పాక్‌‌ ఇంటికి.. కివీస్‌‌ సెమీస్‌‌కి

  • బంగ్లాపై 94 రన్స్‌‌ తేడాతో పాకిస్థాన్​ విజయం   
  • ఇమాముల్‌‌ సెంచరీ, షాహీన్‌‌కు 6 వికెట్లు

లార్డ్స్‌‌: సంచలనం చేస్తామని బీరాలకు పోయిన పాకిస్థాన్​కు సెమీస్​ బెర్త్​ దక్కలేదు. బంగ్లాదేశ్​పై నెగ్గినా.. నాకౌట్​అదృష్టం కివీస్​ను వరించింది. అసాధ్యమనే తరహాలో ఆడకపోయినా.. ఓ మంచి ఫెర్ఫామెన్స్ తో శుక్రవారం జరిగిన లీగ్​ మ్యాచ్​లో పాక్​ 94 రన్స్​తేడాతో బంగ్లాను ఓడించింది. ముందుగా బ్యాటింగ్​ చేసిన పాక్​ 50 ఓవర్లలో 9 వికెట్లకు 315 పరుగులు చేసింది. ఇమాముల్‌‌ హక్‌‌ (100 బంతుల్లో 7 ఫోర్లతో 100),  బాబర్‌‌ అజమ్‌‌ (98 బంతుల్లో 11 ఫోర్లతో 96) దుమ్మురేపారు. సెమీస్​ చేరాలంటే బంగ్లాను 7 పరుగుల లోపే ఆలౌట్​చేయాల్సిన పరిస్థితుల్లో బౌలింగ్ కు దిగిన దాయాది జట్టు చతికిలపడింది. దీంతో బంగ్లా 44.1 ఓవర్లలో 221 రన్స్​చేసి ఆలౌటైంది.  షకీబల్‌‌ హసన్‌‌ (77 బంతుల్లో 6 ఫోర్లతో 64) హాఫ్‌‌ సెంచరీ చేశాడు. ఛేజింగ్​లో బంగ్లాను షాహీన్​ షా (6/35) ఘోరంగా దెబ్బతీశాడు. ఆశలు పెట్టుకున్న సౌమ్య సర్కార్‌‌(22), తమీమ్‌‌ ఇక్బాల్‌‌(8), ముష్ఫికర్‌‌ రహీమ్‌‌(16) , లిటన్‌‌ దాస్‌‌(32) తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. 33వ ఓవర్​లో షకీబల్​ ఔట్​తో మొత్తానికే మ్యాచ్​పై పట్టు కోల్పోయింది. షాహీన్​షాకు ‘మ్యాన్ ​ఆఫ్​ ద మ్యాచ్’ అవార్డు లభించింది.

ఇమాముల్‌‌– బాబర్‌‌ సూపర్‌‌ హిట్‌‌

అంతకుముందు 23 రన్స్​కే ఫఖర్​ (13) ఔటైనా. ఇమాముల్​, బాబర్​ నిలకడగా ఆడారు. రెండో వికెట్‌‌కు 157 పరుగులు జోడించి ఇన్నింగ్స్​ను ఆదుకున్నారు. సైఫుద్దీన్‌‌ వేసిన 32వ ఓవర్‌‌లో రెండు వరుస బౌండరీలు కొట్టి సెంచరీకి చేరువైన బాబర్‌‌ మూడో బంతికి వికెట్ల ముందు దొరికిపోయాడు. ఇమామ్‌‌కు జత కలిసిన హఫీజ్‌‌(27) కూడా ధాటిగా ఆడడంతో 36 వ ఓవర్‌‌లోనే పాక్​200 మార్కు దాటింది. ఈ క్రమంలో  99 బంతుల్లో సెంచరీ పూర్తి చేసిన ఇమాముల్‌‌ ఆ తర్వాత ఎదుర్కొన్న బంతికే  మిరాజ్‌‌ బౌలింగ్‌‌లో హిట్‌‌వికెట్‌‌గా వెనుదిరిగాడు. దీంతో మూడో వికెట్‌‌కు 66 రన్స్‌‌ పార్ట్​నర్​షిప్​ విడిపోగా, తర్వాతి ఓవర్‌‌లో హఫీజ్‌‌ను ముస్తాఫిజుర్‌‌ ఔట్‌‌ చేశాడు. హారిస్‌‌ సోహైల్‌‌(6) నిరాశపరచగా, ఒంటరిగా పోరాడిన ఇమాద్‌‌ వసీమ్‌‌(43) జట్టు స్కోరు 300 దాటించాడు. అయితే ఆఖరి ఓవర్‌‌లో ఇమాద్‌‌, ఆమిర్‌‌ (8)ను వరుస బంతుల్లో ఔట్‌‌ చేసిన ముస్తాఫిజుర్‌‌ హ్యాట్రిక్‌‌పై నిలిచాడు. అంతకముందు రిటైర్డ్‌‌హర్ట్‌‌గా వెనుదిరిగిన కెప్టెన్ సర్ఫరాజ్‌‌(3 నాటౌట్‌‌) హ్యాట్రిక్‌‌ బాల్‌‌ను ఎదుర్కొని సింగిల్‌‌ తీసి ఇన్నింగ్స్‌‌ ముగించాడు.

సచిన్‌‌ సరసన షకీబల్‌‌

ఒక వరల్డ్‌‌కప్‌‌లో ఏడు హాఫ్‌‌ సెంచరీలు చేసిన రెండో క్రికెటర్‌‌గా షకీబల్‌‌ హసన్‌‌ ఇండియా లెజెండ్‌‌ సచిన్‌‌ టెండూల్కర్‌‌ రికార్డు సమం చేశాడు.  సచిన్‌‌ 2003 టోర్నీలో ఏడు ఫిఫ్టీలు కొట్టాడు. అలాగే, ప్రపంచకప్‌‌లో 600 రన్స్‌‌ చేసిన మూడో క్రికెటర్‌‌గా  షకీబ్‌‌ నిలిచాడు. ఈ లిస్ట్‌‌లో సచిన్‌‌ (2003లో 673), మాథ్యూ హేడెన్‌‌ (2007లో 659) ముందున్నారు.

సంక్షిప్త స్కోర్లు

పాకిస్థాన్: 315/9 (ఇమాముల్​100, బాబర్​ 96, ముస్తాఫిజుర్​5/75),

బంగ్లాదేశ్: 221 ఆలౌట్​(షకీబల్​64, షాహీన్​షా 6/35).

 

Latest Updates