మా టెస్టు కిట్లు మంచివేనంటున్న చైనా కంపెనీలు

మ్యానువల్ ప్రకారం వాడాలె: చైనా కంపెనీలు
లోపాలుంటే వాపస్ పంపుతామన్న కేంద్రం

బీజింగ్​: ఇండియాకు తాము సరఫరా చేసిన కరోనా ర్యాపిడ్ యాంటీబాడీ టెస్ట్ కిట్లు బాగానే ఉన్నాయని, మెడికల్ సిబ్బంది వాటిని యూజర్ మ్యానువల్ చదివి, దాని ప్రకారమే ఉపయోగించాలని రెండు చైనా కంపెనీలు చెప్పాయి. దేశంలో కరోనా యాంటీబాడీ టెస్టుల కోసం కేంద్రం 5 లక్షల టెస్టు కిట్లను వండ్ఫో బయోటెక్, లివ్జాన్ డయాగ్నస్టిక్స్ అనే రెండు చైనా కంపెనీల నుంచి తెప్పించి, రాష్ట్రాలకు అందజేసింది. ఈ కిట్లు సరిగ్గా పనిచేయడం లేదని, రిజల్ట్ తప్పుగా వస్తోందంటూ పలు రాష్ట్రాలు కేంద్రానికి కంప్లయింట్ చేశాయి. దీంతో వీటిని పూర్తిస్థాయిలో పరీక్షించేంత వరకూ ఉపయోగం ఆపేయాలని కేంద్ర హెల్త్ మినిస్టర్ హర్షవర్ధన్ వెల్లడించారు.

వీటికి పరీక్షలు నిర్వహించే ప్రక్రియను ICMR ఇప్పటికే ప్రారంభించిందని మంత్రి తెలిపారు. కిట్లు నాసిరకంగా ఉన్నాయని తేలితే, ఆ కంపెనీల కాంట్రాక్టు క్యాన్సెల్ చేస్తామని.. లేదా కొత్త కిట్లు తెప్పిస్తామన్నారు. దీనిపై వండ్ఫో కంపెనీ స్పందిస్తూ, తాము 70 దేశాలకు 1.80 కోట్ల కిట్లు పంపామని తెలిపింది. చైనా ఎన్ఎంపీఏతో పాటు ఇండియాలోని ఐసీఎంఆర్, ఎన్ఐవీ పూణే సంస్థల ఆమోదం తర్వాతే సరఫరా చేశామంది. తాము కూడా 10 దేశాలకు కిట్లు పంపామని, అన్ని చోట్ల నుంచీ మంచి ఫీడ్ బ్యాకే వచ్చిందని మరో కంపెనీ తెలిపింది.

కిట్లను యూజర్ మ్యానువల్ లో పేర్కొన్న‌ట్లుగా సరైన టెంపరేచర్ లో ఉంచాలని, ఓపెన్ చేశాక, నిర్దేశించిన టైం పీరియడ్ లోపే వాడాలని తెలిపింది. అయితే, ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ విపరీతంగా పెరగడంతో.. ఈ రెండు కంపెనీలు పూర్తిస్థాయిలో పరీక్షలు జరపకుండా, ఆతురతతో కిట్లను తయారు చేసి, సరఫరా చేస్తున్నాయని పలువురు నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Latest Updates