106 రోజుల జైలు జీవితంలో ఆత్మస్థైర్యం పెరిగింది

  • బెయిల్‌పై వచ్చాక  కాంగ్రస్ నేత చిదంబరం తొలి ప్రెస్ మీట్

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో 106 రోజుల జైలు జీవితం తర్వాత తనలో ఆత్మస్థైర్యం మరింత పెరిగిందని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం అన్నారు. మంత్రిగా ఉన్న సమయంలో తాను సక్రమంగానే పని చేశానని, చివరికి న్యాయమే గెలుస్తుందన్న నమ్మకం తనకు ఉందని చెప్పారాయన. కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో ఐఎన్ఎక్స్ మీడియాకు మేలు జరిగేలా నిర్ణయాలు తీసుకుని, అక్రమాలకు పాల్పడ్డారంటూ ఆగస్టు 21న ఈడీ ఆయన్ని అరెస్టు చేసింది. ఈ కేసులో తీహార్ జైలులో ఉన్న ఆయన బుధవారం రాత్రి బెయిల్‌పై బయటకు వచ్చారు. గురవారం ఉదయం పార్లమెంటు సమావేశాలకు కూడా హాజరయ్యారు చిదంబరం. ఈ సందర్భంగా ఉల్లి ధరల పెరుగుదలకు నిరసనగా పార్లమెంటు భవనం వద్ద కాంగ్రెస్ నిర్వహించిన ఆందోళనలో ఆయన పాల్గొన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో మీడియాతో మాట్లాడారాయన. తాను ఎటువంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోలేదని, చివరికి న్యాయమే గెలుస్తుందని అన్నారు. వ్యాపారవేత్తలు, అధికారులు, మీడియా అందరికీ ఇది తెలుసని చెప్పారు. 106 రోజుల తర్వాత తాను స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నానని అన్నారు. జైలులో తాను చెక్క బల్లపై పడుకున్నానని, శారీరకంగా, మానసికంగా ఇంకా దృఢంగా తయారయ్యానని చెప్పారు.

ఉల్లిపాయలు తినకుంటే ఇంకేం తింటున్నారు

ఎన్డీఏ ప్రభుత్వంలో భారత ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతోందని అన్నారు చిదంబరం. ప్రధాని మోడీ ఏనాడూ దీనిపై స్పందించకుండా, రాజకీయ ప్రసంగాలకే పరిమితమవుతున్నారని ఆరోపించారాయన. ఉల్లిధరలు పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నా కేంద్ర ప్రభుత్వానికి ఏమాత్రం పట్టడంలేదన్నారు. కేంద్ర ఆర్థికమంత్రి తమ ఇంట్లో ఉల్లిపాయలు తినమని చెబుతున్నారని, మరి ఇంకే తింటారని ప్రశ్నించారు చిదంబరం. ఆ మాటలను బట్టే ప్రజా సమస్యలపై వాళ్ల మైండ్ సెట్ ఏంటో అర్థమవుతోందని అన్నారు.

Latest Updates