సార్క్‌ కరోనా ఫండ్‌కు పాక్‌ 22 కోట్లు

  • ప్రకటించిన విదేశాంగ కార్యదర్శి

ఇస్లామాబాద్‌: కరోనాపై పోరాటం చేసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిపాదించిన సార్క్‌ ఎమర్జెన్సీ ఫండ్‌కు తమ దేశం తరఫున రూ.22.80కోట్లు (మూడు బిలియన్‌ డాలర్లు) ఇవ్వనున్నట్లు పాకిస్తాన్‌ ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయంపై పాక్‌ విదేశాంగ కార్యదర్శి సొహైల్‌ అహ్మద్‌.. సార్క్‌ ప్రధాన కార్యదర్శి రువాన్‌ వీరకూన్‌తో మాట్లాడారని ఫారెన్‌ మినిస్ట్రీ ఆఫీస్‌ చెప్పింది. నిధులు వినియోగంపై కొన్ని కండీషన్లు పెట్టినట్లు తెలుస్తోంది. అన్ని సార్క్‌ ప్రధాన కార్యదర్శి పరిధిలోనే జరగాలని, నిధుల వినియోగం తదితర అంశాలన్నీ సభ్యదేశాలతో సంప్రదించి, చర్చించిన తర్వాతే నిర్ణయించాలని చెప్పినట్లు సమాచారం. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు సార్క్‌ దేశాలన్నీ ఒక తాటిపైకి రావాలని మోడీ పిలుపునిచ్చారు. ఈ మేరకు అత్యవసర నిధిని ప్రతిపాదించి.. మన దేశం తరఫున రూ.75కోట్లు ప్రకటించారు. ఆ తర్వాత నేపాల్‌, ఆఫ్గనిస్తాన్‌, మాల్దీవులు, బంగ్లాదేశ్‌, శ్రీలంక కూడా నిధులు ఇచ్చేందుకు ముందుకు రాగా.. నెల రోజుల తర్వాత ఇప్పుడు పాక్‌ నిధులు ఇచ్చేందుకు అంగీకరించింది. పాకిస్తాన్‌లో వైరస్‌ విజృంభించడం, హాస్పిటల్స్‌ లేవని ఇమ్రాన్‌ ఖాన్‌ కామెంట్స్‌ చేసిన రెండో రోజు నిధులు ఇచ్చేందుకు ముందుకు రావడం గమనార్హం.

Latest Updates