కరోనా నుంచి కోలుకున్నవారు 10.94లక్షల మంది

  • 24 గంటల్లో నమోదైన కేసులు 57,000
  • 60 శాతం కేసులు జులైలోనే

న్యూఢిల్లీ: మన దేశంలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. గత నాలుగ రోజులుగా రోజుకు దాదాపు 50 వేల కేసులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం 57,118 కేసులు నమోదయ్యాయని కేంద్ర హెల్త్‌ మినిస్ట్రీ ప్రకటించింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 16,95,988 కి చేరింది. అయితే కరోనా నుంచి ఇప్పటి వరకు 10.94 లక్షల మంది కోలుకున్నారు. రికవరీ రేట్‌ 64.52 శాతంగా ఉందని అధికారులు చెప్పారు. కరోనా బారిన పడి 764 మంది చనిపోయిన దీంతో మృతుల సంఖ్య 36,511కి చేరింది. శనివారం ఉదయం వరకు ఇండియాలో 1,93,58,659 టెస్టులు చేసినట్లు ఐసీఎమ్‌ఆర్‌‌ ప్రకటించింది. జులై నెలలోనే కేసులు ఎక్కువగా నమోదయ్యాయని అధికారులు చెప్పారు. దాదాపు 60 శాతం కేసులు, 50 శాతం మరణాలు జులైలోనే నమోదయ్యాయని అన్నారు. జనవరి 30న కేరళలో మొదటి కరోనా కేసు నమోదు కాగా.. 183 రోజుల్లో అది 16లక్షల మార్క్‌ దాటింది. లక్ష కేసులు నమోదయ్యేందుకు 110 రోజులు పట్టగా.. అతి తక్కువ కాలంలోనే 15 లక్షల కేసులు వచ్చాయని అధికారులు చెప్పారు. మహారాష్ట్రలో కేసుల సంఖ్య 4,22,118కి చేరింది. 2,45,859 కేసులతో తమిళనాడు తర్వాత స్థానంలో కొనసాగుతోంది. మూడు రోజుల్లో 30వేల కేసులు నమోదవడంతో ఏపీ దేశ రాజధాని ఢిల్లీని దాటేసి మూడోస్థానానికి చేరుకుంది. ఏపీలో ప్రస్తుతం 1,40,933 కేసులు ఉండగా.. 1349 మంది వ్యాధి బారినపడి మరణించారు. దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వ్యాప్తి తగ్గిందని అధికారులు చెప్పారు.

Latest Updates