కరోనా పోవాలంటే ‘లైట్’ ​ట్రీట్‌మెంట్

న్యూయార్క్​కరోనా పేషెంట్ల ఒంట్లో లైట్​ పెట్టాలట. డిసిన్​ఫెక్టెంట్లను ఇంజెక్షన్​ రూపంలో ఎక్కించాలట. అవును, ఈ వివాదాస్పద మాటలన్నది అమెరికా ప్రెసిడెంట్​ డొనాల్డ్​ ట్రంప్​ మరి. అలా చేస్తే వైరస్​ చచ్చిపోతుందని ఓ సలహా ఇచ్చారు. అసలేమైందంటే.. శుక్రవారం ట్రంప్​ మీడియాతో మాట్లాడారు. ఆ మీటింగ్​లో హోమ్​ల్యాండ్​ సెక్యూరిటీ ఫర్​ సైన్స్​ అండ్​ టెక్నాలజీ సెక్రటరీ బిల్​ బ్రయన్​ కూడా పాల్గొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ కాసేపు ఎండలో ఉంటే కరోనా వైరస్​ చచ్చిపోతుందని తమ స్టడీలో తేలిందంటూ చెప్పారు. సన్ లైట్​కు వైరస్ ​క్షణాల్లో అంతమవుతుందని, ఐసోప్రొపైల్​ఆల్కహాల్​తో 30 సెకన్లలోనే చచ్చిపోతుందని​ చెప్పారు. అవి విని ట్రంప్​ ఒకింత షాక్​ అయ్యారు. వెంటనే కరోనా పేషెంట్లకు ఆ డిసిన్​ఫెక్టెంట్​ను ఎక్కిస్తే ఎలా ఉంటుందంటూ ప్రశ్నించారు. ‘‘డిసిన్​ఫెక్టెంట్​తో ఒక్క నిమిషంలోనే వైరస్​ చచ్చిపోతుంది. మరి, దాన్ని ఇంజెక్షన్​ల రూపంలో పేషెంట్​ ఒంట్లోకి ఎక్కిస్తే ఎలా ఉంటుంది? లంగ్స్​ మొత్తాన్ని అది క్లీన్​ చేసేస్తుంది కదా. దీనిపై టెస్టులు చేస్తే బాగుంటుంది. దాంతో పాటు లైట్​తోనూ వైరస్​ను చంపే అవకాశాన్ని వాడుకుంటే బాగుంటుంది. మామూలు శక్తిమంతమైన లైట్​గానీ లేదా అల్ట్రావయొలెట్​ (యూవీ) లైట్​ సోర్స్​ను గానీ పేషెంట్ల ఒంట్లో పెడితే బాగుంటుందని అనుకుంటున్నా. ఒంట్లో లైట్​ పెట్టడంపై టెస్టులు చేయండి. మీరూ టెస్టులు చేస్తామంటున్నారు కదా. అది వినడానికి చాలా బాగుంది’’ అని బిల్​ బ్రయన్​కు ట్రంప్​ సూచించారు. అమెరికా ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలంటే దశల వారీగా లాక్​డౌన్​ను ఎత్తేయాల్సిందేనని తేల్చి చెప్పారు.

ట్రంప్​ మాటలు పట్టించుకోకండి

హెల్త్​ ఎక్స్​పర్ట్​లు ట్రంప్ సూచనలపై మండిపడ్డారు. ఇలాంటి ప్రయోగాలు చాలా ప్రమాదకరమని హెచ్చరించారు. ఎవరూ ఆయన మాటలను పట్టించుకోవద్దని సూచించారు. డిసిన్​ఫెక్టెంట్లు ఇంజెక్ట్​ చేసుకోవడం, తాగడం మంచిది కాదని అమెరికా ఫుడ్​ అండ్​ డ్రగ్​ అడ్మినిస్ట్రేషన్​ కమిషనర్​, వైట్​హౌస్​ కరోనా వైరస్​ టాస్క్​ఫోర్స్​ మెంబర్​ డాక్టర్​ స్టీఫెన్​ హాన్​ హెచ్చరించారు.

మరో 38 లక్షల కోట్ల ప్యాకేజీ

కంపెనీలు, ఆస్పత్రులను ఆదుకునేందుకు మరో విడత ఆర్థిక సాయానికి కాంగ్రెస్​ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. సుమారు రూ.38.17 లక్షల కోట్ల (50 వేల కోట్ల డాలర్లు) ప్యాకేజీకి సభ్యులందరూ ఆమోదం తెలిపారు.

50 వేలు దాటిన మృతులు

అమెరికాలో రోజూ 2వేల మందికి పైగానే మరణిస్తున్నారు. గురువారం ఒక్కరోజు 2,342 మంది చనిపోయారు. ఇప్పటిదాకా 50,954 మంది మృతి చెందారు. కేసుల సంఖ్య 9,03,298కు చేరుకుంది. 7,50,544 యాక్టివ్​ కేసులున్నాయి. 86 వేల మంది కోలుకున్నారు. న్యూయార్క్​, న్యూజెర్సీ, మసాచుసెట్స్​, కాలిఫోర్నియా, పెన్సిల్వేనియా, ఇల్లినాయీలలో వైరస్​ ప్రభావం ఎక్కువగా ఉంది. న్యూయార్క్​లో 20,861 మంది చనిపోగా, 2,68,581 మంది వైరస్​ బారిన పడ్డారు. న్యూజెర్సీలోనూ కేసులు లక్ష దాటాయి. 5,428 మంది మరణించారు.

Latest Updates