జీఎస్టీ కట్టలేదు, ధరలు తగ్గించలేదు

Over 50 builders face probe for profiteering under GST
  • 50 కంపెనీల నిర్వాకం
  • వీటిలో కొన్ని ప్రముఖ బిల్డర్లవి
  • ఇప్పటికే 60 మంది ఈ పని చేసినట్టు వెల్లడి

జీఎస్టీ రాయితీ ప్రయోజనాలను కస్టమర్లకు బదిలీ చేయకుండా అక్రమంగా లాభాలను పెంచుకున్న 50 మందికి పైగా రియల్టర్లపై డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ యాంటీ ప్రాఫిటీరింగ్‌ (DGAP) విచారణ ప్రారంభించింది. వీరిలో కొందరు బడా రియల్టర్లు కూడా ఉన్నారు. వీళ్లు జీఎస్టీ ఇన్ పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్లను కొనుగోలు దారులకు బదిలీ చేయలేదనే ఆరోపణలు ఉన్నాయి.

న్యూఢిల్లీ: జీఎస్టీ అమల్లోకి రాకముందే, అంటే 2017కు ముందు స్థిరాస్తులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 6.5 శాతం వరకు పన్నులు వేసేవి.జీఎస్టీ అమలయ్యాక రియల్‌ ఎస్టేట్‌ ను 12 శాతం పన్ను శ్లాబులోకి తెచ్చారు. దీంతో బిల్డర్లు ధరలు పెంచారు. వీళ్లు వివిధ వస్తువులపై, సేవలపై చెల్లించిన పన్నులకు ఇన్‌‌‌‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ లను పొందినప్పటికీ ధరలు మాత్రం తగ్గించలేదు (ప్రా-పిటీరింగ్​). జీఎస్టీ రావడానికి ముందు ఇన్‌‌‌‌పుట్‌ట్యాక్స్‌ క్రెడిట్‌ సదుపాయం లేదు. సిమెంట్‌, స్టీల్‌ పై కచ్చితంగా పన్నులు చెల్లించేవారు. జీఎస్టీ వచ్చాక పన్నుల చెల్లింపుపై ఇన్‌‌‌‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్లు ఇస్తున్నారు. అందుకే ధరలు తగ్గించాల్సి ఉండగా పెంచుతున్నా రు. 21 నెలల పాటు ట్యాక్స్‌ క్రెడిట్‌ సదుపాయం ఇచ్చిన జీఎస్టీ మండలి ఈ నెల ఒకటి నుంచి కొత్త ప్రాజెక్టులకు వర్తింపజేయబోమని ప్రకటించింది. క్రెడిట్స్‌ ఇచ్చి నా వినియోగదారులకు మేలు కలగడం లేదు కాబట్టే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ప్రస్తుతం డీజీఏపీ విచారణ ఎదుర్కొంటున్న కంపెనీలు దేశవ్యాప్తంగా ఉన్నాయి. కొన్ని ప్రముఖ కంపెనీలూ ఈ జాబితాలో ఉన్నాయి. విచారణ నివేదికను కొన్ని నెలల తరువాత సమర్పించే అవకాశాలు ఉన్నాయి.

బిల్డర్లు ఏమంటున్నారంటే..

నేషనల్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవెలప్‌ మెంట్‌ కౌన్సిల్‌ ప్రెసిడెంట్‌ నిరంజన్‌‌‌‌ హీర్‌ నందానీ మాట్లాడుతూ మెటీరియల్‌ , లేబర్‌ ఖర్చులతోపాటు పన్నుల మొత్తాలు భారీగా పెరగడంతో ఇళ్ల ధరలూ పెరిగాయని తెలిపారు. ప్రాజెక్టును బట్టి ప్రాంతాన్ని బట్టి ఖర్చులు మారుతుంటాయని, జీఎస్టీకి ముందు విధించిన సుంకాల వల్ల నష్టాలు వచ్చాయని అన్నా రు. జీఎస్టీ అమలు తరువాత ఇచ్చిన ఇన్‌‌‌‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్లను కొనుగోలుదారులకు బదిలీ చేయలేదన్న ఆరోపణలు నిజం కావని హీర్‌ నందానీ అన్నారు. జీఎస్టీ  అమల్లోకి వచ్చినప్పుడు స్థిరాస్తుల రంగం గిరాకీ లేక చతికిలపడిందని ఈ రంగంలోని నిపుణులు అంటున్నారు. గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఇళ్లపై జీఎస్టీ ఉండదు కాబట్టి అందరూ వాటినే ఎంచుకున్నారు. ఫలితంగా నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు ఆదరణ తగ్గింది. మరో విషయం ఏమిటంటే కంప్లిషన్‌‌‌‌ సర్టిఫికెట్‌ ఉన్న ప్రాజెక్టులకు వాడిన మెటీరియల్స్‌,సేవలకు చెల్లించిన పన్నులకు మాత్రం ఇన్‌‌‌‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్లు ఇచ్చారు. జీఎస్టీ వచ్చాక నిర్మాణంలో ఉండి , తదనంతరం కంప్లిషన్‌‌‌‌ సర్టిఫికెట్‌ పొందినవాటికి ఇన్‌‌‌‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్లు ఇవ్వలేదు. స్థిరాస్తులరంగం మందగించడంతో చాలా మంది డెవెలపర్లు అక్రమ లాభాల వ్యతిరేక నిబంధనలను (యాంటీప్రాఫిటీరింగ్‌ ) పట్టించుకోలేదు.

