పద్మనాభ స్వామి ఆలయ బాధ్యతలు రాజ వంశానికే: సుప్రీం

న్యూఢిల్లీ: కేరళలోని ప్రముఖ దేవాలయం పద్మనాభ స్వామి టెంపుల్ మేనేజ్‌మెంట్‌కు సంబంధించిన విషయంపై సుప్రీం కోర్టు సోమవారం కీలక తీర్పును వెలువరించింది. ఇక నుంచి పద్మనాభ ఆలయ నిర్వహణ బాధ్యతలు ట్రావెన్‌కోర్ రాజ కుటుంబానికే చెందుతాయని సుప్రీం స్పష్టం చేసింది. ఈ కేసు తొమ్మిదేళ్ల నుంచి అత్యున్నత న్యాయస్థానంలో విచారణలో ఉంది. ఆలయ నిర్వహణను సంప్రదాయంగా వస్తున్న మాజీ రాజ కుటుంబం నుంచి రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని 2011లో కేరళ హైకోర్టు తీర్పు చెప్పింది. తొమ్మిదేళ్ల నుంచి సుప్రీంలో విచారణలో ఉన్న ఈ కేసులో సోమవారం తుది తీర్పును వెలువరించిన సుప్రీం.. ఇక నుంచి దేవాలయ పరిపాలన, నిర్వహణ బాధ్యతలు మాజీ రాజ కుటుంబానికే చెందుతాయని చెప్పింది. అలాగే కేరళ హైకోర్టు తీర్పును రద్దు చేసింది. ఈ తీర్పును స్వాగతిస్తున్నామని కేరళ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ‘సుప్రీం తీర్పునకు కట్టుబడి ఉంటాం. అత్యున్నత న్యాయస్థానం తీర్పును, స్ఫూర్తిని మేం ఎప్పుడూ అనుసరిస్తూనే వచ్చాం’ అని దేవసోమ్ మినిస్టర్ కడకంపల్లి సురేంద్రన్ చెప్పారు.

Latest Updates