శబరిమల అయ్యప్ప దర్శనం 250 మందికే

కేరళలో రెండోసారి కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో అధికారులు అలర్టయ్యారు. కఠినమైన కరోనా నిబంధనల నడుమ 7 నెలల తర్వాత మొదటి సారిగా శబరిమల ఆలయం నిన్న(శుక్రవారం) తెరచుకోగా భక్తులను లిమిట్ గా అనుమతించాలని భావిస్తున్నారు. ఇవాళ(శనివారం) నుంచి సాధారణ భక్తులను దర్శనానికి అనుమతిస్తుండగా.. రోజుకు కేవలం 250 మందికి మాత్రమే దర్శనానికి అనుమతిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇదివరకే కేరళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఓ ప్రకటన విడుదల చేశారు. వారం ప్రారంభంలో 1000 మంది, వారాంతాల్లో 2 వేల మంది భక్తులను దర్శనానికి అనుమతిస్తామని తెలిపారు. వర్చువల్‌ క్యూలో వివరాలు నమోదు చేసుకోవాలని కోరారు. లేటెస్టుగా శనివారం దర్శనానికి కేవలం 246 మంది మాత్రమే నమోదు చేసుకోవడంతో అధికారులు దర్శనాల సంఖ్యను 250కి కుదించారు.

అయ్యప్ప దర్శనం కోసం వచ్చే భక్తుల కోసం పక్కా మార్గదర్శకాలను రూపొందించారు ఆలయాధికారులు. దర్శనానికి వచ్చే భక్తులు కచ్చితంగా మాస్కులు ధరించాలని, దర్శనానికి 48 గంటల ముందు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్న వారికి మాత్రమే అనుమతిస్తామని తెలిపారు. స్వామివారికి నెలవారీ పూజలు ఐదురోజుల పాటు జరగనున్నాయి. ఆ తర్వాత నవంబర్‌ 16 నుంచి అయ్యప్ప మండల దీక్షలు ప్రారంభం కానున్నాయి. అంతేకాకుండా స్వామివారికి నెయ్యాభిషేకం, భక్తులకు అన్నదానాలను రద్దుచేశారు. అలాగే 10 సంవత్సరాల లోపు చిన్నారులు, 60 ఏళ్లు దాటిన వారిని దర్శనానికి అనుమతించడం లేదన్నారు. పంబా నదిలో స్నానాలను తాత్కాలికంగా నిలిపివేసి, భక్తుల స్నానాలకు వీలుగా అక్కడ షవర్లను ఏర్పాటు చేశారు. సన్నిధానంలో రాత్రి బస చేసేందుకు వీలు లేదని స్పష్టం చేశారు అధికారులు.

Latest Updates