ముగిసిన శ్రీ పద్మావతి, శ్రీనివాసుల పరిణయోత్సవాలు

తిరుమలలో శ్రీ పద్మావతి, శ్రీనివాసుల పరిణయోత్సవాలు వైభవంగా ముగిశాయి. మూడు రోజులపాటు ఈ ఉత్సవాలు కన్నుల పండువగా జరిగాయి. తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనంలో..వైకుంఠాన్ని తలపించే సెట్టింగులతో.. వేడుకలను ఘనంగా నిర్వహించింది టీటీడీ. శ్రీవారి కళ్యాణోత్సవాలను చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.

ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. ముందుగా శ్రీవారి ఆలయం నుంచి స్వామి, అమ్మవార్లను మంగళ వాయిద్యాల నడుమ నారాయణగిరి ఉద్యానవనంలోని మండపానికి తీసుకొచ్చారు.  ఎదుర్కోలు తర్వాత శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసుని కళ్యాణాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు.

సాయంత్రం ఆస్థానంలో భాగంగా అర్చకుల వేద పఠనం, కళాకారుల సంగీత విభావరి, కవితలు, నృత్యాలు నివేదించారు. అన్నమాచార్య కీర్తనలను అందరినీ అద్భుతంగా ఆలపించారు. ఆ తర్వాత శ్రీదేవి, భూదేవి సహితుడైన శ్రీనివాసుడు అశేష భక్త జనం మధ్య ఊరేగుతూ ఆలయ ప్రవేశం చేశారు. దీంతో మూడురోజుల పద్మావతీ పరిణయోత్సవాలు ముగిశాయి.

పరిణయోత్సవాలతో శ్రీవారి ఆలయంలో ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను మూడు రోజుల పాటు రద్దు చేసింది టిటిడి.