అందమైన అమ్మాయిలతో ఆర్మీ జవాన్లపై హనీట్రాప్

జవాన్లకు భారత ఆర్మీ హెచ్చరికలు

హనీ ట్రాప్స్‌ పెరగడంతో అప్రమత్తం

పాక్ తన వక్రబుద్ధి మళ్లీ మళ్లీ బయటపెట్టుకుంటోంది. భారత ఆర్మీ రహస్యాలు దొంగిలించడానికి అడ్డదారులు తొక్కుతోంది. మన సైనికులపైకి అమ్మాయిల ముసుగుతో వల (హనీట్రాప్) విసురుతోంది. ఈ కుట్రలకు సోషల్ మీడియానే వేదికగా ఎంచుకుంటోంది పాక్ ఆర్మీ. కుటుంబానికి దూరంగా ఉంటూ సరిహద్దులో పహారా కాస్తున్న జవాన్లకు మత్తుగా మాటలు చెప్పి.. నెమ్మదిగా లోబరుచుకుని ‘ట్రాప్’లోకి దింపుతోంది. తమ మాయలో పడ్డాక సైనిక, ఆయుధ స్థావరాల వివరాలను కూపీ లాగుతోంది. తరచూ ఇటువంటి ఘటనలు ఎక్కువ కావడంతో భారత ఆర్మీ దీనిపై అప్రమత్తం అయింది. భారత్ జవాన్లకు కొన్ని జాగ్రత్తలు చెబుతూ అడ్వైజరీ జారీ చేసింది.

రాజస్థాన్‌లో ఇద్దరు జవాన్లకు హనీట్రాప్

తాజాగా రాజస్థాన్‌లో ఇద్దరు ఆర్మీ జవాన్లు పాక్ ఆర్మీ హనీట్రాప్‌లో పడ్డారు. లాన్స్‌ నాయక్ రవి వర్మ, సిపాయి విచిత్ర బెహెరా పాక్ ఇంటెలిజెన్స్‌ వలలో చిక్కారని గుర్తించి రాజస్థాన్ పోలీసులు వారిని అరెస్టు చేశారు. పాక్ హనీ ట్రాప్ ఐడీలను ట్రాక్ చేస్తున్న మన ఆర్మీ వారిని పట్టుకోగలిగింది. సీరాత్ అనే ఐడీ నుంచి మహిళ ఫొటోతో వాళ్లని లోబరుచుకుని ఆర్మీ రహస్యాలను దొంగిలించే ప్రయత్నం చేసినట్లు గుర్తించారు అధికారులు. నిన్న ఈ ఇద్దరు జవాన్లను అరెస్టు చేసి, దర్యాప్తు చేస్తున్నారు రాజస్థాన్ పోలీసులు.

పాకిస్థాన్ కుట్రలను పసిగట్టి..

పాక్ కుట్రలను పసిగట్టిన భారత ఆర్మీ ఇంటెలిజెన్స్ మన జవాన్లను అప్రమత్తం చేసింది. సైనికులను ఎలా వలలోకి లాగుతోందన్న దానిపై హెచ్చరిస్తూ అడ్వైజరీ జారీ చేసింది. అక్టోబరులోనే దీన్ని ఇష్యూ చేసినట్లు తెలుస్తోంది. జవాన్లను అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేసింది.

ఆర్మీ జారీ చేసిన అడ్వైజరీ కీలకమైన అంశాలు

  • ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫాంల ద్వారానే జవాన్లను టార్గెట్ చేస్తున్నట్లు ఆర్మీ గుర్తించింది.
  • హనీట్రాప్‌ల కోసం ప్రత్యేకంగా 150 ఫేస్ బుక్ ఐడీలను క్రియేట్ చేసింది పాక్. ఆ ఐడీలను ట్రాక్ చేసిన భారత ఇంటెలిజెన్స్ వర్గాలు వాటి జోలికె వెళ్లొద్దని హెచ్చరించింది.
  • గుర్తు తెలియని వ్యక్తులు, ముఖ్యంగా పరిచయం లేని మహిళలు, మత గురువుల ఐటీల నుంచి ఎటువంటి మెసేజ్‌లు వచ్చినా స్పందించొద్దు.
  • సోషల్ మీడియా వేదికగా అసలు ఎటువంటి పర్సనల్, సెన్సిటివ్ సమాచారాన్ని ఎవరితోనూ షేర్ చేసుకోవద్దు.
  • హనీ ట్రాప్‌ల విషయంలో అలర్ట్‌గా ఉండండి.
  • ఆర్మీ అధికారులు, జవాన్ల సోషల్ మీడియా ఐడీలు, ఫోన్ నంబర్లను దొంగిలించేందుకు పాక్ కుట్రలు చేస్తోంది జాగ్రత్త.
  • ఆర్మీ హెడ్ క్వార్టర్స్ లేదా ఇన్సూరెన్స్ ఏజెన్సీల నుంచి ఫోన్  చేస్తున్నట్లుగా చెప్పి.. సమాచారం లాగే చాన్స్ ఉందని హెచ్చరించింది ఆర్మీ.
  • బాబాలు, ఆధ్యాత్మికవేత్తల పేర్లతో కూడా ఇటీవల ఆర్మీ జవాన్లను ట్రాప్ చేయడానికి పాక్ కుట్ర చేస్తోందని అలర్ట్ చేసింది భారత ఆర్మీ.

 

Latest Updates