మరో వివాదానికి తెరలేపిన పాక్..టెర్రరిస్టుల ఫోటోలతో సిక్కులకు వెల్ కమ్

పాకిస్తాన్ మరో వివాదానికి తెరలేపింది. కర్తార్పూర్ కారిడార్ ఓపెనింగ్ కు సంబంధించి పాకిస్తాన్ విడుదల చేసిన వీడియోలో ఖలిస్తాన్ టెర్రరిస్ట్ గ్రూప్ సభ్యులు ఉన్న వాల్ పోస్టర్ కనిపించడం వివాదం సృష్టిస్తోంది. ఇండియా–పాక్ బోర్డర్ లో నిర్మించిన కర్తార్ పూర్ కారిడార్ ఈ నెల 9న ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కర్తార్ పూర్ సాహెబ్ ను దర్శించుకునేందుకు వచ్చే ఇండియన్ సిక్కులకు వెల్కమ్ చెప్తూ 4 నిమిషాలున్న ఓ సాంగ్ ను పాకిస్తాన్ సమాచార శాఖ రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్ లో వైరల్ అవుతోంది. అందులో ఆపరేషన్ బ్లూస్టార్ లో చనిపోయిన ఖలిస్తాన్ టెర్రరిస్టులు భింద్రన్ వాలే(సిక్కు మత శాఖ దమ్దామి తక్సల్ చీఫ్), మేజర్ జనరల్ షాబేగ్ సింగ్(అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఇండియన్ ఆర్మీలో తన మేజర్ పదవి వదిలిపెట్టి ఖలిస్తాన్ ఉద్యమంలో చేరాడు), అమ్రిక్ సింగ్ ఖల్సా( ఖలిస్తానీ స్టూడెంట్ లీడర్) వీరు ముగ్గురూ ఉన్న ఓ ఫ్లెక్సీ పాట బ్యాక్ గ్రౌండ్ లో కనిపించడం, దానిపై ‘ఖలిస్తాన్ 2020’ అని రాసి ఉండటంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కర్తార్ పూర్ కారిడార్ ఓపెనింగ్ తో పాక్–ఇండియా మధ్య శాంతి, మత సామరస్యం పెరుగుతాయని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆశిస్తున్నట్లు ఆ దేశ సమాచార శాఖ చెబుతోంది. ఓ వైపు శాంతి, సంక్షేమం అని చెప్తూనే వీడియోలో ఖలిస్తాన్ టెర్రరిస్టుల ఫోటోలను చిత్రీకరించడంపై పాక్ బుద్ధి బయటపడుతోందంటూ దేశవ్యాప్తంగా విమర్శలు వినిపిస్తున్నాయి.

పాక్  ‘రహస్య ఎజెండా’: అమరీందర్

కర్తార్పూర్ కారిడార్ ప్రారంభం వెనక పాకిస్తాన్ ‘రహస్య ఎజెండా’ ఉందని పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ అనుమానం వ్యక్తంచేశారు. ఈ విషయంలో మనదేశం అప్రమత్తంగా ఉండాలని ఆయన బుధవారం మీడియాతో చెప్పారు. కర్తార్పూర్ కారిడార్ కు యాత్రికులను ఆహ్వానిస్తూ పాక్ రిలీజ్ చేసిన అఫీషియల్ వీడియోలో ఖలిస్తాన్ వేర్పాటువాది జర్నైల్ సింగ్ బింద్రన్వాలే తో పాటు మరో ఇద్దరు సెపరేటిస్టుల పోస్టర్లు ఉన్నాయి. ఈ వీడియో విడుదలైన తర్వాత పంజాబ్ సీఎం కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. ‘‘పాకిస్తాన్ రహస్య ఎజెండా గురించి మొదట్నించి నేను హెచ్చరిస్తూనే ఉన్నాను. ఒకవైపు వాళ్లు(పాకిస్తాన్) ప్రేమ చూపిస్తూ, మరోవైపు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయంలో మనం చాలా అప్రమత్తంగా ఉండాలి’’ అని అమరీందర్ సింగ్ చెప్పారు. రాష్ట్రంలో ‘సిక్కు మిలిటెన్సీ’కి మళ్లీ ఊపిరిపోసే ప్రయత్నాలకు పాకిస్తాన్ కర్తార్పూర్ కారిడార్ ను ఉపయోగించుకునే అవకాశముందని అమరీందర్ గతంలో ఆందోళన వ్యక్తం చేశారు. కారిడార్ ఓపెనింగ్ ను దృష్టిలో ఉంచుకుని పంజాబ్ లో హైఎలర్ట్ ప్రకటించామని కూడా ఆయన చెప్పారు.

వాళ్లే రియల్ హీరోలు

కర్తార్ పూర్ కారిడార్ ప్రాజెక్టును సాకారం చేయడంలో కాంగ్రెస్ నేత నవజోత్ సింగ్ సిద్దూ, పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్లే నిజమైన హీరోలు అంటూ బుధవారం అమృత్సర్ లో రాత్రికి రాత్రే హోర్డింగ్స్ వెలిశాయి. ‘సిద్దూ, ఇమ్రాన్ ఖాన్ నిజమైన హీరోలు, కర్తార్ పూర్ ప్రాజెక్టును రియాలిటీగా మార్చిన క్రెడిట్ వారికే దక్కుతుంది’ అనే కామెంట్స్, వారి ఫోటోలతో అమృత్సర్ మున్సిపాలిటీలో బ్యానర్లు కనిపించాయి. వారిద్దరి వల్లే ప్రాజెక్టు పూర్తయ్యిందంటూ మరికొన్ని టౌన్లలోనూ బ్యానర్లు పెట్టారు. మున్సిపల్ వర్కర్లు ఈ హోర్డింగ్స్ ను తీసివేశారు. అమృత్సర్ ఈస్ట్ సెగ్మెంట్ తో సహా మరికొన్ని ఏరియాల్లో తానే బ్యానర్లు పెట్టించానని సిద్ధూ అనుచరుడు, అమృత్ సర్ మున్సిపల్ కౌన్సిలర్ హర్పాల్ సింగ్ వర్కా బుధవారం మీడియాతో చెప్పారు. పీఎంగా ఇమ్రాన్ ప్రమాణస్వీకారానికి సిద్ధూ వెళ్లినప్పుడు.. సిక్కు భక్తులకోసం కర్తార్ పూర్ సాహెబ్ కారిడార్ ఓపెన్ చేయాలని కోరినట్లు గుర్తుచేశారు.

Latest Updates