చెట్టు కింద ఆపరేషన్!

ఉస్మానియాలో జూడాల కొత్తరకం నిరసన

రోగుల ఇబ్బందులపై స్కిట్‌ చేసిన డాక్టర్లు
సమస్యలు పరిష్కరించాలని డిమాండ్

హైదరాబాద్, వెలుగు: ‘ఉస్మానియా దవాఖానలో ఓ వ్యక్తికి జూనియర్ డాక్టర్లు చెట్టు కింద పడుకోబెట్టి ఆపరేషన్‌ చేశారు. ఆపరేషన్‌కు ముందు పేషెంట్ కు ఇవ్వాల్సిన మత్తు మందు బయటనే కొనుక్కొని తెచ్చుకోవాలని డాక్టర్లు పేషెంట్ కుటుంబసభ్యులకు చెప్పారు. సారూ.. పేదోళ్లం అవన్నీ కొనలేకనే సర్కార్ దవాఖానకొచ్చినం.. మీరే దయ చూపాలంటూ.. పేషెంట్ తాలూకు వ్యక్తులు డాక్టర్లను వేడుకున్నారు’.. ఉస్మానియా ఓపీ బ్లాక్ ముంగట గురువారం  కనిపించిన సీన్ ఇది. అయితే ఇది రియల్ ఆపరేషన్ కాదు.. ఉస్మానియాలో పరిస్థితులు, రోగుల ఇబ్బందులకు అద్దం పట్టేలా జూనియర్ డాక్టర్లు స్కిట్ రూపంలో చూపించిన నిరసన ప్రదర్శన. పేషెంట్ హాస్పిటల్‌కు వచ్చినప్పట్నుంచీ, డిశ్చార్జ్‌ అయ్యే వరకూ ఎదుర్కొంటున్న పరిస్థితులను డాక్టర్లే స్కిట్ రూపంలో చేసి చూపించారు.

సర్కార్‌కు తెలియాలనే.. 

ఇటీవల వర్షాలకు ఉస్మానియా పాత బిల్డింగ్ లోకి నీళ్లు చేరి డాక్టర్లు, రోగులు ఇబ్బంది పడ్డరు. దీంతో ఆ బిల్డింగ్ ను ప్రభుత్వం క్లోజ్ చేయించింది. కానీ, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదు. జనరల్ సర్జరీ, ఆర్థో సహా పలు విభాగాల ఆపరేషన్ థియేటర్లు అన్నీ పాత బిల్డింగ్‌లోనే ఉన్నాయి. కులీకుత్‌బ్‌షా బిల్డింగ్‌లో తాత్కాలికంగా థియేటర్లు ఏర్పాటు చేశామని చెబుతున్నా, అందులో బెడ్లు తప్ప ఇంకేమీ లేవని జూడాలు చెబుతున్నారు. రకరకాల ఇబ్బందులతో పేషేంట్లు వస్తున్నారని, ఆపరేషన్లు అవసరం ఉన్నా, చేయలేకపోతున్నామని అంటున్నారు. ఆపరేషన్లన వాయిదా వల్ల పేషెంట్లకు ఇన్ఫెక్షన్లు, ఇతర సమస్యలు వస్తున్నాయని, రోగుల కుటుంబ సభ్యులు తమను తప్పుపడుతున్నారని జూడా అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ రోహిత్ తెలిపారు. దీనిని డీఎంఈ రమేశ్‌రెడ్డి, హాస్పిటల్ సూపరింటెండెంట్‌ దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కాలేదన్నారు. గాంధీని కరోనా పేషెంట్లకే కేటాయించడంతో, ఉస్మానియాకు పేషెంట్ల సంఖ్య పెరిగిందని, చాలా మందికి బెడ్లు దొరకడం లేదని జూడాలు చెప్పారు. అందుకే ఇక్కడి సమస్యలను స్కిట్‌ రూపంలో ప్రభుత్వానికి తెలియజేశామన్నారు. ఇప్పటికైనా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

For More News..

రూంమేట్‌కి లొకేషన్ షేర్ చేసి.. సూసైడ్ చేసుకున్న లవర్స్

ఇంట్లో పాత సామాను తీస్తుంటే.. రూ. 95 లక్షల విలువైన మగ్గు దొరికింది

బ్యాన్​ చేసిన​ చైనా యాప్స్​ను అమ్మాల్సిందే!

Latest Updates