రైతు యాతన..మామిడికి మార్కెట్​ లేదు..బత్తాయికి రేటు లేదు

  • మార్కెట్  లేదాయె.. రేటు రాదాయె..
  • నిండా మునిగిన మామిడి, బత్తాయి, పత్తి రైతులు
  • మార్కెటింగ్​ సౌకర్యం లేక పడిపోయిన మామిడి ధర
  • రేటు రాక బత్తాయిలను చెట్ల మీదనే వదిలేస్తున్నరు
  • సగానికిపైగా పడిపోయిన ధరలతో ఆందోళన
  • కొనేవాళ్లు లేక ఇండ్లలో పురుగులు పడుతున్న పత్తి
  • 320 జిన్నింగ్ మిల్లుల్లో పేరుకుపోయిన 2 లక్షల బేళ్లు
  • ఆదుకోవాలని వేడుకుంటున్న రైతులు

వెలుగు, నెట్​వర్క్​: కరోనా ఎఫెక్ట్ ఓ వైపు, సర్కారు పట్టించుకోకపోవడం మరోవైపు కలిసి పత్తి రైతు బేరుమంటున్నడు. పత్తికి అంతర్జాతీయంగా డిమాండ్  పడిపోయింది. లాక్​డౌన్​ ఎఫెక్ట్​తో కొనేవాళ్లెవరూ లేరు. స్పిన్నింగ్ మిల్లుల నుంచి ఆర్డర్లు లేకపోవడంతో.. రాష్ట్రవ్యాప్తంగా 320 జిన్నింగ్ మిల్లుల్లో రూ.800 కోట్ల విలువైన 2 లక్షల బేళ్లు మూలకుపడ్డాయి. లాక్​డౌన్​కు ముందు రూ.40 వేలుగా ఉన్న బేల్​ పత్తి ధర.. ఇప్పుడు రూ.31 వేలకు తగ్గింది. అదికూడా కొనేవాళ్లు లేరు. ప్రస్తుతం సీసీఐ కొనుగోళ్లు నిలిచిపోయాయి. రైతుల వద్ద మిగిలిన పత్తిని కొనేందుకు ప్రైవేట్ వ్యాపారులు కూడా ముందుకు రావడం లేదు. వచ్చినవాళ్లు కూడా క్వింటాల్​కు రూ.2,500 నుంచి రూ.3,500 కు మించి రేటు పెట్టడం లేదని రైతులు వాపోతున్నారు.

ఇంతలోనే ఎంత తేడా..!

రాష్ట్రంలో ఏటా 45 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతోంది. సుమారు మూడు కోట్ల క్వింటాళ్ల పత్తిని సీసీఐ, ప్రైవేటు జిన్నింగ్ వ్యాపారులు కొంటుంటారు. రాష్ట్రంలోని 320 జిన్నింగ్​ మిల్లుల్లో పత్తిని బేళ్లుగా తయారుచేసి.. దేశవ్యాప్తంగా ఉన్న స్పిన్నింగ్ మిల్లులకు తరలిస్తారు. కానీ కరోనా లాక్​ డౌన్ వల్ల రెండు నెలలుగా బేళ్ల తరలింపు నిలిచిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పడిపోవడంతో తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల్లోని స్పిన్నింగ్ మిల్లులు బేళ్లు కొనడం లేదు. దాంతో పత్తి ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. రెండు నెలల క్రితం వరకు క్వింటాల్​కు రూ.5,400 పలికిన పత్తి ధర ఇప్పుడు రూ.3,500 దాటడం లేదు. సీసీఐ రూ.5 వేలు మద్దతు ధరగా చెప్తున్నా ఆ రేటు ఎక్కడా రావడం లేదు. ఇక రేటు పెరుగుతుందన్న ఆశతో కొందరు రైతులు ఇండ్లలో క్వింటాళ్ల కొద్దీ పత్తిని నిల్వ చేసుకున్నారు. వారికి మరో కష్టం తోడైంది. నిల్వ ఉంచిన పత్తికి పురుగు పడుతోంది. దానివల్ల రైతులకు, కుటుంబ సభ్యులకు దురద, ఇతర అనారోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి. అమ్ముదామంటే కొనేవాళ్లు లేక.. ఇంట్లో సమస్యలతో ఇబ్బందిపడుతున్నారు. సర్కారు వెంటనే మద్దతు ధరతో పత్తి కొనాలని కోరుతున్నారు.

