కేసీఆర్.. ముందు నీ ఆస్తుల లెక్క చెప్పు.. రాష్ట్రం ప్రైవేట్ కంపెనీ కాదు

  • సర్వే పేరిట జనాన్ని ఇబ్బందిపెడితే ఊరుకోం.. ప్రతిపక్షాల ఫైర్
  • 54 రకాల వివరాలు ఎందుకు అడుగుతున్నరు?
  • భయపెట్టి వివరాలు సేకరిస్తరా.. పర్సనల్ డీటెయిల్స్ తో పనేంది?
  • న్యాయ పోరాటం చేస్తామంటున్న నేతలు

 

హైదరాబాద్‌‌, వెలుగుఇల్లు, ప్లాట్‌‌, ఖాళీ జాగా, షాపు, ఎడ్ల కొట్టం.. ఇట్లా ప్రజల ఆస్తుల వివరాలన్నీ తెలుసుకునేందుకు సర్కారు చేపట్టిన సర్వేపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. రాష్ట్రాన్ని కేసీఆర్‌‌ ప్రైవేట్‌‌ లిమిటెడ్‌‌ కంపెనీలా మార్చేసి, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని.. చూస్తూ ఊరుకోబోమని హెచ్చరిస్తున్నాయి. కేసీఆర్​ ముందు తన ఫ్యామిలీ ఆస్తుల వివరాలన్నీ బయటపెట్టాలని డిమాండ్​ చేస్తున్నాయి. ప్రభుత్వం చెప్పినట్టు వినకపోతే సంక్షేమ పథకాలు అందకుండా చేస్తామని బెదిరించేందుకే.. అందరినీ గుప్పిట్లో పెట్టుకుని భయభ్రాంతులకు గురిచేయడానికే ఈ సర్వే చేపట్టిందని నేతలు ఆరోపించారు. ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలుగుతోందని మండిపడ్డారు. జీవో లేకుండా 15 రోజుల్లోనే సర్వే పూర్తిచేయాలనడం ఏమిటని.. ఎలక్షన్లలో వాడుకునేందుకే ఇట్ల చేస్తున్నరని స్పష్టం చేశారు. ప్రజల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించేలా, సుప్రీం తీర్పును కాదని ఎలా వివరాలు సేకరిస్తారని ప్రశ్నించారు. సర్కారు దిగొచ్చే దాకా ఆందోళనలు చేస్తామని చెప్పారు. ఇకనైనా కేసీఆర్​ నిరంకుశ నిర్ణయాలను ప్రజలపై రుద్దడం ఆపాలని డిమాండ్​ చేశారు. ప్రజల హక్కులకు భంగం కలిగించే ఈ సర్వేపై న్యాయ పోరాటానికి కొందరు నేతలు సిద్ధమవుతున్నారు.

జీవో లేకుండా సర్వే ఏంది..?

ఎలాంటి జీవో లేకుండా సర్కారు ఎలా సర్వే చేస్తుంది, ఇది ఎట్లా చట్టబద్ధం అవుతుంది. ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం వాటిల్లొద్దని ఆధార్‌‌ కార్డుల విషయంలో సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చింది. దానిని తుంగలో తొక్కుతూ ఇప్పుడు ప్రజల నుంచి ఆధార్​ సహా 50 రకాల వివరాలను ఎట్లా సేకరిస్తరు. 15 రోజుల్లోనే సర్వే పూర్తి చేయాలని సర్కారు ఆదేశించడమే అనేక సందేహాలకు తావిస్తోంది. ఏదో మనసులో పెట్టుకొనే ఈ సర్వే చేయిస్తోంది. అసలు ప్రజల ఆస్తులకు భద్రత ఉంటుందా అన్న అనుమానం కలుగుతోంది. ప్లాట్ల రిజిస్ట్రేషన్‌‌ టైంలోనే స్టాంప్‌‌ డ్యూటీ చెల్లించినప్పుడు మళ్లీ ఎల్‌‌ఆర్‌‌ఎస్‌‌ ఎందుకు చెల్లించాలనే ప్రశ్నకు సర్కారు సమాధానం చెప్పడం లేదు. రిజిస్ట్రేషన్లు ఆపడం చట్టవిరుద్ధం. రిజిస్ట్రేషన్‌‌ శాఖకు ఉన్న ప్రత్యేక ప్రతిపత్తిని పక్కనపెట్టి సర్కారు అక్రమంగా రిజిస్ట్రేషన్లు ఆపేసింది.

