ప్రతిపక్షాల నోట పాకిస్థాన్ మాట: ప్రధాని మోడీ

సిటిజన్‌షిప్ బిల్లుపై కొన్ని ప్రతిపక్షాలు పాకిస్థాన్ వాదనల్ని తమ నోటి వెంట వినిపిస్తున్నాయని ప్రధాని నరేంద్రమోడీ ఆరోపించారు. బుధవారం ఉదయం బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. సిటిజన్‌షిప్ చట్ట సవరణ బిల్లు చరిత్రలో స్వర్ణాక్షరాలతో లిఖించబడుతుందన్నారు. ఈ బిల్లుతో పొరుగు దేశాల్లో మత పరంగా హింసను భరించలేక భారత్‌కు వచ్చేసిన హిందూ, సిక్కు, బౌద్ధ, క్రైస్తవ మతస్థులకు శాశ్వత రిలీఫ్ వస్తుందని చెప్పారు మోడీ. ఆ వర్గాల వాళ్లకు కలిగే ఉపశమనం, వారు ఆ పొరుగు దేశాల్లో అనుభవించిన బాధ ఏంటన్నది వారి మాటల్లో వింటే తెలుస్తుందని ప్రతిపక్షాలకు సూచించారు. ఈ బిల్లును తప్పుపడుతూ కొన్ని పార్టీలు పాకిస్థాన్ భాషలో మాట్లాడుతున్నాయని అన్నారు.

సిటిజన్‌షిప్ చట్ట సవరణ ద్వారా హిందూ రాజ్య వ్యాప్తికి భారత్ ప్రయత్నిస్తోందని, ఇందు కోసం పొరుగు దేశాల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాలని చూస్తోందని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నేతల మాటలు కూడా అలానే ఉన్నాయంటూ మోడీ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

భారత ముస్లింలకు ఏ నష్టం లేదు

పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్, బంగ్లాదేశ్‌లో హింసకు గురవుతూ 2015కు ముందు శరణార్థులుగా భారత్‌కు వచ్చిన హిందూ, సిక్కు, బౌద్ద, క్రైస్తవ, ఇతర మైనారిటీ మతాల వాళ్లకు ఇక్కడి పౌరసత్వం ఇచ్చేలా సిటిజన్‌షిప్ చట్టం-1955లో సవరణకు బిల్లు తెచ్చింది ప్రభుత్వం. ఈ బిల్లు ఇప్పటికే లోక్‌సభలో ఆమోదం పొందింది. ఇవాళ రాజ్యసభలో చర్చ జరుగుతుంది. అయితే ఈ బిల్లు రాజ్యాంగ వ్యతిరేకమని కాంగ్రెస్ సహా పలు ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సిక్యులర్ స్ఫూర్తికి దెబ్బ అని, మత పరంగా మరోసారి దేశాన్ని విభజిస్తున్నారని ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ లోక్‌సభలో మండిపడ్డారు. బిల్లును తప్పుగా అర్థం చేసుకుని కొన్ని ప్రతిపక్షాలు ఇలా మాట్లాడుతున్నాయని, భారత్‌లోని ముస్లింలకు ఈ చట్ట సవరణతో ఎలాంటి నష్టం జరగదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు.

MORE NEWS:

‘సిటిజన్​షిప్’ బిల్లుకు లోక్​సభ ఆమోదం

ఎలాగో చస్తాం.. మళ్లీ ఉరి శిక్షెందుకు: సుప్రీంలో నిర్భయ దోషి వింత పిటిషన్

Latest Updates