నిండా మునిగిన మామిడి రైతులు

లాక్​డౌన్​ ఎఫెక్ట్  వల్ల ఈసారి మామిడి రైతుల నిండా మునిగారు. గత ఏడాది క్వింటాల్​కు ఐదున్నర వేల నుంచి 8 వేల వరకు ధర రాగా.. ఈసారి రెండున్నర వేల వరకే దక్కుతుండడంతో లబోదిబోమంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 3.07 లక్షల ఎకరాల్లో మామిడి సాగవుతోందని హార్టికల్చర్  డిపార్ట్​మెంట్​ లెక్కలు చెప్తున్నాయి. ఈ ఏడాది సీజన్​ మొదట్లో అకాల వర్షాలు, ఈదురు గాలులు కారణంగా మామిడి పూత, కాయలు రాలిపోయింది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నల్గొండ తదితర జిల్లాల్లో నష్టం ఎక్కువగా జరిగింది. వచ్చిన కాస్త దిగుబడిని అమ్ముకుందామనుకునే టైంలో కరోనా దెబ్బ పడింది. మొదట లాక్​డౌన్​ కారణంగా కూలీలు దొరకక, దొరికినా ట్రాన్స్​పోర్ట్​ లేక ఇబ్బంది ఎదురైంది. తర్వాత ఆంక్షలు సడలించినా సరైన ధర రాక నష్టం వస్తోంది. నాగర్​కర్నూల్​ జిల్లా కొల్లాపూర్ లోనే 17 వేల హెక్టార్లలో వివిధ రకాల మామిడి సాగుచేస్తున్నారు. రాష్ట్రంలో హైదరాబాద్​లో తప్ప ఎక్కడా మామిడికి సరైన మార్కెటింగ్​ సౌకర్యం లేదు. హైదరాబాద్  రెడ్​ జోన్​లో ఉండటంతో ఇబ్బంది నెలకొంది. ప్రభుత్వం కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో రైతులపై దెబ్బపడింది. కర్నూల్, బీదర్, గుల్బర్గా, నాగ్​పూర్  మార్కెట్లకు మామిడిని తరలించినా తగిన ధర రావడం లేదు. గతేడాది ఆయా ప్రాంతాల వ్యాపారులు స్వయంగా తోటలకు వచ్చి క్వింటాల్ మామిడికి రూ.5,500 నుంచి రూ. 8 వేల వరకు చెల్లించి తీసుకెళ్లారు. ఈసారి రైతులే ట్రాన్స్​పోర్ట్​ఖర్చులు పెట్టుకుని మరీ మార్కెట్లకు తీసుకెళ్లినా.. క్వింటాల్​ రూ.3 వేలకు మించి రేటు పెట్టడం లేదు.

బత్తాయిలను చెట్ల మీదే వదిలేస్తున్నరు

కరోనా ఎఫెక్ట్, సర్కారు తీరు కారణంగా బత్తాయి రైతులు నష్టపోతున్నారు. హార్టికల్చర్ ఆఫీసర్ల లెక్కల ప్రకారమే.. రాష్ట్రవ్యాప్తంగా 62 వేలకుపైగా ఎకరాల్లో బత్తాయి సాగవగా.. అందులో ఒక్క నల్గొండ జిల్లాలోనే 47 వేల ఎకరాలు (76 శాతం పంట) సాగవుతోంది. ప్రస్తుత సీజన్​లో ఈ ఒక్క జిల్లాలోనే 44 వేల టన్నుల బత్తాయి దిగుబడి వస్తుందని ఆఫీసర్లు అంచనా వేశారు. దిగుబడి ఫరవాలేదనే స్థాయిలో వచ్చినా రైతులకు ప్రయోజనం లేకుండా పోయింది.

రేటు పడిపోయింది

నల్గొండ జిల్లాలో పండే బత్తాయి ఢిల్లీ, మహారాష్ట్ర, కోల్​కతా మార్కెట్లకు ఎగుమతయ్యేది. గతేడాది టన్నుకు రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు ధర పలికింది. లాక్​డౌన్​ కారణంగా ఇప్పుడు రూ.9 వేల నుంచి రూ.12 వేలకు పడిపోయింది. అసలు మార్కెట్లోకి బత్తాయి రావడానికి ముందే పొరుగు రాష్ట్రాల ట్రేడర్లు రైతుల దగ్గరికే వచ్చి బేరమాడి తీసుకెళ్లేవారు. కానీ ఇప్పుడు ట్రేడర్లెవరూ రాని పరిస్థితి. దీంతో సర్కారే బత్తాయి కొనుగోళ్లు చేపట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ మార్కెట్లో బత్తాయి కొనుగోళ్లు జరిగేలా కొందరు లీడర్లు ప్రయత్నించినా రిజల్ట్​ రాలేదు. ఇక కొత్తపేట ఫ్రూట్ మార్కెట్​ను కోహెడకు తరలించడం, ఢిల్లీ మార్కెట్లో కరోనా వ్యాప్తి, ప్రజల నుంచి డిమాండ్​ ఉన్నా మార్కెట్లు లేక బత్తాయి కొనుగోళ్లు జరగడం లేదు. చివరికి రైతులు బత్తాయిని చెట్లపైనే వదిలేస్తున్నారు.

