తిరుమ‌ల శ్రీవారితో పెట్టుకుంటే బూడిదే: స్వామి ప‌రిపూర్ణానంద

తిరుమల తిరుపతి శ్రీవారిని దర్శించుకోవాలంటే అన్యమతస్థులు ఇవ్వాల్సిన ‘డిక్లరేషన్’పై ఏపీ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై స్వామి పరిపూర్ణానంద స్పందించారు. మీడియాతో మాట్లాడిన ఆయన ధర్మాన్ని కాపాడడానికి తాము పోరాడతామని చెప్పారు. తనకు హిందూత్వం తప్ప మరేదీ అవసరం లేదని చెప్పారు. దేవాలయాల గురించి మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడాలన్నారు.

తిరుమల కొండతో పెట్టుకున్న వారి బూడిద కూడ దొరకలేదని, ఆ చరిత్ర కూడా కళ్లముందే ఉందన్నారు స్వామి ప‌రిపూర్ణానంద‌.సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. జగన్ హిందువు అని, క్రైస్తవుడని నిరూపించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ముఖ్యమంత్రి జగన్ క్రైస్తవుడే… అయినా… డిక్లరేషన్ ఇవ్వాలని ఆయన స్పష్టం చేశారు. డిక్లరేషన్ వ్యవస్థ హిందువులు పెట్టింది కాదని… ఆంగ్లేయులే 42 పాయింట్స్ తో డిక్లరేషన్ ను ఏర్పాటు చేశారని తెలిపారు. మంత్రి నాని చరిత్ర తెలుసుకొని మాట్లాడాలని, తన శాఖ తాను చూసుకుంటే సరిపోతుందని హితవుపలికారు. నోరుంది కదా అని ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సరికాదని, జగన్ స్పందించకపోతే కేంద్ర ప్రభుత్వం కచ్చితంగా జోక్యం చేసుకుంటుందన్నారు పరిపూర్ణానంద స్వామీజీ.

హిందువుల‌పై శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువుల మనోభావాలను సీఎం జగన్ కచ్చితంగా గౌరవించాల్సిందేనని పరిపూర్ణానంద స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో జగన్‌ను ఓడించడానికి కొందరు కుట్ర పన్నుతున్నారని, మంత్రి నాని లాంటి వాళ్లు ఈ కుట్రలో భాగస్వామ్యం అయ్యారని ఆరోపించారు. తిరుమల దర్శనార్థం వెళ్లే సమయంలో ప్రతి ఒక్కరూ తప్పని సరిగా ‘డిక్లరేషన్’ ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పారు. జగన్ ప్రభుత్వానికి 150 సీట్లు వచ్చాయని, అందులో 149 స్థానాలు హిందువులు ఓట్లు వేస్తేనే వచ్చాయని స్వామీజీ తెలిపారు. కొడాలి నానికి ఏమాత్రం చరిత్ర తెలియదని, ఓసారి చరిత్రను తిరిగేయాలని స్వామీజీ హితవు పలికారు. దేవుళ్ల గురించి మాట్లాడే స్థాయి నానికి లేదన్నారు.

Latest Updates