ఆరేళ్లలో TRS నాయకులకు మాత్రమే ఉద్యోగాలు వచ్చాయి

తెలంగాణ వచ్చిన ఆరేళ్లలో TRS నాయకులకు మాత్రమే ఉద్యోగాలు వచ్చాయన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. నిరుద్యోగులను  చూస్తే గుండె తరుక్కుపోతోందన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జీవన్ రెడ్డి …సోనియాగాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి.. జాతీయ జెండా ఎగురవేశారు. ఆ తర్వాత మాట్లాడిన ఆయన…అమరవీరుల బలిదానాలతో సాధించుకున్న తెలంగాణను అప్పులపాలు చేసిన కేసీఆర్ కు ప్రభుత్వాన్ని నడిపే నైతిక హక్కు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు అమరవీరుల స్థూపం తాకే హక్కు కూడా లేదన్నారు.ఉద్యోగులకు పీఆర్సీ లేదు,ఐఆర్ అసలే ఇవ్వక పోగా…దీనికి తోడు కరోనా నెపంతో వేతనాల్లో కోత పెడుతున్నారంటూ ఆరోపించారు.

కేసీఆర్ కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టును ఎంతో ఆర్భాటంగా ప్రారంభిస్తే.. మోటార్లు కనీసం 4 గంటలు కూడా నడువక కాలువలు కూడా పారలేదని చెప్పారు జీవన్ రెడ్డి. ఎల్లంపెల్లి ప్రాజెక్ట్ లో 5.78TMCల నీరు మాత్రమే ఉందని…అది ఎత్తిపోతలు ఎలా సాధ్యమవుతుందో సమాధానం చెప్పాలన్నారు. సీఎం కలల ప్రాజెక్టు కాళేశ్వరం పంపులు నడువక మూడు నెలలు అవుతుందన్నారు. మిడ్ మానేరు, లోయర్ మానేరు డ్యామ్ లను నిండు కుండలుగా ఎప్పుడు నింపుతావో రైతులకు చెప్పాలని ప్రశ్నించారు. ఆరేళ్ళ ప్రగతి రాష్టాన్ని అప్పుల పాలు చేయడం, కమీషన్ల కోసం తాబేదార్లకు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టడం తప్ప కేసీఆర్ చేసిందేమీ లేదన్నారు జీవన్ రెడ్డి.

Latest Updates