలీసులు సహకరించడం లేదు. వాళ్లకు తిండి కూడా సరిగ్గా దొరకడం లేదు’’ అని ఆయన వివరించారు. లాక్‌‌డౌన్‌‌ పేరుతో డ్రైవర్లకు చాలా కొర్రీలు పెడుతున్నారని చెప్పారు. ట్రక్‌‌ డ్రైవర్లకు ఆహారం దొరికేందుకు వీలుగా హైవేల పక్కనున్న దాబాలను తెరవడానికి కూడా కేంద్రం ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. అయినప్పటికీ హోటళ్లు తెరుచుకోకపోవడంతో డ్రైవర్లకు, క్లీనర్లకు తిండి దొరక్క పస్తులు ఉంటున్నారు. కొన్నిచోట్ల పోలీసులు, సామాజిక సేవా సంస్థలు సాయం చేస్తున్నాయి. పెట్రోల్‌‌ బంకులు కూడా కొంతసేపే పనిచేస్తుండటం కూడా సమస్యగా మారింది

Latest Updates