కేంద్రం భారీ ప్యాకేజీ..33 కోట్ల మందికి రూ.31 వేల కోట్లు

న్యూఢిల్లీ, వెలుగు: లాక్ డౌన్ తో ఇబ్బందులు పడుతున్న పేద ప్రజలను గరీబ్ కల్యాణ్ ప్యాకేజీ ద్వారా ఆదుకుంటున్నామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ పథకంతో ఇప్పటిదాకా 33 కోట్ల లబ్ధిదారులకు సాయం చేసినట్లు వెల్లడించింది. ఇందుకోసం 31,235 కోట్లను ఖర్చు చేసినట్లు తెలిపింది. రైతులు, వృద్ధులు, మహిళలు, కార్మికులు… ఇలా అన్ని వర్గాలకు చేకూరుతున్న లబ్ధిపై గురువారం కేంద్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ఏయే రంగాల వారికి ఎంత సాయం అందిందనే విషయాన్ని వివరించింది.

ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన

దేశంలోని 80 కోట్ల మంది ప్రజలకు లబ్ధి చేకూరేలా కేంద్రం ఈ పథకాన్ని ప్రవేశ పెట్టింది. ఇందుకోసం కేంద్రం 45 వేల కోట్లను ఖర్చు చేస్తోంది. 3 నెలల పాటూ ఒక్కోక్కరికి 5 కిలోల బియ్యం, కేజీ కంది పప్పును ఫ్రీగా అందిస్తోంది. తాజాగా ప్రధాన్ మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన కింద 40.03 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను 36 రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సరఫరా చేసింది. ఇందులో ఇప్పటికే 31 రాష్ర్టాలు/యూటీల్లోని 39.27 కోట్ల మందికి 19.63 లక్షల టన్నుల రేషన్​ను పంపిణీ చేసింది. 1,09,227 టన్నుల పప్పును ఇచ్చింది.

వితంతువులు, దివ్యాంగులకు చేయూత

నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ కింద రూ.1,400 కోట్లను 2.82 మంది సీనియర్ సిటిజెన్లు, వితంతువులు, దివ్యాంగులకు ఇచ్చింది.  ఒక్కొక్కరికి తొలి వాయిదా కింద రూ.500 ఇచ్చింది. వచ్చే నెలలో మరో 500 చొప్పున ఇవ్వనుంది.

2.66 కోట్ల ఉచిత సిలిండర్లు

దేశవ్యాప్తంగా 8 కోట్ల మందికి 3 నెలలు ఉచిత గ్యాస్ సిలిండర్లు కేంద్రం అందిస్తోంది. ఇందుకోసం 13 వేల కోట్లు ఖర్చు చేస్తోంది. ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన కింద 3.05 కోట్ల గ్యాస్ సిలిండర్లు బుక్ చేసుకున్నారు. అందులో 2.66 కోట్ల ఉచిత సిలిండర్లను లబ్ధిదారులకు డెలివరీ చేసింది.

కన్​స్ర్టక్షన్ వర్కర్లకు సపోర్ట్

బిల్డింగ్, కన్​స్ట్రక్షన్ వర్కర్ల నిధి నుంచి 2.17 కోట్ల మంది నిర్మాణ కార్మికులకు సాయం అందించింది.

‘ఉపాధి’ పెంపు

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీలకు కూలి రూ.20 పెంచింది. ఈ రేటును ఏప్రిల్ 1 నుంచి వర్తింపజేస్తోంది. ప్రస్తుత  ఏడాదిలో 1.27 కోట్ల మందికి పని దినాలు కల్పించింది. పెండింగ్ జీతాలు, మెటీరియల్ బాకీలు తీర్చేందుకు రూ.7,100 కోట్లు విడుదల చేసింది.

75 శాతం పీఎఫ్ విత్​డ్రా

ఉద్యోగుల పీఎఫ్​ నుంచి 75 శాతం లేదా 3 నెలల బేసిక్ పే విత్ డ్రా చేసుకునేందుకు కేంద్రం అనుమతిచ్చింది. ఇప్పటిదాకా 6.06 లక్షల మంది  రూ.1,954 కోట్లు విత్ డ్రా చేసుకున్నారు. 68,775 కంపెనీల్లో పనిచేసే 10.6 లక్షల మంది ఉద్యోగులకు ఈపీఎఫ్ వాటాగా రూ.162 కోట్లు బదిలీ చేసింది.

Latest Updates