నీరవ్ మోడీకి రూ.289 కోట్లిచ్చాం

  • వెల్లడించిన ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్
  • 18 నెలల తర్వాత వెలుగులోకి

దేశం విడిచి పారిపోయిన డైమండ్ వ్యాపారి నీరవ్ మోడీ, ఆయన మేనమామ మెహుల్ చోక్సిలకు ఇచ్చిన లోన్ వివరాలను మొట్టమొదటిసారి ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ బహిర్గతం చేసింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌‌లో(పీఎన్‌‌బీలో) ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్‌‌(ఓబీసీ)ను విలీనం చేస్తున్న నేపథ్యంలో ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. నీరవ్ మోడీ, మెహుల్ చోక్సిలు.. పీఎన్‌‌బీలో రూ.13,500 కోట్ల కుంభకోణం చేసిన సంగతి తెలిసిందే. బ్యాంకింగ్‌‌ రంగాన్ని ఈ కుంభకోణం ఓ కుదుపు కుదిపేసింది. ఈ ఇద్దరికి, ఉద్దేశపూర్వకంగా డబ్బులు ఎగ్గొట్టిన వారి కంపెనీలకు ఓబీసీ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసుల్లో వీరు ముంబైలోని కఫ్‌‌ పరేడ్‌‌లోని తమ కార్పొరేట్ బ్రాంచ్‌‌కు రూ.289 కోట్లు బాకీ పడ్డట్టు పేర్కొంది. నీరవ్ మోడీకి చెందిన కంపెనీలు ఫైర్‌‌‌‌స్టార్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్, ఫైర్‌‌‌‌స్టార్ డైమండ్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్‌‌లు ఓబీసీ వద్ద తీసుకున్న రుణాలు రూ.60.41 కోట్లు, రూ.32.25 కోట్లను తిరిగి చెల్లించలేదని పేర్కొంది.  చోక్సికి చెందిన కంపెనీలు గీతాంజలి జెమ్స్ రూ.136.45 కోట్లు, నక్షత్ర వరల్డ్ లిమిటెడ్  రూ.59.53 కోట్లు ఓబీసీకి ఎగ్గొట్టాయని తెలిపింది. పీఎన్‌‌బీలో స్కాం చేసిన నీరవ్‌‌ మోడీ, మెహుల్ చోక్సిలు.. 2018 ఫిబ్రవరిలో దేశం విడిచిపారిపోయారు.

ఇంత లేటు ఎందుకు ?

అయితే నీరవ్ మోడీకి ఇచ్చిన లోన్ వివరాలను 18 నెలలు పాటు బయట పెట్టకుండా ఉన్న ఓబీసీపై బ్యాంకింగ్ సర్కిల్‌‌లోని వ్యక్తులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఓబీసీ మాత్రమే కాక.. ఇతర బ్యాంక్‌‌లు కూడా మోడీ, చోక్సిలకు, ఇతర గ్రూప్ కంపెనీలకు ఇచ్చిన లోన్ వివరాలను బయట పెడుతున్నాయి. ఈ బకాయిలను రికవరీ చేసేందుకు అవసరమైన లీగల్ యాక్షన్ తీసుకోవాలని బ్యాంకింగ్ ఎక్స్‌‌పర్ట్,మహారాష్ట్ర ట్రేడ్ యూనియన్స్ జాయింట్ యాక్షన్ కమిటీ కన్వినర్ విశ్వాస్ ఉతాగి అన్నారు.   ఫారిన్ ఎక్సేంజ్‌‌ డీలింగ్స్ విషయంలో డిపార్ట్‌‌మెంట్లకు, ఆఫీసర్లకు వ్యతిరేకంగా ఏమైనా చర్యలు తీసుకున్నారా..?  నీరవ్ మోడీ, చోక్సి, ఇతర ఆర్థిక నిందితుల నుంచి ఎంత మొత్తాన్ని రికవరీ చేశారు..? అని ఉతాగి ప్రశ్నించారు. ఈ ఏడాది మార్చిలో ఓబీసీకి ప్రభుత్వం రూ.1,186 కోట్ల క్యాపిటల్ ఇన్‌‌ఫ్యూజన్‌‌ను అందించింది. ఈ ఏడాది మొదట్లో ఎస్‌‌బీఐ చోక్సి, ఆయన కుటుంబ సభ్యుల నుంచి రావాల్సిన లోన్ వివరాలను వెల్లడించింది.

Latest Updates