రవాణాశాఖలో ఇష్టారాజ్యంగా ఆన్ డ్యూటీలు

హైదరాబాద్‌‌, వెలుగుప్రభుత్వానికి బాగా ఆదాయం వచ్చే శాఖల్లో రవాణా శాఖ ఒకటి. ప్రజలకు మెరుగైన సేవలు అందించాల్సిన ఈ శాఖలో ఎన్నో సంస్కరణలు తెచ్చామని చెబుతున్నా వాస్తవ పరిస్థితిలో పెద్దగా మార్పు కనిపించట్లేదు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఈ ఒక్క శాఖలోనే ఆన్ డ్యూటీ విధానం ఉంది. ఈ పేరుతో ఏడేళ్లుగా ప్రమోషన్లు లేకుండా కొందరికి మాత్రమే రెండు మూడు అదనపు బాధ్యతలు ఇస్తున్నారు. జోన్-5, జోన్-6లలో అయితే సిబ్బంది కొరత పేరుతో ఒక్కొక్కరికి మూడునాలుగు అదనపు బాధ్యతలు అప్పగించారు. రెండు జోన్లలో సుమారు 70 మంది ప్రమోషన్ల కోసం ఎదురుచూస్తున్నారు. వీరిలో కొందరు రిటైర్మెంట్‌‌కు దగ్గరున్న వారు కూడా ఉన్నారు. ప్రమోషన్లు ఇచ్చి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నా, కొందరికే ఓడీలు ఇస్తూ ఉండడంపై చాలా ఆరోపణలున్నాయి.

ఆదిలాబాద్‌‌ రెగ్యులర్ డీటీసీకి కరీంనగర్ డీటీసీగా అదనపు బాధ్యతలిచ్చారు. కరీంనగర్‌‌లో ఇద్దరు ఎంవీఐలు ఉండాల్సి ఉంటే ఒక ఏఎంవీఐతో కాలం గడిపేస్తున్నారు. మహబూబాబాద్ డీటీవోకు, ఖమ్మం డీటీవోగా అదనపు బాధ్యతలు కేటాయించారు. హైదరాబాద్‌‌ ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్లో ఉన్న అధికారికి నల్గొండ డీటీసీగా అదనపు బాధ్యతలు ఇచ్చారు. వాంకిడి చెక్‌‌పోస్టులో ఎంవీఐకి జగిత్యాల డీటీవోగా, కోరుట్ల ఎంవీఐగా బాధ్యతలిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రెగ్యులర్ ఎంవీఐ, డీటీవోగా, భద్రాచలం ఎంవీఐగా విధులు నిర్వహిస్తున్నారు. కరీంనగర్ ఎంవీఐకి అశ్వారావుపేట చెక్ పోస్టు అప్పగించారు. అశ్వారావుపేట చెక్ పోస్టులో ఏడుగురు ఏఎంవీఐలను ఓడీ పేరుతో కొత్తగూడెం, వరంగల్ అర్బన్, ఆదిలాబాద్, జగిత్యాల, భూపాలపల్లి నుంచి రప్పించారు. భూపాలపల్లి ఎంవీఐకి భూపాలపల్లి డీటీవోగా, ములుగు డీటీవోగా, ఎంవీఐగా మూడు అదనపు బాధ్యతలిచ్చారు. వరంగల్ రూరల్ ఎంవీఐకి జనగాం ఎంవీఐగా, డీటీవోగా అవకాశమిచ్చారు. ముత్తగూడెం చెక్ పోస్టులో ఒకరు రెగ్యులర్ కాగా అశ్వారావుపేట చెక్ పోస్టు నుంచి ఓడీ పేరుతో మరో ముగ్గురికి ఈ మధ్యే బాధ్యతలు అప్పగించారు. మంచిర్యాల, కరీంనగర్, ఆదిలాబాద్‌‌ నుంచి ఐదుగురు ఏఎంవీఐలకు డిప్యూటేషన్ మీద చెక్ పోస్టు బాధ్యతలిచ్చారు. ఆసిఫాబాద్ చెక్ పోస్టు ఎంవీఐకి ఓడీ పేరుతో ఎంవీఐ, డీటీవోగా అవకాశం కల్పించారు. వరంగల్, నిర్మల్‌‌లో పనిచేస్తున్న వారికి ఓడీ పేరుతో భైంసా చెక్ పోస్టులో అవకాశం కల్పించారు.

ఉన్నతాధికారుల ఇష్టారాజ్యం

జిల్లా కేంద్రంలో రెగ్యులర్ పోస్టులు లేకపోవడంతో కొందరు అధికారుల ఇష్టప్రకారమే అంతా నడిచిపోతోంది. డిపార్ట్‌‌మెంటల్ ప్రమోషన్లు పొందిన కొందరిని రివర్షన్ పేరుతో అదే పోస్టింగుల్లో కొనసాగాలని గతంలో ఆదేశాలిచ్చారు. వారంతా కోర్టుకెళ్లారు. దీంతో రెండు నెలల కిందే 31 మంది ఏఎంవీఐలకు తిరిగి పోస్టింగులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలిచ్చినా వాటిని ఎవరూ పట్టించుకోవడం లేదు. ఉద్దేశపూర్వకంగానే కోర్ట్‌‌ ఆర్డర్స్‌‌ను డిలే చేస్తున్నారని తెలుస్తోంది. దీనికి అక్రమాలే కారణమన్న ఆరోపణలున్నాయి. డిపార్ట్‌‌మెంట్‌‌లో రెగ్యులర్ కమిషనర్ లేకపోవడం కూడా కొందరు ఉన్నతాధికారులకు అనుకూలంగా మారింది.

Latest Updates