ఆ క్రికెటర్ నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి.. గర్భవతిని చేశాడు

11 ఏళ్లు వాడుకుని మొహం చాటేశాడంటూ యువతి సంచలన ఆరోపణలు

పాకిస్తాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ బాబర్ ఆజంపై ఓ యువతి సంచలన ఆరోపణలు చేసింది. పాక్ కు చెందిన హమీజా అనే యువతి మీడియా సమావేశం పెట్టి చేసిన సంచలన ఆరోపణలను  పాకిస్తాన్ న్యూస్ ఛానల్ ’24 న్యూస్ హెచ్‌డీ ’ప్రసారం చేసింది. టీ20.. వన్డేలకు కెప్టెన్ గా ఉన్న బాబర్ ను ఇటీవలే టెస్టు ఫార్మాట్లకు కూడా కెప్టెన్ గా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. మెరుగైన ఆట తీరుతో అంతర్జాతీయంగా గుర్తింపు సంపాదించుకుంటున్న బాబర్ వ్యక్తిగత జీవితంపై హమీజా చేసిన ఆరోపణలు.. కలకలం రేపాయి.

తాను.. బాబర్ ఒకే స్కూల్లో చదువుకున్నామని.. ఇద్దరి ఇల్లు ఒకే చోట ఉండడంతో స్కూల్ లైఫ్ లోనే పరిచయం ఉందన్నారు. ఇంకా క్రికెట్ జీవితాన్ని ప్రారంభించని రోజుల్లోనే బాబర్ ఆజమ్ తనను ప్రేమిస్తున్నానని చెబితే తాను అంగీకరించానని హమీజా ఆరోపిచింది. మంచి క్రికెటర్ గా ఎదుగుతాడని అతని కోసం తాను చాలా డబ్బు ఖర్చు చేసి ఎంతో ప్రోత్సహించిన రోజులను మరచిపోయాడని ఆరోపించింది. మా పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో  2011లోనే ఇళ్లు వదిలి బయటకు వెళ్లిపోయామని.. పంజాబ్ హౌసింగ్ సొసైటీలోని గుల్బెర్గ్ ప్రాంతంలో ఒక అద్దె ఇంట్లో కాపురం చేశామన్నారు. కోర్టుకు వెళ్లి అయినా సరే పెళ్లి చేసుకుందామని చెప్పడంతో అతని మాటలు నమ్మానని వివరించింది.

పాక్ జట్టుకు ఎంపికైన తర్వాత ప్రవర్తన మారిపోయింది

2014లో పాకిస్తాన్ జాతీయ జట్టుకు ఎంపికైన తర్వాత బాబర్ ఆజమ్ ప్రవర్తన లో మార్పు వచ్చిందని.. అప్పటి నుండి తనను నిర్లక్ష్యం చేయడం మొదలుపెట్టాడని.. తాను పెళ్లి చేసుకుందామని అడిగితే తిరస్కరించేవాడని హమీజా ఆరోపించింది. 2015లో తాను గర్భవతిని అయ్యానని చెబితే తీవ్రంగా కొట్టాడు. నమ్మి వచ్చిన వాడు పెళ్లి చేసుకుంటాడని భావిస్తే గర్భవతిని చేసి దారుణంగా మోసం చేశాడు.. ఇంటికి తిరిగి వెళదామనుకుంటే.. తల్లిదండ్రులను అందరినీ వదిలివచ్చిన తనకు మొహం చెల్లక వెల్లలేకపోయాను. గర్భవతిగా ఉన్న తన వద్దకు కొంత మంది స్నేహితులను తీసుకొచ్చి బలవంతంగా తీసుకెళ్లి అబార్షన్ చేయించాడని కంటతడిపెట్టుకుని విలపించింది. బాబర్ ఆజమ్ వేధింపులు భరించలేక 2017లో నాసిరాబాద్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశానని.. పోలీసులకు ఫిర్యాదు చేస్తావా.. వెంటనే కంప్లయింట్ వెనక్కి తీసుకోవాలంటూ ఒత్తిడి తెస్తే.. భర్తే కదా అని అంగీకరించానని వివరించింది. దీన్ని అలుసుగా తీసుకుని మరో మూడేళ్లు నన్ను వాడుకుని పూర్తిగా మోసం చేశాడని.. కొద్ది రోజుల క్రితం వెళ్లి మళ్లీ నిలదీస్తే.. నిన్ను పెళ్లి చేసుకునే ప్రశ్నేలేదని తెగేసి చెప్పాడని విలపించింది.

బాబర్ పై అన్ని రకాలుగా పోరాటం కొనసాగిస్తా

తనను కట్టుకున్న వాడు బాబర్ ప్రపంచ స్థాయికి ఎదగాలని ఎంతో ఆశపడ్డాను. అతనికి ఎంతో సహాయం చేశాను.. ఒక అమ్మాయిని మోసం చేసిన మోసగాడని తేలిపోవడంతో క్రికెట్ పెద్దలకు ఫిర్యాదు చేశాను.. అయితే క్రికెట్ బోర్డులోని వారు ‘‘అది బాబర్ వ్యక్తిగత విషయం.. మాకు సంబంధం లేదు.. మేమేం చేయలేమన్నారని మీడియా సమావేశంలో వెల్లడించింది. అతడిని నమ్మి ఇంట్లో పెద్దలను కాదనుకుని వస్తే.. అన్ని రకాలుగా వాడుకుని…  గర్భవతిని చేసి రోడ్డున వదిలేయడం దారుణం.. ఇలాంటి నీచుడికి తగిన గుణపాఠం నేర్పాలని కోరింది. మోసగాడిని శిక్షించాలని కోరడం తన ప్రాథమిక హక్కు అని స్పష్టం చేసింది. మోసగాడు పాక్ జాతీయ జట్టు కెప్టెన్ అయితే పరువు ఏమవుతుంది..?  అతనికి వ్యతిరేకంగా న్యాయస్థానాలతోపాటు.. అన్ని చోట్లా పోరాటం చేస్తానని హమీజా స్పష్టం చేసింది. బాబర్ ను వెంటనే కెప్టెన్సీ నుండి తొలగించాలని హమిజ పాక్ బోర్డును కోరింది.

 

Latest Updates