44% ఉద్యోగుల ఫీలింగ్: బాస్ కంటే మేమే బాగా పనిచేయగలం

  • అసంతృప్తిగా ఉన్నవాళ్ల మాట ఇది
  • అయినా మేనేజర్ క్రైసిస్‌లో ఉంటే సాయం
  • మేనేజర్లపై కోపంగా ఉన్న 25 శాతం ఉద్యోగులు
  • బాస్‌ వల్లే జాబ్ వదిలేస్తున్నామన్నోళ్లు 33 శాతం
  • ఉద్యోగులపై యూరప్ కంపెనీ అధ్యయనం

ఉద్యోగం చేసే చోట బాస్‌కి, ఎంప్లాయిస్‌కి మధ్య మంచి రిలేషన్స్ ఉంటే పని బాగా జరుగుతుంది. ప్రొడక్టివిటీ పెరుగుతుంది. అదే టామ్ అండ్ జెర్రీ ఫైట్‌ లాంటి సీన్ ఉంటే ఎవరికీ పని మీద ఆసక్తి ఉండదు. బాస్, మేనేజర్, సూపర్‌వైజర్, ఇన్‌చార్జ్.. ఇలా ఎవరైనా సరే కంపెనీల్లో పని చేయించుకునే సుపీరియర్ ఎప్పుడూ కారాలు, మిరియాలూ నూరుతూ ఉంటే.. కిందిస్థాయి ఉద్యోగులు ఆఫీసుకు వెళ్లాలంటేనే ఏదో ప్రాణాలమీదికి వచ్చినట్టు ఫీలవుతారు.

ఇలాంటి పరిస్థితులను చూసి ఆ కంపెనీకి ఓ ఆలోచన వచ్చింది. అసలు బాస్‌కి ఉద్యోగులకు మధ్య కంపెనీల్లో రిలేషన్ ఎలా ఉంది? వాళ్ల బాస్/మేనేజర్ గురించి ఉద్యోగుల ఫీలింగ్ ఏంటన్న దానిపై అధ్యయనం చేసింది యూరప్‌లోని మాల్టా దేశానికి చెందిన కంపెనీ మల్టీలోటో. యూకేలో 2 వేల మందిపై సర్వే చేసిన ఆ కంపెనీ ఆసక్తికర విషయాలను బయటపెట్టింది.

పనిలో మేమే బెటర్

ఆఫీసులో పని విషయంలో తమ సుపీరియర్ (బాస్) కన్నా తామే చాలా బెటర్‌ అని 44 శాతం ఉద్యోగులు చెప్పారు. బాస్ చేసే పనిని కూడా తామే బాగా చేయగలమని తమ ఫీలింగ్‌ను బయటపెట్టారట. వర్క్ ఎలా చేయాలన్న విషయం తమకే బాగా తెలుసని చెప్పారు. అయితే వీరిలో చాలా మంది వర్క్‌ ప్లేస్‌లో అసంతృప్తితో, పనిని ఎంజాయ్ చేయలేకపోతున్నారని సర్వే తెలిపింది.

డ్యూటీ సంతృప్తి లేకున్నా బాస్‌కి లాయలిటీగా..

ఆశ్చర్యంగా బాస్ కన్నా తామే బాగా పని చేయగలం అని చెప్పిన వాళ్లు విధేయత విషయంలో రాజీ లేదని సర్వేలో చెప్పారు. డ్యూటీలో తమ అసంతృప్తికి, ఈ విషయంతో సంబంధం లేదంటున్నారు. బాస్‌కి సమస్య వచ్చినప్పుడు లాయలిటీ కచ్చితంగా చూపుతామని, క్రైసిస్‌లో సాయం చేస్తామని తెలిపారు. ఎంత అసంతృప్తి ఉన్నా కష్ట సమయంలో అడ్డం తిరగడం లాంటివి చేయకుండా అండగా ఉంటామంటున్నారు.

కష్టపెడుతన్నారనేటోళ్లు 20 శాతం

అవసరం లేకున్నా బాస్ తమని కష్టపెడుతున్నారని సర్వేలో పాల్గొన్న వారిలో 20 శాతం ఉద్యోగులు చెప్పారు. కష్టమైన పనులన్నీ తమకే ఇస్తుంటారని కంప్లైంట్ ఇచ్చారు చాలా మంది. అంతే కాదు. బాస్ సొంతంగా చేయాల్సిన పని తన కింది ఉద్యోగులతో చేయించుకుంటున్నారని చెప్పారు వీళ్లంతా. పైగా తానే చేసినట్లుగా ఆ పై అధికారులతో చెప్పుకుంటారని ఆరోపించారు. అలాగే 25 శాతం పార్టిసిపెంట్స్ తమ బాస్‌పై కోపంగా ఉన్నామని చెప్పారు. ఏళ్ల తరబడి ఆ కోపాన్ని అలాగే మనసులో ఉంచుకుని పని చేశామని సర్వేలో తెలిపారు. కావాలని కొంత మంది ఉద్యోగులపై కోపం పెంచుకునేలా బాస్‌ని రెచ్చగొట్టేవాళ్లమని 10 శాతం పార్టిసిపెంట్స్ చెప్పారు.

బాస్‌ వల్లే కంపెనీ వదిలేసి…

బాస్ వల్లే గతంలో పని చేసిన కంపెనీని వదిలేసి ఉద్యోగం మారాల్సి వచ్చిందని 33 శాతం ఉద్యోగులు చెప్పారు. బాస్‌ పోడు పడలేక ఉద్యోగం వదిలేయాల్సి వచ్చిందన్నారు.  అలాగే ప్రస్తుతం ఉన్న బాస్ తమ పట్ల కావాలని కోపంగా వ్యవహరించడం వల్ల కొత్త జాబ్ వెతుక్కుంటున్నామని 14 శాతం పార్టిసిపెంట్స్ చెప్పుకొచ్చారు.

Latest Updates