కశ్మీర్‌లో పరిస్థితులు బాలేవు : రాహుల్ గాంధీ

కశ్మీర్ లో పరిస్థితిని పరిశీలించేందుకు వెళ్లిన ప్రతిపక్ష నేతలను ఎయిర్ పోర్ట్ నుంచే తిప్పి పంపారు అధికారులు. కశ్మీర్ లో పరిస్థితులు బాగాలేవని నేతలు ఆరోపిస్తే… అంతా పర్ఫెక్ట్ గా ఉందని ప్రభుత్వం రిప్లై ఇచ్చింది. రాజకీయాలొద్దని మరోసారి ప్రతిపక్షాలకు సలహా ఇచ్చారు గవర్నర్ మాలిక్.

జమ్మూకశ్మీర్ లో ప్రతిపక్ష నేతలను అడుగుపెట్టనివ్వలేదు పోలీసులు. బుద్గామ్ లోని ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న నేతలను అక్కడ్నుంచే వెనక్కి తిప్పి పంపించారు అధికారులు. కాంగ్రెస్ ఎంపీలు రాహుల్ గాంధీ, గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మ, కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ KC వేణుగోపాల్, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, DMK ఎంపీ తిరుచ్చి శివ, LJD అధ్యక్షుడు శరద్ యాదవ్, తృణమూల్ నేత దినేశ్ త్రివేదీ, NCP ఎంపీ మాజిద్ మెమన్, RJD ఎంపీ మనోజ్ ఝాలు ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి శ్రీనగర్ వెళ్లారు. తమను రాష్ట్రంలోకి అనుమతించకపోవడంతో బుద్గాం జిల్లా మేజిస్ట్రేట్ కు కంప్లైంట్ చేశారు. తమను అడ్డుకోవడం రాజ్యాంగ విరుద్ధం, అప్రజాస్వామికమన్నారు నేతలు.

తమను జమ్మూకశ్మీర్ లో పర్యటించకుండా అడ్డుకోవడంపై నేతలు అభ్యంతరం తెలిపారు. జమ్మూకశ్మీర్ లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని… ఆరోపించారు. తమతో ఉన్న మీడియాపై దాడి చేశారన్నారు రాహుల్ గాంధీ. జమ్మూకశ్మీర్ లో పరిస్థితి బాగాలేదనడానికి మీడియాపై దాడి సాక్ష్యమన్నారు. విమానంలో కశ్మీర్ నుంచి వస్తున్న ప్రయాణికులు కన్నీళ్లు పెట్టుకోటం తాను చూశానన్నారు ఆజాద్.

గుడ్ విల్ కోసమే తాను రాహుల్ ను ఆహ్వానించానన్నారు జమ్మూకశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్. అయితే రాహుల్ తో సహా ప్రతిపక్ష నేతలు రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీలు జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవాలన్నారు.

కశ్మీర్ లోయలో 69 పోలీస్ స్టేషన్ల పరిధిలో పగటిపూట ఆంక్షలను ఎత్తివేసింది ప్రభుత్వం. జమ్మూ డివిజన్ లోని 81 పోలీస్ స్టేషన్ల పరిధిలో పగటిపూట ఆంక్షల్లేవన్నారు ఆ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ రోహిత్ కన్సల్. 15వందల ప్రైమరీ స్కూల్స్, వెయ్యి మిడ్ లెవెల్ స్కూల్స్ తెరిచామని… అయితే విద్యార్థుల హాజరుశాతం తక్కువగా ఉందన్నారు. అటెండెన్స్ పెంచేందుకు విద్యాశాఖ ప్రయత్నిస్తోందన్నారు.

జమ్మూకశ్మీర్ లో బ్లాక్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. మొత్తం 316 బ్లాక్ డెవలప్మెంట్ కౌన్సిల్స్ కు సంబంధించి… సెప్టెంబర్ లోపు రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు అధికారులు.

ప్రస్తుతానికి జమ్మూకశ్మీర్ ప్రశాంతంగానే ఉంది. ఇవాళ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు.

Latest Updates