దేశాన్ని మళ్లీ విభజిస్తున్నారంటూ పౌరసత్వ బిల్లు చించేసిన ఒవైసీ

సిటిజన్‌షిప్ బిల్లుపై చర్చ లోక్‌సభలో హీట్ పెంచింది. కాంగ్రెస్, టీఆర్ఎస్, ఎన్సీపీ, బీఎస్పీ, తృణమూల్ సహా పలు విపక్షాలు ఈ బిల్లును వ్యతిరేకించాయి. సభలో చర్చ సందర్భంగా కేంద్ర హోం మంత్రి  అమిత్ షాపై ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమిత్ షాని హిట్లర్‌తో పోలుస్తూ వ్యాఖ్యలు చేశారు. మొండిగా రాజ్యాంగ విరుద్ధమైన బిల్లు తెస్తున్నారని అన్నారు ఒవైసీ. ఈ బిల్లు.. భారత స్వాతంత్ర్యం కోసం పోరాడిన యోధులను అవమానించేలా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముస్లింలు శరార్థులుగా వచ్చే అవకాశం లేకుండా చేస్తున్నారన్నారు. దేశాన్ని మళ్లీ రెండోసారి విభజించే ప్రయత్నం చేస్తున్నారంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారాయన. దీన్ని తాను వ్యతిరేకిస్తున్నానంటూ బిల్లు కాపీని సభలోనే చించేశారు.

హిట్లర్ కామెంట్స్ తొలగింపు

పాక్, బంగ్లాదేశ్, అఫ్ఘానిస్థాన్‌ల నుంచి వలస వచ్చిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం ఇచ్చేలా 1955 నాటి సిటిజన్‌షిప్ చట్టాన్ని సవరించేందుకు అమిత్ షా సోమవారం సభలో బిల్లు ప్రవేశపెట్టారు. దీనిపై ఒవైసీ మాట్లాడుతూ ఈ బిల్లు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేలా ఉందని అన్నారు. ఈ తరహా చట్టాల నుంచి భారత్‌ను కాపాడాలని స్పీకర్‌ను, హోం మంత్రి అమిత్ షాను కోరుతున్నానని అన్నారు. అలాకాకుండా ఇజ్రాయిల్ తరహా చట్టాలను తెస్తే, హిట్లర్ వంటి నియంతల లిస్టులో అమిత్ షా కూడా చేరుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలపై అధికార పక్ష సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో, స్పీకర్ ఓం బిర్లా ఆ కామెంట్స్‌ని రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు చెప్పారు.

Latest Updates