పాకిస్థాన్‌కు యూరోపియ‌న్ యూనియ‌న్ షాక్‌.. యూర‌ప్ దేశాల‌కు పీఐఏ విమానాల‌పై బ్యాన్

పాకిస్థాన్‌కు యూరోపియ‌న్ యూనియ‌న్ షాక్ ఇచ్చింది. పాక్ ప్ర‌భుత్వ విమాన‌యాన సంస్థ అయిన పాకిస్థాన్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్‌లైన్స్ (పీఐఏ) విమాన స‌ర్వీసుల‌పై ఆరు నెల‌ల పాటు బ్యాన్ విధించింది. యూర‌ప్ దేశాల్లోకి ప్ర‌వేశం లేద‌ని, గ‌తంలో యూర‌ప్ దేశాల్లోకి విమానాలు న‌డిపేందుకు ఇచ్చిన అనుమ‌తిని ర‌ద్దు చేసింది యూరోపియ‌న్ యూనియ‌న్ ఎయిర్ సేఫ్టీ ఏజెన్సీ. ఇటీవ‌లే పాకిస్థాన్‌కు చెందిన 262 మంది పైల‌ట్ల లైసెన్సుల‌ను పాక్ విమాన‌యాన శాఖ ర‌ద్దు చేసింది. ఈ సంద‌ర్బంగా వారి శిక్ష‌ణ వ‌ర‌స్ట్ అంటూ.. పైల‌ట్లుగా వారి సామ‌ర్థ్యాన్ని చెత్త‌తో పోల్చారు పాక్ విమాన‌యాన శాఖ మంత్రి గులాం స‌ర్వార్ ఖాన్. మే నెల చివ‌రిలో పాకిస్థాన్‌లోని క‌రాచీలో పీఐఏకి చెందిన విమానం కూలి.. 97 మంది మ‌ర‌ణించ‌డంతో ఆ ఘ‌ట‌న‌పై ద‌ర్యాప్తు జ‌రిపిన పాక్ విమాన‌యాన శాఖ పైలట్ ఫెయిల్యూర్ వ‌ల్లే ఆ ప్రమాదం జ‌రిగిన‌ట్లు గుర్తించింది. ఆ త‌ర్వాత జ‌రిపిన ఎంక్వైరీ ద్వారా స‌రైన శిక్ష‌ణ లేకుండా పైల‌ట్ లైసెన్స్ పొందిన వాళ్లు చాలా మందే ఉన్నార‌ని తేలడంతో 262 మంది పైల‌ట్ల‌కు లైసెన్స్ ర‌ద్దు చేసింది. ఈ నేప‌థ్యంలో పాక్ విమానాల‌ను అనుమ‌తించడం అంత సుర‌క్షితం కాద‌ని భావించి జూలై 1 నుంచి ఆరు నెల‌ల పాటు పీఐఏ విమానాల‌కు అనుమ‌తి నిరాక‌రిస్తూ యూరోపియ‌న్ యూనియ‌న్ ఎయిర్ సేఫ్టీ ఏజెన్సీ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. దీన్ని ధ్రువీక‌రిస్తూ పాకిస్థాన్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్ లైన్స్ సంస్థ ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. అయితే అనుమ‌తిని పున‌రుద్ధ‌రించాల‌ని ద‌ర‌ఖాస్తు చేస్తామ‌ని పీఐఏ తెలిపింది.