– ప్రొఫెసర్‌‌ కోదండరాం, టీజేఎస్‌‌ రాష్ట్ర అధ్యక్షుడు

జుట్టు పన్ను కూడా వేస్తరేమో!

ఆస్తుల వివరాలు సేకరించడం ఇన్‌‌కం ట్యాక్స్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌ పని. ప్రభుత్వానికి ఆ వివరాలు ఎందుకు? అందరినీ గుప్పిట్లో పెట్టుకొని భయభ్రాంతులకు గురి చేయడానికే ఈ సర్వే. ఇప్పటికే ఆన్‌‌లైన్‌‌లో అన్ని భూముల వివరాలు ఉన్నాయి. మళ్లీ ఇండ్లకు వెళ్లి వివరాలు అడగడం ఎందుకు? ఎల్‌‌ఆర్‌‌ఎస్‌‌ పేరుతో ప్రజల నుంచి లక్షలు వసూలు చేస్తున్నరు. టీఆర్ఎస్​ సర్కారు అడ్డగోలుగా చేసిన అప్పులు కట్టడానికి.. ఎల్‌‌ఆర్‌‌ఎస్‌‌ పేరుమీద, లిక్కర్, పెట్రోల్‌‌, డీజిల్‌‌ మీద ట్యాక్సులతో పేదలను పీక్కు తింటోంది. మున్ముందు జుట్టు పన్ను వేసినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అప్పుల పేరిట తెచ్చిన సొమ్మును ఎప్పుడో దోచేశారు. ఇప్పుడు ఏదో ఒక పేరుతో ట్యాక్సులు వసూలు చేయకపోతే రాష్ట్రంలో ఎంప్లాయీస్​కు జీతాలిచ్చే పరిస్థితి లేదు. ఈ సర్వేపై ఎలాంటి పోరాటానికైనా వెనుకాడబోం.

– మల్లు భట్టివిక్రమార్క, సీఎల్పీ నేత

ప్రభుత్వమా.. ప్రైవేటు కంపెనీయా..?

రాష్ట్ర సర్కారు వ్యవసాయేతర ఆస్తుల సర్వే పేరుతో ఇష్టమొచ్చినట్టు వ్యవహరిస్తోంది. ప్రజల ఇండ్ల వద్దకు వెళ్లి అడ్డగోలు ప్రశ్నలు వేసి, వ్యక్తిగత వివరాలు సేకరిస్తున్నారు. ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం వాటిల్లే రీతిలో సర్కారు వ్యవహరించడం సరికాదు. కష్టపడి కొనుక్కున్న ఆస్తుల వివరాలన్నీ తమ గుప్పిట్లో పెట్టుకొని.. రేపు చెప్పినట్టు వినకుంటే వాటిని స్వాధీనం చేసుకుంటామని బెదిరించేందుకే ఇలా దౌర్జన్యానికి దిగుతున్నారు. సర్వే అంటే రాష్ట్రం మొత్తం ఒక్క విధానం ఉండాలి. కానీ ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్లు చేస్తున్నరు. ఇదేమన్నా ప్రభుత్వమా, లేక ప్రైవేట్‌‌ లిమిటెడ్‌‌ కంపెనీనా. ముందు కేసీఆర్.. తన ఫ్యామిలీ ఆస్తుల వివరాలన్నీ బయటపెట్టాలి. ఆయనకు ఇష్టమొచ్చినట్టు సర్వేలు చేస్తామంటే చూస్తూ ఊరుకోం. ప్రజల పక్షాన ఎలాంటి పోరాటాలకైనా సిద్ధం.

