ఓవర్ త్రో రూల్స్ పై MCC మార్పులు

ఒక్క ఓవర్ త్రో ప్రతిష్టాత్మకమైన వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ను తలకిందులు చేసింది. ఓడి పోవాల్సిన ఇంగ్లండ్ కప్ కొట్టేసింది. దీంతో సోషల్ మీడియాలో ఓవర్ త్రో ఓ చెత్త రూల్ అంటూ సీరియస్ అవుతున్నారు. దీంతో  క్రికెట్‌ చట్టాల్లోని ఓవర్‌ త్రో రూల్స్ ని సవరణలు చేసే దిశగా మెరిల్‌ బోన్ క్రికెట్‌ క్లబ్‌(MCC) అధికారులు ఆలోచిస్తున్నారు. క్రికెట్‌ చట్టాలను రూపొందించే MCC అధికారులు తర్వాత జరిగే చట్ట సవరణలో ఓవర్‌ త్రో అంశంపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. MCC అధికారులు ఓవర్‌ త్రో నిబంధనల్లో సవరణలు చేసే దిశగా పరిశీలిస్తున్నారని టైమ్స్‌ లండన్‌ పత్రిక తెలిపింది.

ప్రపంచకప్‌ చివరి ఓవర్‌లో ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మన్‌ బెన్‌స్టోక్స్‌ బ్యాటింగ్‌ చేస్తుండగా మూడు బాల్స్ లో 9 రన్స్ అవసరమయ్యాయి. నాలుగో బాల్ ని డీప్‌ మిడ్‌ వికెట్‌ మీదుగా ఆడిన స్టోక్స్‌ రెండు పరుగులకు ప్రయత్నించాడు. అదే సమయంలో ఫీల్డర్‌ మార్టిన్‌ గప్తిల్‌ విసిరిన బాల్ స్టోక్స్‌ బ్యాట్‌ కు తాకి బౌండరీ చేరింది. ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మెన్‌ తీసిన 2 రన్స్ తో పాటు ఓవర్‌ త్రో వల్ల ఎక్స్ ట్రా 4 రన్స్ ఆ టీమ్ కు కలిసివచ్చాయి. దీంతో ఓటమి అంచున ఉన్న ఇంగ్లండ్‌ మ్యాచ్‌ ను టైగా ముగించింది. ఈ ఓవర్‌ త్రో వల్ల ఇంగ్లాండ్‌ కు 6 పరుగులకు బదులు ఐదు పరుగులే ఇవ్వాల్సిందని, అంపైర్లు తప్పుచేశారని ప్రముఖ సీనియర్‌ అంపైర్‌ సైమన్‌ టోఫెల్‌ అభిప్రాయపడ్డారు.

ఏదైనా కారణం చేత ఓవర్‌ త్రో వల్ల బాలక బౌండరీ చేరితే.. ఆ పరుగులతో పాటు అప్పటికే బ్యాట్స్‌మెన్‌ పూర్తిచేసిన పరుగులను లెక్కించి వారికి కేటాయిస్తారు. అయితే ఫీల్డర్‌ బంతిని త్రో చేసే సమయానికి బ్యాట్స్‌మెన్‌ ఒకర్నొకరు దాటి పరుగు చేస్తేనే ఆ పరుగును లెక్కిస్తారు. ఇదే విషయాన్ని సైమన్‌ టోఫెల్‌ తెలిపాడు.  ఈ ప్రపంచకప్‌ ఫైనల్స్‌లో గప్తిల్‌ త్రో విసిరేసరికి రెండో పరుగుకు ప్రయత్నించిన బ్యాట్స్‌మెన్‌ ఇద్దరూ ఒకర్నొకరు దాటలేదు. దీంతో ఇంగ్లండ్‌ టీమ్ కు ఐదు పరుగులే వస్తాయన్నారు సైమన్‌.

 

Latest Updates