బీహార్ ను ఎన్డీయే మాత్రమే కాపాడుతుంది

ఎన్నికల్లో ఇచ్చిన హావిూలన్నింటినీ నెరవేర్చడమే తమ లక్ష్యమన్నారు ప్రధాని మోడీ. గత ప్రభుత్వాల హయాంలో ప్రజా సంక్షేమం మరిచి అవినీతి రాజ్యమేలిందన్నారు. ప్రజల అవసరాలను విస్మరించిన నేతలు కమీషన్ల కోసమే పని చేశారని విమర్శించారు. బీహార్‌ రెండో విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా దర్భంగలో ఇవాళ(బుధవారం)  జరిగిన ర్యాలీలో మోడీ పాల్గొన్నారు. ఇందులో భాగంగా మాట్లాడిన ఆయన..బీహార్ ను ఎన్డీయే మాత్రమే కాపాడగలుగుతుందని, అందుకే ప్రజలందరూ ఎన్డీయే కూటమిని ఆదరించాలని పిలుపునిచ్చారు.  యావత్‌ ప్రపంచం కరోనా వైరస్ ను ఎదుర్కొంటున్న అసాధారణ పరిస్థితుల్లో బీహార్‌ ఎన్నికలు జరుగుతున్నాయని ప్రధాని గుర్తుచేశారు. ఇలాంటి పరిస్థితుల్లో సుస్థిర ప్రభుత్వం ఏర్పడటం రాష్ట్రానికి అవసరమని చెప్పారు. కేవలం మాటలు చెప్పడం కాకుండా సుపరిపాలన అందించే వాళ్లే బీహార్‌కు అవసరమన్నారు.

కొన్ని రోజుల క్రిందటే మహాసేతును ఆవిష్కరించామని తెలిపిన మోడీ…దీంతో రైతులు, వ్యాపారులతో పాటు విద్యార్థుల ప్రయాణాల సమయం తగ్గుతుందన్నారు. అంతేకాకుండా ఉపాధి దొరకడానికి కూడా అవకాశం ఉందన్నారు. ఓటు వేసే సందర్భంగా ప్రతి ఒక్కరూ కచ్చితంగా మాస్కులు ధరించాలని  ప్రధాని విజ్ఞప్తి చేశారు.

Latest Updates