మూడు ముక్కలు కానున్నఓయూ!

ఉద్యమాల పురిటిగడ్డ, వందేండ్ల చరిత్ర ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ మూడు ముక్కలు కానుందా, కాకతీయ, జేఎన్టీయూలు కూడా రెండుగా విడిపోనున్నాయా..? ఈ ప్రశ్నలకు ఔననే సమాధానమే వస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల అమల్లోకి తెచ్చిన నిబంధనలే దీనికి కారణమని అధికారవర్గాలు చెబుతున్నాయి. ప్రతి యూనివర్సిటీ పరిధిలో 200 కాలేజీలు మాత్రమే ఉండాలని కొంతకాలం కింద యూజీసీ రూల్​ తెచ్చిందని, తెలంగాణలో అది అమలుకాకపోవడంతో తాజాగా రిమైండర్​ లేఖను పంపిందని అంటున్నాయి. దీంతో ఉస్మానియా, కాకతీయ, జేఎన్టీయూలను విభజించే ప్రతిపాదన వచ్చిందని అంటున్నాయి. అయితే ఆయా చోట్ల కొత్త వర్సిటీలు ఏర్పాటు చేసి, కాలేజీలను వాటి పరిధిలోకి మార్చవచ్చని, చారిత్రక ప్రాధాన్యమున్న ఉస్మానియా, కాకతీయ వంటి వర్సిటీలను విభజించవద్దని విద్యావేత్తలు, స్టూడెంట్​యూనియన్ల నేతలు డిమాండ్​ చేస్తున్నారు.

మూడు వర్సిటీల్లో..

రాష్ట్రంలో మొత్తం 16 యూనివర్సిటీలు ఉన్నాయి. అందులో ఆరు సాంప్రదాయ, తొమ్మిది స్పెషలైజ్డ్‌ వర్సిటీలు, ఒక టెక్నికల్‌ యూనివర్సిటీ ఉంది. యూజీసీ, ఎంహెచ్‌ఆర్డీ రెండేండ్ల కింద తెచ్చిన కొత్త రూల్స్​ప్రకారం ఒక వర్సిటీ పరిధిలో రెండు వందల కంటే ఎక్కువ కాలేజీలు ఉండవద్దు. దీనిని వీలైనంత త్వరగా అమలు చేయాలని యూజీసీ అప్పట్లోనే రాష్ట్రాలకు లేఖలు రాసింది. అమలు చేయకుంటే రూసా నిధులనూ ఆపేస్తామని పేర్కొంది. దాంతో ఏ యూనివర్సిటీ పరిధిలో ఎన్ని కాలేజీలున్నాయనే దానిపై రాష్ట్ర ఉన్నత విద్యామండలి లెక్కలు తీసింది. తర్వాత ఈ విషయాన్ని పక్కన పెట్టింది. చాలా రాష్ట్రాల్లో యూజీసీ నిబంధనకు అనుగుణంగా వర్సిటీల విభజన, కాలేజీల మార్పు వంటివి జరిగాయి. రాష్ట్రంలో దీనిపై పెద్దగా చర్చ జరగలేదు.
తాజాగా దీనిపై మరో రిమాండర్‌ లేఖ పంపినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఉస్మానియా, కాకతీయ, జేఎన్టీయూలను విభజించే ప్రతిపాదన తిరిగి తెరపైకి వచ్చింది.

ఓయూనే మెయిన్‌…

1918లో ఏర్పాటైన ఉస్మానియా యూనివర్సిటీకి దేశంలోనే ఓ ప్రత్యేక గుర్తింపున్నది. 1,300 ఎకరాల్లో విస్తరించి ఉన్న వర్సిటీకి అనుబంధంగా ఎనిమిది క్యాంపస్‌ కాలేజీలుండగా, 53 డిపార్ట్‌మెంట్లు ఉన్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌, వికారాబాద్‌, మెదక్‌, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లోని 720 కాలేజీలు ఉస్మానియా వర్సిటీ పరిధిలో ఉన్నాయి. ఇన్ని కాలేజీలు ఉండటంతో పర్యవేక్షణ ఇబ్బందిగా మారిందని, అనుబంధంగా ఉన్న కాలేజీలను కొత్త జిల్లాలవారీగా విభజించి, ఆయా జిల్లాలకు సమీపంలోని వర్సిటీలోకి మార్చడంపై కసరత్తు కొనసాగుతోందని వర్సిటీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వర్సిటీ విభజన సమస్య తెరమీదికొచ్చింది.

కాలేజీల నుంచి వ్యతిరేకత

ఇప్పటికే కొత్త జిల్లాల ప్రకారం మరో వర్సిటీలోకి వెళ్లాలన్న సూచనలను చాలా కాలేజీలు తిరస్కరిస్తున్నాయి. వర్సిటీకి ఉన్న చారిత్రక గుర్తింపే దీనికి కారణం. కొత్తగా యూనివర్సిటీలు పెట్టి వాటి పరిధిలోకి కాలేజీలను మార్చాలని చూసినా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. ఈ పరిస్థితిని గమనించిన ఉన్నతాధికారులు అధికారులు.. కొత్త వర్సిటీ ఏర్పాటు చేయకుండా, ఉస్మానియానే మూడు వర్సిటీలుగా విభజించాలన్న ఆలోచన చేస్తున్నారు. కర్ణాటకలోని బెంగళూర్‌ యూనివర్సిటీని నాలుగు వర్సిటీలుగా మార్చి, కాలేజీలను వాటి పరిధిలో కొనసాగిస్తున్నారని అంటున్నారు. అందుకే ఓయూ పేరు మార్చకుండా.. ఓయూ 1, ఓయూ 2, ఓయూ 3 పేర్లతో కొనసాగించాలన్న ప్రతిపాదన కూడా వస్తోందని చెబుతున్నారు. హై

ఓయూను విభజిస్తే ఊరుకోం

వందేండ్ల చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీని విభజించే ఆలోచన సరికాదు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఓయూకు రావాలంటే టీఆర్​ఎస్​ నేతలకు భయం పట్టుకుంది. కేంద్రం పేరు చెప్పి ఓయూను విభజిస్తే ఊరుకునేది లేదు. ఇదంతా చరిత్రను కనుమరుగు చేసే కుట్ర. దీన్ని తప్పికొట్టేందుకు విద్యార్థులు సిద్ధంగా ఉన్నారు. జిల్లాకో యూనివర్సిటీ పెడతామని చెప్పి ఉన్న యూనివర్సిటీలను నిర్వీర్యం చేసే ఆలోచన చేయడం సిగ్గుచేటు- మూర్తి, ఎస్ఎఫ్‌ఐ స్టేట్‌ ప్రెసిడెంట్‌

 

 

 

 

 

Latest Updates