అభినందన్ పాక్ పైకి రాఫెల్ లో వెళ్లుంటే మరోలా ఉండేది

2019 ఫిబ్రవరిలో పాకిస్థాన్ యుద్ధ విమానాలను వెనక్కి తరిమికొడుతూ ఆ దేశానికి మన ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ చిక్కిపోయిన సంఘటన ప్రతి భారతీయుడికీ ఎన్నటికీ గుర్తుండిపోయే ఘటన. ఆ తర్వాత పాక్ పైన అంతర్జాతీయంగా ఒత్తిడి తెచ్చి అభినందన్ ను భారత్ వెనక్కి తీసుకురావడంతో ఆ ఎపిసోడ్ ముగిసింది. అయితే నాడు పాక్ యుద్ధ విమానాలకు ఎదురెళ్లిన సమయంలో మనం వాడిన యుద్ధ విమానం మిగ్ -21. అయితే ఆ రోజు దాని స్థానంలో రాఫెల్ ఉండి… దానిలో అభినందన్ కౌంటర్ ఇచ్చి ఉంటే పరస్థితి పూర్తిగా వేరేలా ఉండేదని నాడు ఎయిర్ ఫోర్స్ చీఫ్ గా ఉన్న బీఎస్ ధనోవ్ అన్నారు. నిన్న బాంబే ఐఐటీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నాడు పాక్ ఎఫ్-16 యుద్ధ విమానాల్లో మిగ్-21పై అటాక్ చేయడంతో అది కూలిపోయి.. వింగ్ కమాండర్ అభినందన్ శత్రు దేశానికి చిక్కారని అన్నారు ఐఏఫ్ మాజీ చీఫ్ ధనోవ్ అన్నారు. అదే ఎఫ్-16 కన్నా శక్తిమంతమైన రాఫెల్ మన చేతిలో ఉంటే రిజల్ట్ వేరేగా ఉండేదని ఆయన గట్టిగా చెప్పారు.

పరోక్షంగా కాంగ్రెస్ పై ఆగ్రహం
ఆ సమయానికి భారత్ చేతిలో రాఫెల్ యుద్ధ విమానాలు లేకపోవడానికి కారణమెవరంటూ పరోక్షంగా కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేశారు ధనోవ్. నాడు అభినందన్ వర్థమాన్ రాఫెల్ లో వెళ్లకపోవడానికి కారణమేంటని ప్రశ్నించారు. ఏ యుద్ధ విమానాన్ని కొనాలన్నది డిసైడ్ చేయడానికి 10 సంవత్సరాల టైం తీసుకున్నారంటూ గతంలో అధికారంలో ఉన్న యూపీఏపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఆలస్యం ఎఫెక్ట్ తర్వాత కనిపించిందన్నారు.

రక్షణ కొనుగోళ్లలో రాజకీయ జోక్యం వద్దు
రక్షణ కొనుగోళ్ల విషయంలో రాజకీయ జోక్యం ఉండకూడదని ఎయిర్ ఫోర్స్ మాజీ చీఫ్ బీఎస్ ధనోవ్ చెప్పారు. ఈ విషయంలో పొలిటికలైజ్ చేస్తే మొత్తం సిస్టమ్ స్లో అవుతుందని, ఫైల్స్ లేటుగా కదులుతాయని అన్నారు. దీని వల్ల యుద్ధ సామగ్రి, ఆయుధాలు సమకూర్చుకోవడంలో, వాటి ఆధునికీకరణలో అలస్యం జరుగుతుందన్నారు. దీన్ని ప్రజలు జాగ్రత్తగా గమనిస్తుంటారని చెప్పారాయన. గతంలో బోఫోర్స్ చాలా శక్తిమంతమైన గన్ అని దాని కొనుగోలు విషయంలోనూ కాంట్రవర్సీ వచ్చిందని, ఇప్పుడు రాఫెల్ పై కూడా అలానే జరుగుతోందని అన్నారు.

Latest Updates