రేప్ చేసిన వాళ్లకు కొత్త శిక్షను సూచించిన పాక్ ప్రధాని

లాహోర్ సమీపంలో గతవారం జరిగిన సామూహిక అత్యాచారం కేసులో దేశవ్యాప్తంగా నిరసనలు రేకెత్తాయి. దాంతో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సామూహిక అత్యాచారాలపై స్పందించారు. గ్యాంగ్ రేప్‌కు పాల్పడిన నిందితులకు ఆయన సరికొత్త శిక్షను సూచించారు. నిందితులకు కెమికల్ కాస్ట్రేషన్ ద్వారా మగతనాన్ని తగ్గించే శిక్షను అమలు చేయాలని ఆయన అన్నారు.

లాహోర్ సమీపంలో ఒక మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి కారులో వెళ్తుండగా పెట్రోల్ అయిపోయింది. దాంతో మహిళ సాయం కోసం రోడ్డు మీద నిలబడింది. అటుగా వెళ్తున్న వ్యక్తులు ఆమెను చూసి ఆగారు. సాయం చేస్తామంటూ దగ్గరికొచ్చి.. మహిళను బెదిరించి పిల్లల ముందే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై పాకిస్తాన్ అంతటా నిరసనలు రేకెత్తుతున్నాయి. వందలాది మంది మహిళలు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ రోడ్ల మీదికి వచ్చారు.

అయితే మగవాళ్లు లేకుండా ఒక మహిళ రాత్రిపూట డ్రైవింగ్ చేయడమేంటని లాహోర్ పోలీసు చీఫ్ ఉమర్ షేక్ బాధితురాలిని తప్పబడుతూ మాట్లాడారు. దాంతో ఈ వ్యవహారం మరింత ముదిరింది. వెంటనే స్పందించిన ప్రభుత్వం ఉమర్ షేక్‌ను మందలించింది. దాంతో ఉమర్ పాక్ మహిళలకు క్షమాపణలు చెప్పాడు.

ఈ కేసు గురించి ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ.. ‘లైంగిక వేధింపులకు పాల్పడిన వారిని బహిరంగంగా ఉరితీయాలి. కానీ అలా ఉరితీయడం యూరోపియన్ యూనియన్ దేశాలకు వ్యతిరేకం. అలా చేస్తే ఆయా దేశాలతో వాణిజ్య ఒప్పందాలు దెబ్బతింటాయి. అందుకే గ్యాంగ్ రేప్‌కు పాల్పడిన వారిపై కెమికల్ కాస్ట్రేషన్ ప్రయోగించాలి. నేను దీని గురించి చాలాసార్లు విన్నాను. ఇది చాలా దేశాలలో అమలు చేయబడుతుంది. హత్యలకు ఏవిధంగానైతే గ్రేడింగ్ ఉంటుందో.. అలాగే అత్యాచారాలకు కూడా గ్రేడింగ్ చేయాలి. లైంగిక నేరాలకు పాల్పడిన వారికి ఫస్ట్ డిగ్రీ అమలుచేయాలి. ఆ ఫస్ట్ డిగ్రీలో కెమికల్ కాస్ట్రేషన్‌ను చేర్చాలి. ఈ కెమికల్ కాస్ట్రేషన్‌ ద్వారా నిందితుల మగతనాన్ని తగ్గించాలి. అలా చేస్తే నిందితులు మళ్లీ జీవితంలో లైంగిక కార్యాకలాపాలకు పనిరాకుండా పోతారు. అటువంటి ఆలోచన ఉన్నవారిని కూడా ఈ పద్ధతి కంట్రల్‌లో ఉంచుతుంది’ అని అన్నారు.

సామూహిక అత్యాచారం కేసులో ఇద్దరు నిందితుల్లో ఒకరైన షఫ్కత్ అలీని పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. మహిళ డీఎన్ఏతో నిందితుడి డీఎన్ఏ మ్యాచ్ అయిందని.. మరో నిందితుడి కోసం గాలిస్తున్నామని ఒక సీనియర్ అధికారి తెలిపారు.

For More News..

అప్పు చెల్లించలేదని కిడ్నాప్ చేసి కొట్టిన హైదరాబాద్ కార్పొరేటర్

తెలంగాణలో మరో 2,058 కరోనా కేసులు

సుప్రీంకోర్టుకు రూపాయి ఫైన్‌‌ కట్టిన ప్రశాంత్‌ భూషణ్

Latest Updates