– బండి సంజయ్‌‌కుమార్‌‌, ఎంపీ, బీజేపీ రాష్ట్ర చీఫ్

ఎలక్షన్లలో వాడుకొనేందుకే..

ప్రజల వ్యక్తిగత జీవితంలోకి ప్రభుత్వం ఎలా చొరబడుతుంది? ఎలక్షన్లలో గెలవడమే లక్ష్యంగా ఇలా చేస్తున్నారు. అన్ని వివరాలు ఎందుకు సేకరిస్తున్నారో సమాధానం చెప్పాలె. సమగ్ర కుటుంబ సర్వే వివరాలనే సర్కారు వెల్లడించలేదు. ఆ డేటాను టీఆర్ఎస్​ ప్రయోజనం కోసం వాడుకుంటున్నారు. ప్రజలు కష్టపడి కొనుక్కున్న ప్లాట్లకు ఎల్‌‌ఆర్‌‌ఎస్‌‌ పేరిట లక్షలు ఎందుకు చెల్లించాలి? సర్కారు తీరు మార్చుకోవాలి.

– ప్రేమేందర్‌‌ రెడ్డి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

డబ్బులు కడితే లేఔట్‌‌ ఎలా రెగ్యులరైజ్‌‌ అయితది

రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌‌ డిపార్ట్‌‌మెంట్లు సరిగా పనిచేయక పోవడంతోనే అక్రమ లే ఔట్లలోని ప్లాట్లు రిజిస్ట్రేషన్‌‌ అయినయి. అర్బన్‌‌ ల్యాండ్‌‌ సీలింగ్‌‌ యాక్ట్‌‌ను పక్కనపెట్టి రిజిస్ట్రేషన్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌ యూఎల్‌‌సీలు ఇచ్చింది. 30 ఫీట్ల రోడ్లు లేని, ఓపెన్ స్పేస్‌‌ లేని ప్లాట్లకు ఫీజులు చెల్లించినంత మాత్రాన రెగ్యులరైజ్‌‌ చేస్తామనే విధానమే సరికాదు. ఎల్‌‌ఆర్‌‌ఎస్‌‌ అనేదే మీనింగ్‌‌ లెస్‌‌. ప్రజలు తమ నాన్‌‌ అగ్రికల్చర్‌‌ ఆస్తుల వివరాలు ప్రభుత్వానికి ఇవ్వడంవల్ల ఎలాంటి నష్టం ఉండదు.

– రాంగోపాల్‌‌రావు, రిటైర్డ్‌‌ డిప్యూటీ కలెక్టర్‌‌

ప్రజల మీద దౌర్జన్యం చేయొద్దు

రాష్ట్రంలో అనేక ఆస్తులు ఇప్పటికీ ఉమ్మడి కుటుంబాల పేరు మీదనే ఉన్నాయి. వ్యవసాయ భూములు ఎవరికి వారే పట్టా చేయించుకున్నా.. ఇల్లు, ఇతర ఆస్తులు మాత్రం ఉమ్మడిగానే ఉన్నాయి. ప్రభుత్వం ఇప్పటికిప్పుడు సర్వే అంటే సరికాదు. కనీసం ఏడాది, రెండేండ్లు టైం తీసుకొని సర్వే చేయిస్తే మంచిది. సర్వేలో ప్రజలు తమ వివరాలను కంపల్సరీగా ఇవ్వాలన్న రూల్​ ఎక్కడా లేదు. ప్రజల మీద ప్రభుత్వం దౌర్జన్యం చేయొద్దు. ఆస్తుల సర్వేతో అన్నదమ్ముల మధ్య గొడవలు జరుగుతాయి.

– విష్ణువర్ధన్‌‌రాజు, రిటైర్డ్‌‌ రిజిస్ట్రార్‌‌

Latest Updates