ఊరూరు తిరిగి అమ్ముకోవాల్సిన దుస్థితి

ప్రస్తుతం లాక్ డౌన్ కొంత సడలించినా ప్రయోజనం లేదని రైతులు వాపోతున్నారు. ఫ్రూట్ మార్కెట్లు బంద్ కావడం, బేరగాళ్లు రాకపోవడంతో హోల్​సేల్​గా జరగాల్సిన వ్యాపారం రిటైల్​కు పడిపోయింది. మొత్తం 44 వేల టన్నుల దిగుబడిలో ఇప్పటి వరకు 3,482 టన్నుల బత్తాయి మాత్రమే మార్కెట్లోకి వచ్చింది. దీంట్లో ట్రేడర్లు 2,930 టన్నులు కొనగా.. 552 టన్నులను రైతులు డైరెక్ట్​గా మర్కెట్లలో, ఊర్లలో తిరుగుతూ అమ్ముకున్నారు. రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో 671 టన్నుల బత్తాయి కొనుగోళ్లు జరిగాయి. తాజాగా ఢిల్లీ, మహారాష్ట్ర, కోల్ కతా ఫ్రూట్ మార్కెట్లు ఓపెన్ అయినా రవాణా ఇబ్బందులు, డిమాండ్​ లేక బత్తాయి ఎగుమతులు లేవని వ్యాపారులు అంటున్నారు. ఇక రాష్ట్రంలోనే బత్తాయి వాడకం పెంచేలా చర్యలు తీసుకుంటామన్న సర్కారు ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. మొత్తంగా అటు మార్కెట్​ లేక.. ఇటు ధర రాక తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నెల రోజుల్లోనే దారుణంగా..

ఉత్తర తెలంగాణలో పండే మామిడికి కీలకమైన నాగ్​పూర్ మార్కెట్లో ధర దారుణంగా పతనమైంది. నెల రోజుల్లోనే క్వింటాల్ ధర రూ.7 వేల నుంచి ఏకంగా రూ.2,500 కు పడిపోయింది. దీంతో రైతులు ఆవేదనలో మునిగిపోయారు. ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లా పరిధిలోని మంచిర్యాలలో 18 వేల ఎకరాల్లో మామిడి తోటలు సాగవుతున్నాయి. అక్కడికి సమీపంలోని బెల్లంపల్లిలో మామిడి మార్కెట్ ఏర్పాటు చేస్తామని మాట ఇచ్చిన టీఆర్ఎస్ సర్కారు.. కేవలం షెడ్లు నిర్మించి వదిలేసింది. రైతులంతా ఎప్పట్లాగే నాగ్​పూర్  మార్కెట్​కు తరలించి అమ్ముకుంటున్నారు. తక్కువ ధర రావడంతో నిండా మునుగుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పత్తి కొనాలంటూ కాళ్ల మీద పడ్డడు

కుమ్రం భీం ఆసిఫాబాద్​జిల్లా కౌటాల మండలంలోని కొనుగోలు కేంద్రం వద్ద అధికారులు పత్తి కొనకుండా బండ్లను తిప్పి పంపుతుండడంతో బుధవారం రైతులు ధర్నాకు దిగారు. ఆ సమయంలో అక్కడకు తహసీల్దార్ ​రాజేశ్వరి రావడంతో ఓ రైతు ఏడుస్తూ ఆమె కాళ్ల మీద పడ్డాడు. మద్దతు ధరకు తమ పత్తి కొనాలంటూ వేడుకున్నాడు. – కాగజ్ నగర్, వెలుగు

ఆరు నెలలుగా ఇంట్లనే పత్తి

‘‘ఈ సారి పత్తికి గిట్టుబాటు ధర రాలేదు. అమ్ముదామంటే కొనేవాళ్లు రావట్లేదు. మొదటిసారి వచ్చిన పత్తి అమ్మిన. రెండోసారి అక్టోబర్​లో 20 క్వింటాళ్ల పత్తి వచ్చింది. అప్పటినుంచి రేటు లేక అమ్మలేదు. ఇంట్లోనే కొట్టంలో దాచినం. దానికి ఇప్పుడు పురుగు పట్టి పాడైపోతోంది. అమ్ముకునే పరిస్థితి లేక నష్టపోతున్నం.’’

– గజ్జల నర్సింహారెడ్డి, పత్తి రైతు, మేళ్లచెరువు

మేకిన్​ ఇండియాకు ఊతం

స్వదేశీ బ్రాండ్లను తయారు చేయడమే ‘ఆత్మ నిర్భర్ భారత్’​ ప్యాకేజీ ముఖ్య ఉద్దేశం. అంతర్జాతీయ స్థాయిలో ఇండియా ఉత్పత్తులకు పేరు రావాల్సిన అవసరం ఉంది. దేశ ఆర్థిక వ్యవస్థకు రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీ అండగా నిలుస్తుంది. ఈ నిర్ణయం మేకిన్ ఇండియాకు ఊతమిస్తుంది. స్వదేశీ పరిశ్రమలు క్రమంగా ప్రపంచ ఎగుమతుదారులుగా మారడానికి అవకాశం దక్కుతుంది.

– కిషన్​రెడ్డి, కేంద్ర మంత్రి

మోడీ ప్యాకేజీతో ఉపయోగం ఎంత?

 

Latest Updates