రెరా అమల్లోకి వచ్చాక స్థిరాస్తులపై నిఘా ఎక్కువయింది. జీఎస్టీ ప్రయోజనాలు కొనుగోదారులకు బదిలీ అవుతున్నాయా ? లేదా ? అనే విషయమై ప్రభుత్వం దృష్టి పెట్టింది. వ్యాపారంలో సంక్లిష్టతలు, తగిన మార్గదర్శకాలు లేకపోవడంతో చాలా మంది రియల్టర్లు ఇన్‌‌‌‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్లను కొనుగోలు దారులకు బదిలీ చేయలేదు’’ అని డెలాయిట్‌ ఇండియా పార్ట్‌‌‌‌నర్‌ ఎంఎస్‌ మణి అన్నారు. నిర్మాణంలోని ప్రాజెక్టులపై పన్నులను 12 శాతం నుంచి ఐదుశాతానికి తగ్గిం చడం, చౌక ధరల ఇళ్ల ప్రాజెక్టుల-పై పన్నును ఎనిమిది శాతం నుంచి ఒక శాతానికి తగ్గించడంతో ఇన్‌‌‌‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్లను ఎత్తేశారు.యాంటీ ప్రాఫిటీరింగ్‌ ఆరోపణల వల్ల నమోదైన 125 కేసులను డీజీఏపీ దర్యాప్తు చేసింది. వీరిలో60 శాతం మంది బిల్డర్లు ఇన్‌‌‌‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్ల ప్రయోజనాలను కస్టమర్లకు బదిలీ చేయలేదని గుర్తించారు. నిర్వహణపరమైన ఇబ్బందుల వల్ల నిబంధనలు పాటించడం కష్టమవుతోందని బిల్డర్లు చెబుతున్నారు. అధికారులు కూడా ఈ విషయంలో ఏకీభవిస్తున్నారు. జీఎస్టీ చట్టాల్లో యాంటీ ప్రాఫిటీరింగ్‌ నిబంధనలు సరిగ్గా లేవని అంటున్నారు.

జీఎస్టీ ఎగ్గొడుతున్న చిన్న రెస్టారెంట్లు

దేశవ్యాప్తంగా పలు చిన్న రెస్టారెంట్లు, బిజినెస్‌ టూ కన్సూమర్‌ (బీ2సీ)కంపెనీలు ఎగ్గొ ట్టిన జీఎస్టీని వసూలు చేయడానికి అధికారులు ప్రత్యేక విధానాన్ని రూపొందిస్తున్నా రు. ఇవి వినియోగదారుల నుంచి జీఎస్టీ వసూలు చేసినా ప్రభుత్వానికి మాత్రం చెల్లించలేదు. ఈవిషయమై చాలా మంది ఐరిస్‌ పెరిడాట్‌ యాప్‌ ద్వారా ఫిర్యాదు చేశారు. ఈ యాప్‌ ద్వారా ఏదైనా రెస్టారెంట్లు జీఎస్టీని సక్రమంగా చెల్లించిందీ లేనిదీ తెలుసుకోవచ్చు. చెల్లించలేదని తెలిస్తే ఫిర్యాదు ఇవ్వవచ్చు. వార్షిక టర్నోవర్‌ రూ.1.50కోట్ల వరకు ఉన్న బీ2సీ సంస్థలకు కాంపోజిషన్‌‌ స్కీమ్‌ వర్తిస్తుంది కాబట్టి అవి జీఎస్టీని వసూలు చేయకూడదు. ఆ విషయాన్ని రసీదులపైనా ముద్రించాలి. చాలా కంపెనీలు ఈ నిబంధనను పాటించకుండా జీఎస్టీ వసూలు చేస్తున్నాయి.

 

 

Latest Updates