సీక్వెల్ తీస్తే నయనతారతోనే..

నాలుగేళ్ల క్రితం నయనతార హీరోయిన్గా వచ్చిన ‘కర్తవ్యం’ (తమిళంలో ఆరమ్) సినిమాని అంత సులభంగా ఎవరూ మర్చిపోలేరు. ఆ సినిమాలోని కంటెంటే అందుకు కారణం. ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిన ఓ చిన్నారి, కలెక్టర్ చొరవతో ఎలా బయటపడిందనేది కథాంశం. ఫైట్లు, కామెడీ ట్రాక్లు, అనవసర కమర్షియల్ హంగులేవీ లేకున్నా.. ఈ సినిమా ఇటు తెలుగులోనూ, అటు తమిళంలోనూ చక్కని విజయాన్ని సాధించింది. ఎక్కడ ఏ పిల్లాడు బోరు బావిలో పడినా వెంటనే ప్రజలు ఈ సినిమాను గుర్తు చేసుకుంటున్నారు. దీంతో ఈ సినిమాకి సీక్వెల్ రాబోతోందని కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సీక్వెల్లో నయనతార నటించడం లేదని, ఆ స్థానంలో కీర్తి సురేష్ ని తీసుకున్నారనే వార్తలు తెరపైకొచ్చాయి. పైగా ఈ సినిమాకి నయనతార డేట్స్ ఇవ్వని కారణంగానే మరో హీరోయిన్ని తీసుకున్నారనే ప్రచారమూ సాగుతోంది. దీంతో దర్శకుడు గోపి నైనార్ స్వయంగా క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. ‘ఇలాంటి రూమర్స్ ఎలా పుట్టిస్తారో అర్థం కావడం లేదు. ‘ఆరమ్’ సీక్వెల్ కి నయనతార డేట్స్ ఇవ్వలేదనే వార్తల్లో ఏమాత్రం నిజం లేదు. అలాంటి వార్తలను ఎవరూ నమ్మొద్దు. ఆ సినిమాకి సీక్వెల్ అంటూ తీస్తే అది కచ్చితంగా నయనతారతోనే’ అంటూ అసలు విషయం రివీల్ చేశాడు. ప్రస్తుతానికి దేశంలో పరిస్థితి బాలేదు కనుక సీక్వెల్ గురించి ఇప్పుడే అప్డేట్స్ ఇవ్వలేను అన్నాడు.